Share News

వెళ్లొద్దని మేం చెప్పామా?

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:40 AM

తిరుమల వెళ్లవద్దని మాజీ సీఎం జగన్‌కు తామెవరం చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

వెళ్లొద్దని మేం చెప్పామా?

తాను సీఎంగా ఉండగా డిక్లరేషన్‌ అడగలేదని జగన్‌ వాదించడం సరికాదు. నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి అడగలేదు. బయట ఎక్కడి నుంచో నువ్వు తెచ్చిపెట్టిన అధికారి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ రోజు నిన్ను అడగలేదు.

ఈ వ్యక్తి కొలంబియా ఎస్కోబార్‌ వంటివాడని గతంలోనే చెప్పాను. ఇప్పటివరకూ చేసిన పనులన్నీ అతడి మాదిరిగానే ఉన్నాయి. భవిష్యత్‌లో చేసేవి కూడా అలాగే ఉంటాయి.

- సీఎం చంద్రబాబు

సాకులు వెతుక్కుని జగనే తిరుమల వెళ్లకపోతే మేమేం చేస్తాం: చంద్రబాబు

ఆయనకు నోటీసులిస్తే చూపించమనండి

అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడతారా?

డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టం లేకే మానేశారు

నాడు ఇవ్వలేదు కాబట్టి నేడు ఇవ్వననడం పద్ధతా?

ఒకసారి ధిక్కరించామని మళ్లీ మళ్లీ చేస్తారా?

సంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందే పాటించనంటూ రౌడీయిజం చేస్తారా?

నెయ్యిలో కల్తీ నిజమని ల్యాబ్‌ తేల్చింది దానిని మేం బయటపెట్టకుండా..

వేరే విధంగా బయటకు వస్తే పరిస్థితేంటి?

దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా: సీఎం

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల వెళ్లవద్దని మాజీ సీఎం జగన్‌కు తామెవరం చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయనే సాకులు వెతుక్కుని వెళ్లకపోతే తామేం చేస్తామని ప్రశ్నించారు. తాను ఆగిపోయి ఆ నెపం మరొకరి మీద వేయాలని చూస్తే మౌనంగా వింటూ ఉండలేమని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల పర్యటనకు సంబంధించి జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘స్వామిపై భక్తి ఉన్నవారు ఎవరైనా తిరుమలకు వెళ్లవచ్చు. వేరే మతాల వారు వెళ్లాలనుకుంటే అక్కడి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నిశ్చింతగా వెళ్లిరావచ్చు. జగన్‌ను తిరుమల పోవద్దని ఎవరూ చెప్పలేదు. ర్యాలీలు, ప్రదర్శనలు మాత్రం వద్దని చెప్పారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి సమయంలో వేల మందితో ర్యాలీలు చేస్తామని అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ప్రకటనలు ఇచ్చారు. అటువంటివి జరగకుండా స్థానికంగా పోలీసు యాక్టు 30 విధించి ర్యాలీలు, ప్రదర్శనలు చేయవద్దని ఆదేశాలిచ్చారు. జగన్‌కు వ్యక్తిగతంగా ఏ నోటీసూ ఇవ్వలేదు. తిరుపతిలో ఉన్న ఆయన పార్టీ నేతలకు మాత్రమే ర్యాలీలు చేయవద్దని నోటీసులిచ్చారు. ఆయనకు ఇచ్చి ఉంటే చూపించమనండి. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం సరికాదు. తిరుమల హిందువులకు పెద్ద పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా స్వామిని సందర్శించి మొక్కులు తీర్చుకోవాలన్నది అనేక మంది కోరిక. ఆ ఆలయంలో కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నప్పుడు దానిని పాటించడం సందర్శించేవారు పాటించాల్సిన కనీస ధర్మం. తిరుమల పవిత్రతను అందరూ కాపాడాలి. ఆగమ పద్ధతులు, ఆలయ సంప్రదాయాలు పాటించకపోతే భక్తులు బాధపడతారు. ఇంతకు ముందు కూడా డిక్లరేషన్‌ ఇవ్వకుండా వెళ్లాను కాబట్టి మళ్లీ వెళ్తాననడం ఏం పద్ధతి? ఒకసారి ధిక్కరించారు కాబట్టి మళ్లీ మళ్లీ ధిక్కరిస్తారా? చట్టాలను మనమే గౌరవించకపోతే ఇక ప్రజలు ఎందుకు గౌరవించాలి? ఏ సంప్రదాయాలూ పాటించేది లేదని రౌడీయిజం చేస్తారా? జమ్మూకశ్మీరు ముఖ్యమంత్రి కూడా ఈ ఆలయంలో డిక్లరేషన్‌ ఇచ్చి స్వామివారి సందర్శనకు వెళ్లారు. మరి వీళ్లకు ఏమిటి ఇబ్బంది’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.


gj.jpg

మతాన్ని గౌరవించినట్లే సంప్రదాయాలు గౌరవించండి..

తాను బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని జగన్‌ చెప్పడం సంతోషమని, కాని అదే సమయంలో మతాన్ని గౌరవించినట్లే ఆలయ ఆచార వ్యవహారాలను కూడా ఆయన గౌరవించాలని చంద్రబాబు సూచించారు. ‘తాను ఇంట్లో బైబిల్‌ చదువుతానని జగన్‌ అంగీకరించారు. తానే చెప్పారు. దానిని దాచుకోవడం ఎందుకు? బహిరంగంగానే చదువుకోండి. అదేమీ తప్పు కాదు. నేను హిందువును. పూజలు చేస్తాను. చర్చికి లేదా మసీదుకు వెళ్లినప్పుడు అక్కడ ఏ సంప్రదాయం, ఆచారం ఉంటే దానిని పాటిస్తాను. మీరూ అలాగే ఉండండి. ఒక అబద్ధాన్ని పదేపదే చెబుతారు. దానిని తమ పత్రికలో, టీవీలో, బ్లూ మీడియాలో పదేపదే ప్రచారం చేస్తారు. తిరుమలకు వచ్చే నెయ్యిలో కల్తీ జరగలేదని ఈవో చెప్పారని ఒక అబద్ధాన్ని ఇదే మాదిరిగా ప్రచారం చేస్తున్నారు. కల్తీ జరిగిందని ఈవో బహిరంగంగా చెప్పినా ఆ ప్రచారం మానలేదు. కల్తీ నెయ్యి అసలు వాడనే లేదని మరో ప్రచారం చేశారు. ఏఆర్‌ ఫుడ్స్‌ అనే కంపెనీ నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. అందులో నాలుగు ట్యాంకర్లు వాడారు. అనుమానం వచ్చి మరో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకుండా నిలిపివేసి వాటి నుంచి శాంపిల్స్‌ తీసి గుజరాత్‌లో ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపారు. కల్తీ జరిగిందని అందులో వచ్చింది. మేం దానిని బయటపెట్టకపోతే.. అది మరో రకంగా బయటకు వస్తే మేం తప్పు చేసినట్లు కాదా! దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? తెలిసో తెలియక జరిగిన తప్పుల నుంచి కాపాడాలని ఆగస్టులో తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల మళ్లీ సంప్రోక్షణ చేశారు. ఇవన్నీ ఈవో చేయించారు. కల్తీ జరగకపోతే ఇవన్నీ ఎందుకు చేయిస్తారు? తప్పు నేను చేశానని ఎదురుదాడి చేస్తున్నారు. నెయ్యి కొనుగోలుకు ఉన్న టెండర్‌ నిబంధనలు ఎవరు మార్చారు? రేటు తక్కువకు వస్తోందని ఎడాపెడా కొనుగోలు చేసింది ఎవరు? అన్నప్రసాద ం నాణ్యత బాగోలేదని భక్తులు ఎంతోకాలంగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకుండా ఉన్నది ఎవరు? ఒక్క తిరుమలలోనే కాదు... అన్ని ఆలయాల్లో ఇలాగే చేశారు. అన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ని నీతి కబుర్లు చెబుతున్నారు.. రామతీర్థంలో రాముడి తల నరికింది ఎవరో తేల్చారా? అంతర్వేది ఆలయ రథం తగలబెట్టిన వాళ్లు, కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు ఎత్తుకెళ్లిన వాళ్లపై చర్యలు తీసుకున్నారా? ఇటీవల అనంతపురం జిల్లాలో రఽథాన్ని తగులబెడితే మేం వెంటనే నిందితులను పట్టుకున్నాం. వైసీపీకి చెందిన ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఆ పని చేశాడు. మేం ఇవన్నీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలా’ అని ఆయన ప్రశ్నించారు.


డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టం లేకే వెళ్లలేదు

శ్రీవారి ఆలయంలో అక్కడి నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టం లేకే జగన్‌ వెళ్లలేదనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆయనకు విశ్వసనీయత లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు. దళితులను ఆలయం లోపలికి రానివ్వడం లేదని అంటున్నారు. దళితులను ఎవరు ఆపారు.. ఎక్కడ ఆపారు? ప్రసాదంలో కల్తీపై భక్తులు మనోవేదన చెందుతుంటే జగన్‌కు ఏ పట్టింపూ లేదు. కల్తీ నెయ్యి వాడలేదని ఒక మాటతో దులుపుకొని పోవాలని చూస్తున్నారు. వాడారన్నది స్పష్టం. అది కల్తీ అని పరీక్షలో తేలింది. గతంలో అసలు పరీక్షలే చేయలేదు. కల్తీ కనుక్కోవడానికి అవసరమైన ల్యాబ్‌ తిరుమలలో అసలు లేనే లేదు. ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ల్యాబ్‌ పెడుతున్నాం. మళ్లీ అపవిత్ర కార్యక్రమాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. ఏ మతానికి చెందిన ఆలయం లేదా ప్రార్థనా మందిరంలో ఆ మతానికి చెందిన వారే పనిచేసేలా చట్టం కూడా తెస్తున్నాం. తిరుమలను మరింత పవిత్రంగా తీర్చిదిద్దడానికి త్వరలో కొందరు మేధావులు, పండితులతో సమావేశాన్ని నిర్వహించబోతున్నాం’ అని వెల్లడించారు. పందికొవ్వు బంగారమంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే జగన్‌ దానిని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. లౌకిక దేశంలో ఇటువంటి డిక్లరేషన్‌ నిబంధనలు ఉండకూడదన్న జగన్‌ వాదనను ఆయన తిప్పికొట్టారు. ‘దేశంలో మత సామరస్యం కాపాడడానికి మనం లౌకిక విధానాలు పాటిస్తున్నాం. ఆ పేరుతో మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. నేను హిందువునే అయినా ఏదైనా ఆలయంలో ఉన్న ఆచార సంప్రదాయాలను పాటించడం ఇష్టం లేకపోతే అక్కడకు పోను. ముఖ్యమంత్రి కూడా అలాగే ఉండాలి. ముఖ్యమంత్రి అందరి కంటే మొదట చట్టాలను గౌరవించాలి. రాజ్యాంగాన్ని, చట్టాలను పాటిస్తానని ఆ పదవిలో చేరే ముందు ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాన్ని జగన్‌ ఉల్లంఘించారు. తన తప్పును టీటీడీ సభ్యులపై తోయడం సరికాదు. రాజ్యాంగాన్ని, ఆలయ సంప్రదాయాలను పాటించవద్దని బీజేపీ, ఇతర పార్టీలు ఆయనకు ఏమైనా పర్మిషన్స్‌ ఇచ్చాయా? జంబో బోర్డు వేయడం తప్పు. ఆలయాన్ని పైరవీలకు వాడుకోవడం తప్పు. సీనియర్‌ ఐఎఎ్‌సలను ఈవోగా వేయకుండా తనకు కావలసిన వారిని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోవడం మరో తప్పు. తప్పులు ఎవరు చేసినా శిక్షలు తప్పవు. మేం ప్రక్షాళన కోసమే శ్యామలరావును ఈవోగా వేశాం. విజిలెన్స్‌ విచారణ వేశాం. ఇప్పుడు సిట్‌ వేశాం. తప్పులు జరిగి ఉంటే హుందాగా అంగీకరించి విచారం వ్యక్తం చేస్తే అదొక పద్ధతి. ఎదురుదాడి చేయడం సరికాదు. డిక్లరేషన్‌ ఇవ్వాలన్నది చట్టం. ఆ చట్టం లేదని ఆయన అనడం లేదు. తనను గతంలో అడగలేదని వాదిస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్నప్పుడు దానిని పాటించాలి. అందులో వివాదం ఎందుకు? మీరు క్రైస్తవ మతం పాటిస్తున్నామని బహిరంగంగా ఒప్పుకొన్నప్పుడు ఇక్కడ డిక్లరేషన్‌ పాటించండి. దానిని వివాదం చేయడం సరికాదు’ అని అన్నారు. డిక్లరేషన్‌కు సంబంధించిన చట్టాన్ని తీసేయలేదని, అది కొనసాగుతూనే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - Sep 28 , 2024 | 04:42 AM