పిన్నెల్లికి హైకోర్టు షాక్
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:20 AM
మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల ధ్వంసం,
నేరారోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు
ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల ధ్వంసం, హత్యాయత్నం తదితర తీవ్ర నేరాభియోగాలతో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌కు ఆయన దాఖలుచేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ మొత్తం 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, గత ఎన్నికల సందర్భంగా కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారంటూ విచారణలో పోలీసులు తెలిపిన వివరాలను కోర్టు గుర్తు చేసింది. నేరాలకు పాల్పడడం పిటిషనర్ అలవాటుగా మార్చుకున్నారని పోలీసులు చెబుతున్నారని పేర్కొంది. బెయిల్ మంజూరు చేస్తే సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడింది. నేరఘటనలు పునరావృతం చేసే అవకాశం ఉందని పేర్కొంది. కేసుల దర్యాప్తు ప్రాఽథమిక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ మంజూరు చేస్తే నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. మరోవైపు ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారంలో పిటిషనర్ పై నమోదైన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న వైనందున తనను అరెస్ట్ చేయడానికి వీల్లేదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.
తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్న వాదనను కొట్టివేసింది. నోటీసులు ఇవ్వాలా?లేదా? అనేది దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని తెలిపింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం తప్పునిసరి ఏమీ కాదంది. ముందుస్తు బెయిల్ మంజూరు సమయంలో పిటిషనర్ పూర్వ నేరచరిత్ర, నేర తీవ్రత, పారిపోయే అవకాశం ఉందా? సాక్షులను బెదిరించడం, ఆధారాలు తారుమారు చేయడంచేస్తారా? వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపఽథ్యంలో పిటిషనర్ పై వచ్చిన నేరారోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లిఖార్జునరావు బుధవారం తీర్పు ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా, మే 13న ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన వ్యవహారంలో పల్నాడుజిల్లా రెంటచింతల పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసు నమోదు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేస్తుండగా పిన్నెల్లిని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, అతని అనుచరులు మరో 15 మంది పై హత్యాయత్నం(ఐపీసీ 307), మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వస్తున్న పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీసింది. దీంతో పిన్నెల్లి ఆమెను బూతులు తిట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో రెంటచింతల పోలీసులు పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలింగ్ తర్వాతి రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి, అనుచరులు కారంపూడిలో దాడులకు పాల్పడుతుండగా సీఐ నారాయణ స్వామి అడ్డుకున్నారు. దీంతో సీఐపై దాడి చేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదుతో పిన్నెల్లి సోదరులు, అతని అనుచరులు పై పోలీసులు హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయస్ధానం ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం నిర్ణయాన్ని వెల్లడించింది.