జోగిని ప్రశ్నిస్తుంటే..
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:46 AM
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై మూకదాడి ఘటనలో నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టుకు నివేదించారు.
పొన్నవోలు సమాధానం ఇస్తున్నారు!
రమేష్ దర్యాప్తునకు సహకరించడం లేదు
తక్షణం మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయండి
హైకోర్టులో సీనియర్ న్యాయవాది వాదనలు.. విచారణ నేటికి వాయిదా
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై మూకదాడి ఘటనలో నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టుకు నివేదించారు. తొందరపాటు చర్యలు వద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జోగి దుర్వినియోగం చేస్తున్నారని, తక్షణం వాటిని ఎత్తివేయాలని కోరారు. దర్యాప్తు అధికారి నిందితుడిని ప్రశ్నిస్తుంటే.. ఆయనతోపాటు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సమాధానం చెబుతున్నారని వివరించారు. అందుకు సంబంధించి వీడియోను కోర్టు ముందు ఉంచామన్నారు. విచారణకు హాజరు కావాలని పిటిషనర్‌కు దర్యాప్తు అధికారి ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చారన్నారు. మూడో నోటీసు తరువాత సీనియర్ న్యాయవాదితో కలిసి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన సమయంలో వినియోగించిన ఫోను, సిమ్ కార్డు, ఈఎంఈఐ నెంబర్, ఫోను బిల్లు వివరాలు చెప్పాలని దర్యాప్తు అధికారి కోరగా, ఫోను మార్చానని సమాధానం ఇచ్చారన్నారు.
మెజార్టీ ప్రశ్నలకు లేదు, తెలియదు, గుర్తులేదని బదులిచ్చారన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోను ఇవ్వడానికి కూడా నిరాకరించారన్నారు. చంద్రబాబు ఇంట్లోకి చొచ్చుకువెళ్లి, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన రోజు పిటిషనర్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసు వివరాలు చెప్పకుండా పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పోలీసులను ప్రభావితం చేసి బాధితుల పైనే పిటిషనర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారన్నారు. ఘటన జరిగిన రోజు సంబంధిత పోలీ్‌సస్టేషన్ కేసు డైరీ వివరాలను కోర్టుముందు ఉంచారు. అప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పిటిషనర్‌తో పాటు దాడిలో పాల్గొన్న ఇతర నిందితులు ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హులని తెలిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉద్దేశపూర్వకంగా వాదనలు వినిపించేందుకు జాప్యం చేస్తున్నారన్నారు. తక్షణం మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శశిభూషణరావు స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాలతో సీనియర్ న్యాయవాది విచారణకు హాజకాలేకపోయారని తెలిపారు. శుక్రవారం వాదనలు వినిపిస్తారన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ జోగిరమేష్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనల కోసం విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేశారు. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నేటి వరకు పొడిగించారు. చంద్రబాబు నివాసంపై మూకదాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.