Share News

రొయ్యల కంపెనీలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీక్‌

ABN , Publish Date - Nov 03 , 2024 | 03:51 AM

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్నమఠంలోని రాయల్‌ మెరైన్‌ రొయ్యల ప్రొసెసింగ్‌ కంపెనీలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీక్‌ అవడంతో 107 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని నిజాంపట్నం వైద్యశాలకు తరలించారు.

రొయ్యల కంపెనీలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీక్‌

107 మందికి అస్వస్థత

నలుగురి పరిస్థితి విషమం.. గుంటూరు తరలింపు

యాజమాన్యంపై కేసు నమోదుకు ఆదేశం

రేపల్లె, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్నమఠంలోని రాయల్‌ మెరైన్‌ రొయ్యల ప్రొసెసింగ్‌ కంపెనీలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీక్‌ అవడంతో 107 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని నిజాంపట్నం వైద్యశాలకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించారు. రాయల్‌ మెరైన్‌ రొయ్యల ఫిల్లింగ్‌ షెడ్డులో శనివారం మధ్యాహ్నం హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీకయ్యింది. ఆ యాసిడ్‌ గాలిని పీల్చడంతో ప్రొసెసింగ్‌ యూనిట్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సహచర కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. కంపెనీ బయట రోడ్డుపైనే కొంతమంది అస్వస్థతకు గురై పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తన సోదరుడు శివప్రసాద్‌ను వైద్యశాలకు పంపించారు. ప్రథమ చికిత్సతోనే 70 మంది మహిళా కార్మికులు కోలుకోగా, నిజాంపట్నంలో ఇంకా 30 మంది చికిత్స పొందుతున్నారు. నలుగురు మహిళా కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కర్లపాలెం, పిట్టలవారిపాలెం, బావూజీపాలెం, గోకర్నమటం గ్రామాలకు చెందిన మహిళలు శనివారం కూడా కంపెనీలో రొయ్యల తలకాయలు తీయడానికి వచ్చారు. అక్కడ పనిచేసే సూపర్‌వైజర్లు క్లీనింగ్‌ చేయడానికి అవసరమైన కెమికల్‌ను కాకుండా మరో ప్రమాదకరమైన కెమికల్‌ను విడుదల చేయడం వల్లనే కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు వందలాదిగా కంపెనీకి తరలివచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సంఘటన జరిగిన కంపెనీని కలెక్టర్‌ మురళి, ఆర్డీవో రామలక్ష్మి, డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, మంత్రి సోదరుడు శివప్రసాద్‌ పరిశీలించారు. సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కలెక్టర్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనపై విచారించి కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలలో బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. మెరుగైన వైద్యసేవల కోసం ఇద్దరిని తెనాలి, మరో ఇద్దరిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు, మరో ఇద్దరిని గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.

రాయల్‌ మెరైన్‌ కంపెనీ, భవనం టీడీపీ నాయకులదే!

రాయల్‌ మెరైన్‌ కంపెనీ అద్దె భవనంలో కొనసాగుతోంది. ఆ భవనం టీడీపీ నాయకులదే. రాయల్‌ మెరైన్‌ కంపెనీ బాపట్లకు చెందిన ఓ టీడీపీ నేతకు చెందినది. దీంతో యాజమాన్యానికి ప్రజాసంఘాలు, కొంతమంది ప్రజాప్రతినిధులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Nov 03 , 2024 | 03:52 AM