Share News

జగన్‌ మళ్లీ వస్తే జనాలూ తాకట్టే

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:49 AM

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రానికి అరిష్టమని, ఆయనంతటి కరుడుగట్టిన నేరస్తుడు, అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.

జగన్‌ మళ్లీ వస్తే జనాలూ తాకట్టే

రాష్ట్రానికే అరిష్టం.. ఓడిపోతేనే మోక్షం

అంత కరుడుగట్టిన నేరస్తుడు,

అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడు

బూతులు తిట్టే వారికే వైసీపీలో సీట్లు

ఇంకా 80 మందిని మార్చుతాడంట

అంటే ఓటమిని ఒప్పుకొంటున్నట్టే

అరాచక పాలనకు అంతం పలుకుదాం

అంతా గర్వపడేలా స్వర్ణాంధ్ర సాధిద్దాం

తుని, బొబ్బిలి సభల్లో బాబు పిలుపు

సీఎం ఏం చెప్పినా రివర్స్‌ గేరే.. చాలా పేదోడని చెబుతుంటాడు

అవును ఇల్లే కాదు.. డ్రాయరూ లేదు.. అడుక్కు తింటున్నాడు

కాకినాడ/విజయనగరం (ఆంధ్రజ్యోతి)/బొబ్బిలి, జనవరి 10: ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రానికి అరిష్టమని, ఆయనంతటి కరుడుగట్టిన నేరస్తుడు, అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అటువంటి వ్యక్తి అధికారం నుంచి దిగిపోతేనే రాష్ట్రానికి మోక్షమన్నారు. ఒకవేళ మళ్లీ జగన్‌ వస్తే చివరకు ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తాడని హెచ్చరించారు. అందుకే వైసీపీ రాతియుగం పోవాలని, టీడీపీ, జనసేన స్వర్ణయుగం రావాలని పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ జిల్లా తుని, విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన రా.. కదలి రా బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఓటమి భయంతో ఎమ్మెల్యేలు, మంత్రులను నియోజకవర్గాల నుంచి తీసేస్తున్న జగన్‌ బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలనే బలిచేస్తున్నారని, సీఎం సామాజికవర్గ నేతలను ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. సైకో జగన్‌ ఏం చెప్పినా రివర్స్‌లో అర్థం చేసుకోవాలన్నారు. పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు వేస్తే ఆ కరుడుగట్టిన నేరస్తుడి ముఖాన్ని రోజూ ఇళ్లల్లో జనం చూడాలా.. ఇదెక్కడి అరాచకమని ప్రశ్నించారు.

సంక్రాంతి సంకల్పం ఇదే

‘సీఎం జగన్‌ అహంకార వ్యక్తి. ఆ అహంకారమే జగన్‌ అంతానికి దారితీస్తుంది. ఒక్క చాన్స్‌ అని అధికారంలోకి వచ్చిన జగన్‌ నిత్యం ప్రజలను పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఈసారి ఆయన్ను చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. ఈ సంక్రాంతికి ఒక్కటే సంకల్పం. జగన్‌ రాతియుగం పోవాలి. టీడీపీ, జనసేన స్వర్ణయుగం రావాలి. ఐదు కోట్ల జనం గెలవాలా.. సైకో జగన్‌ గెలవాలా ఆలోచించండి. టీడీపీ, జనసేన రాకతో రాష్ట్రంలో మళ్లీ పేదల రాజ్యం, సంక్షేమ రాజ్యం రాబోతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటోవాళ్లు భయపడొద్దు. వారిని కూడా ఆదుకుంటాం. మత్స్యకారులను దెబ్బకొట్టే 217 జీవోను తెచ్చిన జగన్‌కు బుద్ధి రావాలి అని అన్నారు.

జగన్‌ నకిలీ సీఎం...

