వేటకు వెళ్లి బలయ్యాడు!
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:11 AM
అడవి పందుల కోసం వేటకు వెళ్లిన వారిపై మరో గ్రామానికి చెందిన వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
రాయచోటి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అడవి పందుల కోసం వేటకు వెళ్లిన వారిపై మరో గ్రామానికి చెందిన వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. సంబేపల్లె మండలం నామాలకుంటకు చెందిన కొందరు రాయచోటి మండలం కాటిమాయకుంట వద్ద గుడిసెలు వేసుకుని పాతసామాన్ల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. వారిలో కొందరు పందులు సంచరించే ప్రాంతంలో ఆహార పదార్థాల్లో పేలుడు పదార్థాలు ఉంచి శనివారం అర్ధరాత్రి తర్వాత అడవిలోకి వెళ్లారు. అప్పటికే రాయచోటికి సమీపంలోని మాధవరం గ్రామానికి చెందిన కొందరు అడవి పందుల వేటకు వచ్చి కాపు కాశారు. ఇది తెలియని కాటిమాయకుంటకు చెందిన వేటగాళ్లు చెట్ల పొదల్లోకి పందుల కళేబరాల కోసం వెళ్లారు. ఆ అలికిడి విని.. అడవి పందులు అనుకుని.. కాపు కాసిన వేటగాళ్లు నాటుతుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హనుమంతు(40) అనే వ్యక్తి మృతి చెందగా, రమణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారిని తొలుత రాయచోటి ప్రభుత్వాసుపత్రికి, ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందాడు.