Share News

High Court : వర్మపై తొందరపాటు చర్యలొద్దు

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:26 AM

సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టడంపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

High Court : వర్మపై తొందరపాటు చర్యలొద్దు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టడంపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌పై గతేడాది సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అనకాపల్లి జిల్లా రావికమతం, గుంటూరు జిల్లా తుళ్లూరు, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రాంగోపాల్‌వర్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ... పిటిషనర్‌ తన సినిమా విడుదలపై గత ఏడాది ‘ఎక్స్‌’లో పోస్టులు పెట్టారన్నారు. దీనిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టారన్నారు. పోలీసులు పిటిషనర్‌ను అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన ఉందని, అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌పై నమోదైన కేసుల్లో పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవేనన్నారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను పిటిషనర్‌ తిరస్కరించారని తెలిపారు.


మరో కేసు విచారణ 11కు వాయిదా

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌పై సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాంగోపాల్‌ వర్మ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. ఈ నెల 9లోగా కౌంటర్‌ వేయాలని పోలీసులను న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ఆదేశించారు. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Dec 03 , 2024 | 05:26 AM