ఇదేం భాష..?
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:07 AM
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు వాడిన భాషపై హైకోర్టు మండిపడింది.
నగర ప్రథమ పౌరుడు మాట్లాడేది ఇలాగేనా?
కుటుంబ సభ్యులూ, తల్లులపైనా దాడులా?
గుంటూరు మేయర్ భాషను అంగీకరించలేం
కావటి మనోహర్ నాయుడిపై మండిపడిన హైకోర్టు
బాధ్యతగా మెలగాలని చెప్పండి.. లాయర్‌కు ఆదేశం
41(ఏ) నోటీసు ఇవ్వాలని పోలీసులకు నిర్దేశం
25న రావాలని ఆర్జీవీకి మళ్లీ నోటీసు
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు వాడిన భాషపై హైకోర్టు మండిపడింది. కార్పొరేషన్ మేయర్, నగర ప్రథమ పౌరుడు వాడే భాష ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు విధానాలు, పాలసీలను విమర్శించాలేగానీ... అసభ్య పదజాలంతో కుటుంబసభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. నగర మొదటి పౌరుడిగా బాధ్యతగా మెలగాలని మనోహర్‌నాయుడికి సూచించాలని ఆయన తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షపడేవే అయినందున నిందితుడికి సెక్షన్ 41(ఏ)కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 6వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను మేయర్ మనోహర్ నాయుడు దూషిస్తూ పోలీస్ లాఠీతో దాడి చేశారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత లోకేశ్‌లను అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్ పేట పోలీ్‌సస్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు మనోహర్‌నాయుడుపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ తరఫున న్యాయవాది పాలపర్తి ప్రభాకర్ వాదనలు వినిపించారు.
25న రండి.. ఆర్జీవీకి మళ్లీ పోలీసుల నోటీసు
ఒంగోలు క్రైం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు బుఽధవారం ఆర్‌జీవీ వాట్సా్‌పకు మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చారు. కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వర్మపై టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
సజ్జల భార్గవ్‌రెడ్డిపై కేసుల వివరాలివ్వండి: హైకోర్టు
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై నమోదైన కేసుల వివరాలు తమ ముందుంచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశ్‌నగర్ పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం పోలీసులు పెట్టిన కేసులోనూ ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యా లూ బుధవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. అరెస్టు నుంచి భార్గవ్‌రెడ్డికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పోలీసులు వివరాలు సమర్పించాక అన్ని విషయాలనూ పరిశీలిస్తామని స్పష్టంచేశారు.
‘‘ప్రజాస్వామ్యంలో గుంటూరు మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. సేవచేసి ప్రజలకు దగ్గరవ్వాలేతప్ప అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికలను గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడినవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. మనోహర్ నాయుడు వాడిన పదజాలాన్ని ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వినియోగించడాన్ని ఆమోదించలేం’’
- హైకోర్టు