మారని తీరుతో మార్పు ఎలా..?
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:01 AM
జరిమానా ఎంతైనా విధించండి. మొత్తం చెల్లిస్తాం. హెల్మెట్ మాత్రం అడగొద్దు అన్నట్టుంది విజయవాడలోని ద్విచక్ర వాహనదారుల పరిస్థితి. ట్రాఫిక్ పోలీసుల తీరు కూడా అందుకు తగినట్టుగానే ఉంది.
జరిమానా ఎంతైనా విధించండి. మొత్తం చెల్లిస్తాం. హెల్మెట్ మాత్రం అడగొద్దు అన్నట్టుంది విజయవాడలోని ద్విచక్ర వాహనదారుల పరిస్థితి. ట్రాఫిక్ పోలీసుల తీరు కూడా అందుకు తగినట్టుగానే ఉంది. జరిమానా విధిస్తున్నారే కానీ వారిలో మార్పు తీసుకురాలేకపోతున్నారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో సగం మంది హెల్మెట్ లేకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల్లో నెలకు సరాసరిన 22 మంది చనిపోతున్నారు. విజయవాడలో 30లక్షల వరకు వాహనాలున్నాయి. అందులో 10లక్షల వరకు ద్విచక్ర వాహనాలున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఎక్కువ మంది హెల్మెట్ జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. ప్రతి 100 మందిలో 25-30 మంది మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నారు. ఇటీవల హెల్మెట్ ధారణను కచ్చితంగా అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనితో ట్రాఫిక్ పోలీసులు మళ్లీ జూలు విదిల్చడం మొదలుపెట్టారు.
- ఆంధ్రజ్యోతి, విజయవాడ
పోలీసు శాఖలోని అన్ని విభాగాలకు ప్రతి ఏడాది ఒక టార్గెట్ ఉంటుంది. ట్రాఫిక్ విభాగానికి ఈ-చలాన్ విధింపునకు టార్గెట్ పెట్టుకుంటారు. అవి లక్ష్యంతోపాటు లక్షలు దాటుతున్నా మార్పు కనిపించడం లేదు. నగరంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించిన పోలీసులు రూ.100 జరిమానా విధిస్తున్నారు. ఇది కాకుండా ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నందుకు రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మొత్తంగా రూ.1100 జరిమానాను విధిస్తున్నా వాహనదారులు తలపై హెల్మెట్ పెట్టుకునే పరిస్థితి నగరంలో కనిపించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు హడావుడి చేస్తారన్న విషయాన్ని వాహనదారులు గమనించారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడంతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేసినప్పుడు ప్రతి వాహనదారుడి తలపై హెల్మెట్ కనిపిస్తుందని రహదారి భద్రతపై పనిచేసే స్వచ్చంద సంస్థలు చెబుతున్నాయి.
స్టాప్ ఉండదు.. జీబ్రా కనిపించదు..
స్టాప్‌లైన్, జీబ్రాలైన్ రహదారులపై కూడళ్ల వద్ద కనిపించాలి. వాటిపై వాహనదారులకు, పాదచారులకు అవగాహన ఉండాలి. అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రతి కూడలిలో వాహనాలు ఆగే ప్రదేశంలో ముందుగా జీబ్రాలైన్, వెనుక స్టాప్‌లైన్ ఉంటుంది. గ్రీన్‌సిగ్నల్ ఆరెంజ్‌లోకి మారినప్పుడు వేగాన్ని తగ్గించుకోవాలి. రెడ్‌సిగ్నల్ పడగానే వాహనాలను ఆపుకోవాలి. ఇలా ఆగే వాహనాలు స్టాప్‌లైన్‌ను తాకకూడదు. ఒకవేళ తాకితే ఎదురుగా ఉండే సీసీ కెమెరా ఫొటో క్లిక్‌మనిపిస్తుంది. దాని ప్రకారం ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. ఇక జీబ్రాలైన్ పూర్తిగా పాదచారులకు సంబంధించినది. కూడలిని ఒక వైపు నుంచి మరో వైపునకు దాటే పాదచారులు దీని మీదుగా నడవాలి. ప్రతి కూడలిలో పాదచారుల అడుగులను నియంత్రించే సిగ్నల్‌ను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో వాహనాలకు సిగ్నల్స్ ఉన్నట్టే పాదచారులకు సిగ్నల్స్ ఉంటాయి. విజయవాడలో పరిస్థితి లేదు. కేవలం వాహనాల రాకపోకలను మాత్రమే సిగ్నల్స్ నియంత్రిస్తున్నాయి. నగరంలో ఏ కూడలి వద్ద స్టాప్‌లైన్, జీబ్రీలైన్ కనిపించవు. ఒకవేళ ఉన్నా వాహనదారులకు, పాదచారులకు అవగాహన లేని పరిస్థితి. రెడ్‌సిగ్నల్ పడినప్పుడు స్టాప్‌లైన్ వెనుక ఆగాల్సిన వాహనదారులు జీబ్రాలైన్ దాటుకుని ముందుకొస్తారు. కొంతమంది సరిగ్గా జీబ్రాలైన్ మీదే ఆగుతారు. వాటి మధ్య నుంచి పాదచారులు దాటుతుంటారు.