‘డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీను జగన్‌ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అసలు జగన్‌కు సిగ్గుందా? జగన్‌ పాలనతో రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీలను ఆయన నీచంగా చూస్తారు. జగన్‌ అప్పుల అప్పారావులా మారాడు. రాష్ట్ర ఆదాయంతో సమానంగా అప్పులు, వడ్డీలు కడుతున్నాడు. అప్పులు పుట్టించడం కోసం రైతుబజార్లు, కలెక్టరేట్‌ కూడా తాకట్టు పెట్టేశాడు. అమరావతిని చంపేశాడు. మూడు ముక్కలు చేశాడు. మళ్లీ చెబుతున్నా అమరావతే ఏపీ రాజధాని. జగన్‌ నకిలీ ముఖ్యమంత్రి. కాపులకు రూ.10వేల కోట్లతో కార్పొరేషన్‌ అన్నాడు. ఏమైంది? ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి. నేరం చేసేది ఆయనే. ఆ నేరం ఇంకొకరిపై మోపేదీ ఆయనే. బాబాయ్‌ను హత్య చేసి గొడ్డలి పోటు అని నేరం మాపై మోపాడు. జగన్‌ను అందరూ అర్థం చేసుకున్నారు. ఎన్నికలు దగ్గరపడ్డంతో జగన్‌ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మాట్లాడితే పేదలు, పెత్తందార్ల మధ్య పోటీ అంటాడు. తప్పులు చేసి నేరం ఇంకొకరిపై మోపే వ్యక్తికి పాలించే అర్హత లేదు. ప్రశ్నిస్తే కేసులు. పోలీసులతో వేధింపులు. అందుకే ఏపీ హేట్స్‌ జగన్‌ హ్యాష్‌ ట్యాగ్‌ హోరెత్తిపోతోంది’ అని అన్నారు. ‘రాష్ట్రంలో జగన్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. భరించలేరని ప్రజలు నిర్ణయించేశారు. కానీ ఇది తెలియదన్నట్లు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఇంకా 80మందిని మార్చుతాడంట. అంటే ఓటమిని అంగీకరించినట్టే. ఆ సీట్లు కూడా వైసీపీకి గోవిందా. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను మార్చుతున్న జగన్‌ మంత్రి పెద్దిరెడ్డిని ఎందుకు మార్చరు? ఇదేనా సామాజిక న్యాయం అంటే. జగన్‌కు బినామీ ఎమ్మెల్యే ద్వారంపూడి బియ్యంలో కోట్లు గడించారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కన్నబాబు అవినీతికి లెక్కేలేదు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే జగన్‌ పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి. ఆయన వల్ల రాష్ట్రం బ్రాండ్‌ పోయింది. ఏపీ అంటేనే అంతా భయపడిపోతున్నారు. మెడపై కత్తిపెట్టి కాకినాడలో సెజ్‌లు, పోర్టులు కొట్టేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

నేరస్తుడి బొమ్మ చూడాలా..

‘జగన్‌ లాంటి కరుడుగట్టిన నేరస్తుడి బొమ్మ రోజూ రాష్ట్రంలో అందరూ చూడాలా? ఇంట్లో అన్నింటిపైనా ఆయన బొమ్మపెడతారా. ఏంటీ అన్యాయం.. ఏంటీ అరాచకం? జగన్‌ ప్రభుత్వం తెచ్చిన భూరక్షణ చట్టం చూస్తే మీ ఆస్తులపై మీకు హక్కులు ఉండవు. రాష్ట్రం అంతా జగన్‌దే అయిపోతోంది. మంత్రి ధర్మాన కూడా ఈ చట్టంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది సమగ్ర భూరక్షణ చట్టం కాదు భూ భక్షణ చట్టం. అత్యంత ప్రమాదం. జగన్‌ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి మోక్షం. కరుడుగట్టిన ఇటువంటి వ్యక్తికి మళ్లీ అధికారం ఇవ్వొద్దు’ అని చంద్రబాబు అన్నారు. ‘విభజిత రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తూ అమరావతి రాజధానికి అంకురార్పణ చేశాం. రాష్ట్రంలోని వనరులను వినియోగించుకుని తెలుగుజాతి గర్వపడే లా ఎందులోనూ తీసిపోమని, ఓ ప్రణాళికతో ప్రపంచంలోనే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే విధంగా పునాదులు వేశాం. దురదృష్టవశాత్తు ఒక్క చాన్స్‌ పేరుతో సైకో పాలన వచ్చింది. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారు. రైతు, యువత, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల్లోనూ అశాంతిని రేపారు. బొబ్బిలి నుంచే అవినీతి పాలనపై గర్జిద్దాం. ఎంతోమంది ప్రముఖులను కన్న విజయనగరం గడ్డ వీరత్వానికి ప్రతీక. ప్రతిఒక్కరూ తాండ్రపాపారాయుల్లా గర్జించాలి. గురజాడ, కోడిరామ్మూర్తి, ఆదిభట్ల, సుశీల, ఘంటశాల వంటి ఎంతో మంది ప్రముఖులు నడయాడిన గడ్డ. వారు మనకు అందించిన వారసత్వాన్ని నిలబెడదాం. ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుదాం. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా చేసుకుని స్వర్ణాంధ్ర సాధనకు నడుం బిగిద్దాం. రా కదలిరా..’ అని బొబ్బిలి సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.

