ఉన్నత విద్య.. మిథ్య!
ABN , Publish Date - Mar 25 , 2024 | 05:08 AM
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విద్యారంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాం.
ఇంటర్ తర్వాత ఆపేస్తున్న విద్యార్థులు
జగన్ పాలనలో లక్షల మంది చదువుకు దూరం
2020-21, 2021-22ల్లో లక్ష మందికి పైనే
ఆల్ పాస్‌ను సాకుగా చూపిస్తున్న ప్రభుత్వం
అందరూ పాసైతే ఉన్నతవిద్య చదవకూడదా?
2022-23లోనూ 22వేల మంది డ్రాపవుట్
అయినా విద్యాభివృద్ధి అంటూ జగన్ గొప్పలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విద్యారంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాం. రాష్ట్రంలో చదువు మానేసే విద్యార్థే లేడు..’’ ఇలా బహిరంగ వేదికలపై ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు చూస్తే కోటలు దాటుతాయి. కానీ, ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు మాత్రం ఉన్నత విద్య చదివేందుకు కాలేజీల గేటు దాటడం లేదు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని వేలాది మంది విద్యార్థులు అక్కడితోనే ఆగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మారిన విధానాలు విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నాయి. విద్యా దీవెన నగదు సకాలంలో విడుదల చేయకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారింది. హడావిడిగా సింగిల్ మేజర్ డిగ్రీ ప్రవేశపెట్టిన ఉన్నత విద్యామండలి, దానిపై అవగాహన కల్పించడంలో నూరుశాతం విఫలమైంది. అసలు ఏ కోర్సు ఎక్కడుంది? ఏది చదవాలి? అన్నదానిపై కనీస అవగాహన విద్యార్థులకు లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జగన్ పాలనలో ఏటా వేలాది మంది ఇంటర్ తర్వాత చదువు ఆపేస్తున్నారు. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో అయితే ఏటా లక్ష మందికి పైగా ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లకుండా ఆగిపోయారు.
ఉన్నత విద్యలో ఎంతమంది..?
2022-23 విద్యా సంవత్సరంలో 3,37,987 మంది ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించారు. వారిలో ఇంజనీరింగ్‌లో 1.2లక్షల మంది, ఫార్మసీలో 12వేలు, అగ్రికల్చర్ కోర్సుల్లో 5వేలు, మెడికల్, నర్సింగ్‌లో 15వేలు, డిగ్రీలో 1.48లక్షలు, జాతీయ విద్యా సంస్థల్లో 5,600 మంది చేరారని, 10వేల మంది ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోయారని ఉన్నత విద్యామండలి తాజా నివేదిక వెల్లడించింది. అంటే.. 22,387 మంది ఇంటర్ తర్వాత చదువులు ఆపేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో 46,954 మంది ఉన్నత విద్యకు వెళ్లకుండా ఆగిపోయారు. 2020-21లో 1,01,824 మంది, 2021-22లో 1,18,302 మంది ఇంటర్‌తోనే ఆపేశారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో కొవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా ఆల్ పాస్ చేశారని, అందుకే ఆ సంవత్సరాల్లో ఎక్కువ మంది డ్రాపౌట్ అయ్యారని విద్యా మండలి సాకులు చెబుతోంది. వాస్తవానికి ప్రభుత్వం అందరినీ ఆల్ పాస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలి. కానీ అందుకు విరుద్ధంగా లక్షల మంది డ్రాపౌట్ అయ్యారు. కాగా అంతకముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018-19 విద్యా సంవత్సరంలో 81,813 మంది ఇంటర్ వరకే చదివారని నివేదిక చెబుతోంది. ఆ తర్వాత సీఎం జగన్ విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడు ఉన్నత విద్య చదివే వారి సంఖ్య ఎందుకు పెరగలేదనేది మాత్రం చెప్పడం లేదు.
వలసలపైనా అబద్ధాలే
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్య కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. గతంతో పోలిస్తే ఏటా తెలంగాణ ఎంసెట్ రాసేవారి సంఖ్య పెరిగింది. రెండేళ్ల నుంచి ఏటా 40వేల మంది చొప్పున ఏపీ విద్యార్థులు టీఎ్‌స-ఎంసెట్ రాస్తున్నారు. వారితో పాటు మేనేజ్‌మెంట్ కోటాలోనూ భారీగా ఏపీ విద్యార్థులు అక్కడి కాలేజీల్లో చేరుతున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు విద్యార్థులు వలస వెళ్తున్నారు. కానీ 10వేల మంది మాత్రమే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లు ఉన్నత విద్యామండలి సొంత లెక్కలు వేసింది. 2018-19 నుంచి 2022-23 వరకు ఏటా 10వేల మంది వలస వెళ్తున్నట్లు లెక్కలు వేసింది. అప్పటితో పోలిస్తే ఇటీవల వలస వెళ్లేవారి సంఖ్య పెరిగినా తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
డిగ్రీ అడ్మిషన్లు ఢమాల్
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది సాధారణ డిగ్రీ కోర్సులు చదువుతుంటారు. కానీ జగన్ ప్రభుత్వంలో డిగ్రీ అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. డిగ్రీ కోర్సుల్లో... 2018-19లో 1,94,388 మంది, 2019-20లో 2,17,217 మంది, 2020-21లో 2,57,584 మంది, 2021-22లో 2,47,666 మంది చేరారు. కానీ 2022-23లో ఒక్కసారిగా లక్ష మంది డిగ్రీ కోర్సులకు దూరమయ్యారు. ఆ సంవత్సరంలో 1.48లక్షల మంది మాత్రమే డిగ్రీలో చేరారు. పోనీ బదులుగా ఇంజనీరింగ్‌లో చేరినవారి సంఖ్య విపరీతంగా పెరిగిందా అంటే అదీ లేదు. నాలుగేళ్ల డిగ్రీ విధానం, ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభించిన ఉన్నత విద్యామండలి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోయింది. ఇక ఈ విద్యా సంవత్సరంలోనూ డిగ్రీ అడ్మిషన్లు 1.5లక్షలు దాటలేదు. ఈ ఏడాది సింగిల్ మేజర్ డిగ్రీ విధానం ప్రవేశపెట్టిన విద్యామండలి దానిపై ఇంటర్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పి వదిలేసింది. వాస్తవానికి జాతీయ విద్యా విధానంలో ఉన్న సింగిల్ మేజర్ డిగ్రీని వెంటనే అమలుచేయాలని నిబంధనలు లేకపోయినా, మేమే ముందు చేశాం అనే గొప్ప కోసం పిల్లలకు అర్థం కాకపోయినా హడావిడిగా అమలుచేసింది.