కనిపించని ‘ఈఈఈ’
ఈఈఈ... ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్ ట్రాఫిక్ విభాగానికి ఈ మూడు ముఖ్యమైన భాగాలు. దేశంలో మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ ఒక క్రమబద్దీకరణ ప్రకారం నడుస్తుందంటే ప్రధాన కారణం ఇదే. పొరుగున ఉన్న హైదరాబాద్ నగరంలో 2010 నుంచి ఈఈఈని అమలు చేస్తున్నారు. ఫలితాలు నాలుగైదేళ్ల తర్వాత కనిపించాయి. ప్రస్తుతం ట్రాఫిక్ అవగాహన ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడలో మాత్రం ఈఈఈ ఛాయలు ఎక్కడా లేదు. ఒక ఈ మాత్రమే కనిపిస్తోంది. వారాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మాత్రం నిర్వహిస్తున్నారు. నంబర్లు ప్లేట్, రికార్డులు లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు చలాన్లు విధిస్తున్నారు. వీటిని వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఇంజనీరింగ్ కొద్ది రోజులుగా నగరంలో కొనసాగుతోంది. పోలీసు కమిషనర్, ట్రాఫిక్ విభాగాధికారులు నగరంలో పర్యటించి ట్రాఫిక్ ఆగిపోతున్న ప్రదేశాలను గుర్తించారు. అక్కడ మార్పులను వీఎంసీ అధికారులకు వివరించి సరిచేయించారు. ఇది కొంత వరకు ఫలితాలను ఇస్తోంది.
తగినంత ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదు : వాసు, వీడు (వలంటరీ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎకానమిక్ డెవల్‌పమెంట్ యూనిట్)
కేరళలోని కొచ్చి, తమిళనాడు చెన్నై, కొయంబత్తూరు, మధురైలో హెల్మెట్ నిబంధన కచ్చితంగా అమలు చేస్తారు. హెల్మెట్ ధరించి చిన్‌స్ట్రాప్ పెట్టుకోకపోయినా జరిమానా విధిస్తారు. అందుకే అక్కడ మరణాల సంఖ్య చాలా తక్కువ. జాతీయ రహదారికి ఎడమ వైపు షోల్డర్ లైన్ ఉంటుంది. అందులోనే వెళ్లాలి. దీన్ని నగరం నుంచి వెళ్లే జాతీయ రహదారిపై ఎవరూ పాటించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు.
నిత్య ఉల్లంఘనలు
సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వాహనంపై జంక్షన్ దాటడం
సమీపంలో ఉన్న యూటర్న్ నుంచి వెళ్లడానికి వ్యతిరేక దిశలో వెళ్లడం
రహదారులపై వేగ పరిమితిని వదిలేసి రాకెట్ మాదిరిగా దూసుకెళ్లడం
ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను స్టాప్‌లకు పక్కన కాకుండా రహదారికి మధ్యలో నిలుపుదల చేయడం.
ఏం చేయాలి?
వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడానికి ప్రతి కూడలిలో విస్తృతంగా ప్రచారం జరగాలి. ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు వివరించాలి.
ఇది పూర్తయ్యాక ట్రాఫిక్ నిబంధనలను ఎప్పటి నుంచి పటిష్టంగా అమలు చేస్తారో తెలపాలి. కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. కొన్ని కూడళ్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలు ఉన్నాయి. వాటిలో ప్రకటనలు చేయించాలి.
పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ను కొన్ని రోజులపాటు సస్పెండ్ చేయడమో, రద్దు చేయడమో చేయాలి.
ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సమన్వయంతో వ్యవహరించాలి.
కూడళ్లలో స్టాప్‌లైన్, జీబ్రా లైన్ల వ్యత్యాసాలను వాహనదారులకు తెలపాలి.
ట్రాఫిక్ సిగ్నల్స్ కచ్చితంగా అనుసరించేలా అవగాహన పెంచాలి.