బూతులు తిట్టేవారికి సీట్లా

‘ఎన్నికలు వస్తున్నాయి. వైసీపీలో బూతులు తిట్టేవారికి, తిట్లదండకం చేసే వారికే సీట్లు కేటాయిస్తున్నారు. వైసీపీ నాయకులు బూతుల్లో పద్మశ్రీ, రత్నశ్రీ, భూషణ్‌, పద్మ విభూషణ్‌, బూతు సామ్రాట్లుగా బిరుదులు పొందుతున్నారు. ఒక నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేగా పనిచేసిన వారిని వేరే నియోజకవర్గానికి పంపిస్తున్నారు. ఇక్కడ చెత్త ఎమ్మెల్యే వేరే నియోజకవర్గానికెళితే బంగారం అవుతారా? టీడీపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తాం. ఉద్యోగ భద్రత కోసం పోరాడుతుంటే ఎమ్మెల్యే శంబంగి అంగన్వాడీలకు ఒళ్లు బలిసిందా అంటూ బలిసిన వాఖ్యలు చేయడం దారుణం. జీతం పెంచాలని డిమాండ్‌ చేస్తే ఎస్మా ప్రయోగం చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచారు. మేము ఇసుక ఉచితంగా అందిస్తే నేరమని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఇసుకను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. అన్నం తింటున్నారా.. ఇసుక తింటున్నారా.. గడ్డి తింటున్నారా? అన్నా క్యాంటీన్లను మూసివేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను మండల స్థాయి వరకు ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.

‘ఈ దేశంలోనే అతిపెద్ద పెత్తందారుడు జగనే. రూ.510 కోట్ల ఆదాయాన్ని అఫిడవిట్‌లో చూపిన జగన్‌ నిజంగా పేదోడే. ఆయనకు ఇల్లే కాదు.. చివరకు డ్రాయర్‌ కూడా లేదు. రోజూ భిక్షం అడుగుతున్నాడు. అందులో వచ్చే డబ్బులతోనే తింటున్నాడు. ఆయనకు తల్లీ, చెల్లీ కూడా లేరు’

- తుని సభలో చంద్రబాబు

ఓటు అనే ఆయుధంతో వైసీపీ అరాచక పాలనకు అంతం పలుకుదాం. ఈ ఐదేళ్లలో మనల్ని రాతియుగం నాటి మనుషుల్లా మార్చేశారు. అన్యాయం, దౌర్జన్యం, అణచివేతలు, అరాచకాలు, అభివృద్ధి వినాశనం, భూ దందాలు, ఇసుక దందాలు, ప్రశ్నిస్తే కేసులతో పాలన సాగించారు. ఇంతటి దుర్మార్గ పాలనపై తిరగబడే రోజులు వచ్చాయి’ - బొబ్బిలి సభలో చంద్రబాబు ఉద్యోగాలు కల్పిస్తాం

‘అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలకు అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలు స్థాపించి ఉన్న ఊళ్లలో తల్లిదండ్రుల చెంతనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యువగళం పేరుతో నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఐటీ రంగంలో యువత అమెరికా వంటి ఇతర దేశాల్లో పనిచేసినా.. స్థానికంగానే పనిచేసేలా గ్రామాల్లో వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. గతంలో ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన ఫలితంగానే నాకు కష్టం వచ్చినపుడు 80 దేశాల నుంచి ఐటీ తదితర రంగాల ఉద్యోగులు మద్దతు పలికారు’ అని చంద్రబాబు ప్రకటించారు.

విశాఖ భూములు లూటీ చేశారు.

‘విశాఖ భూములను లూటీ చేశారు. భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం, భావనపాడు పోర్టు టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసినవే. వీటికే మళ్లీ శంకుస్థాపన చేసి అరాచకాలు చేస్తున్నారు. ఓటర్లను తొలగించి అరాచక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇన్ని అభ్యంతరాలు, ఫిర్యాదులు ఏ రాష్ట్రంలోనూ లేవని కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం హెచ్చరించింది. అరాచక పాలన నుంచి తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేద్దాం. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం, పిల్లల భవిష్యత్‌ కోసం ప్రణాళికలు, సాగునీరు, బోర్లు, సోలార్‌ పంపుసెట్లు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు కంకణబద్ధులమని భవిష్యత్‌ గ్యారెంటీకి శపథం చేస్తున్నాం’ అని చంద్రబాబు ప్రకటించారు.

Updated Date - Jan 11 , 2024 | 03:49 AM