ఏ అర్హతతో ప్రతిపక్ష హోదా అడుగుతారు?
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:01 AM
ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి, మాట్లాడే అవకాశం ఉన్నా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో కూర్చోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.

అయ్యన్న, రఘురామ ఉంటారనే జగన్ సభకు రావట్లేదు: హోంమంత్రి
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి, మాట్లాడే అవకాశం ఉన్నా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో కూర్చోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్న జగన్..ఏ అర్హతతో హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాడని రూ.11 పందేలు కాస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని చెప్పారు. ‘స్పీకర్‌గా అయ్యన్న, డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఉంటారనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు. జగన్ అసెంబ్లీకి వస్తే.. మాట్లాడే అవకాశం వచ్చేది. తప్పుడు పోస్టులు పెట్టి, మహిళల వ్యక్తిత్వ హననం చేస్తున్న వారికి నోటీసులిచ్చి, అరెస్ట్ చేస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ఏపీలో రాజ్యాంగం అమలు కావట్లేదని వైసీపీ సీనియర్ నేతలు మావన హక్కుల సంఘానికి వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. తప్పు చేసిన వారిపై చర్య తీసుకుంటే తప్పా? రాజకీయ ముసుగులో ఉన్మాదంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆర్గనైజింగ్ క్రైమ్‌కు వర్రా రవీంద్రరెడ్డి వాంగ్మూలమే ఉదాహరణ. సభ్యసమాజం సిగ్గుపడేలా పోస్టులు పెట్టిన వారికి వైవీ సుబ్బారెడ్డి లాంటివాళ్లు వంత పాడటం సిగ్గుచేటు. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించినా.. అవమానపర్చినా చూస్తూ ఊరుకునేది లేదు’ అని అనిత హెచ్చరించారు.