Share News

Tirumala Laddu: శ్రీవారి నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ.. తేడా వచ్చిందో..

ABN , Publish Date - Oct 08 , 2024 | 05:12 AM

తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రంగా నివేదించే ప్రసాదాల్లో అపచారం జరిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. నాడు రాజుల కాలంలో స్వామి ప్రసాదాలతో ఆటలాడితే భయానక శిక్షలు ఉండేవి.

Tirumala Laddu: శ్రీవారి నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ.. తేడా వచ్చిందో..

  • రాజుల కాలంలో భయానక శిక్షలు

  • స్పష్టంచేస్తున్నఅలనాటి శాసనాలు

  • నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ

  • మొదటి రాజేంద్ర చోళుడి శాసనం

  • క్రీ.శ. 8 నుంచి 18వ శతాబ్దం వరకు గర్భాలయ ప్రాకారంపై 1,150 శాసనాలు

  • స్వామివారి ప్రసాదాల గురించీ స్పష్టత.. భక్తిశ్రద్ధలతో ఆహార పదార్థాల సరఫరా

(తిరుమల-ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రంగా నివేదించే ప్రసాదాల్లో అపచారం జరిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. నాడు రాజుల కాలంలో స్వామి ప్రసాదాలతో ఆటలాడితే భయానక శిక్షలు ఉండేవి. ఇవేవో గాలికబుర్లు కావు. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల శ్రీవారి ఆలయంలో శాసనాలు చెబుతున్న చరిత్ర ఇది. జాతీయ పురావస్తు శాఖ ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిన శాసన గ్రంఽథాల్లో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో అపచారం జరిగితే నాటి మహారాజులు ఎంత కఠినమైన శిక్షలు విధించేవారో కళ్లకు కట్టినట్టు శాసనాల ద్వారా వివరించి పొందుపరిచారు. శ్రీవారి మూలవిరాట్టు కొలువైన గర్భాలయ ప్రాకారంపై ఉన్న శాసనాలను పురావస్తు శాఖ జాగ్రత్తగా పరిశీలించగా నాటి విషయాలు వెల్లడయ్యాయి. క్రీ.శ.8 నుంచి 18వ శతాబ్దం వరకు శ్రీవారికి సమర్పించే ప్రసాదాల గురించి శాసనాల రూపంలో గోడలపై చెక్కారు. పండుగలు, బ్రహ్మోత్సవాలలో ప్రసాదాలు ఎలా ఉండాలనే విషయమై శాసనాల్లో రాయించారు. పల్లవరాణి సమవాయి స్వామివారి ప్రసాదాల కోసం ఆహారాన్ని పండించాలని 4,176 కుల్లీలు (బంగారు నాణేలు) చెల్లించి ఓ భూమిని కొనుగోలు చేశారు. శ్రీవేంకటం అనే దేవుడికి ఈ భూమిని దానంగా ఇస్తున్నట్టు తొలి శాసనం తిరుమలలో లభ్యమైంది. ఇక 1509-29 మధ్యకాలంలో తిరుమలదేవి, చిన్నాదేవితో కలిసి ఏడు సార్లు శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకుని కానుకలు సమర్పించారు. స్వామికి సమర్పించే నైవేద్యం, వాటి నిర్వహణ విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఆలయ పోటును నిర్వహించే అధికారులకు కఠిన, భయానక శిక్షలు పడినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.

gkh.jpg

స్వామికి భక్తుడి కానుక...

తిరుమల శ్రీవారికి ఎలాంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలనుకున్నాడో ఓ భక్తుడు శిలపై రాయించుకున్నాడు. తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరువిలైయాత్తంలో ఉన్న కలిధిరమంగళంలో ఆహార పదార్థాల తయారీకి వెయ్యి పణాలతో ఓ వ్యవసాయ బావిని తవ్వించడం విశేషం. తిరుమల శ్రీవారి భాండాగారానికి తాను ఈ భూమి నుంచి వచ్చే పంటను, పాడిని అందిస్తున్నట్టు రాసుకొచ్చాడు. ‘తిరువేంకటముడయాన్‌’కు నిత్యం ఓ మరకం ధాన్యాన్ని, ఓ అళక్కు నెయ్యి, పెసలను, ఉప్పు, మిరియాలు, పెరుగును తిరుమలకు పంపిస్తున్నట్టు ఆ శాసనంపై ఉంది.


సాయంకాల నివేదనకు ఒప్పందం

క్రీ.శ. 1390 తిరుమల శ్రీవారి ఆలయ అధికారులు, మానవట్టర్‌ జీయర్‌ శిష్యులైన కందాడై రామానుజ అయ్యంగార్‌కు మధ్య శ్రీవారి సాయంకాల నివేదనకు సంబంఽధించిన ఒప్పంద శాసనం కూడా ఆసక్తికరంగా ఉంది. తిరువేంకటనల్లూరులో కారంబట్టేరి వద్ద ఓ చెరువును తవ్వించడం, దానిపై వచ్చే ఆదాయంతో సాయంకాల నివేదన చేసేందుకు జరిగిన ఒప్పందంపై శిలాశాసనం చెక్కారు. నైవేద్యంగా దధ్యోజనం, పులిహోర, కూరగాయలు, తమలపాకులు వంటివి ఉపయోగించాలని ఉంది.

1019లోనే నాణ్యతపై శాసనం

శ్రీవారి గర్భాలయం గోడలపై ఉన్న మరో శిలాశాసనంపై శ్రీవారి పూజ, దానాలపై ఓ శాసనం రాయించారు. క్రీ.శ. 1019లో మొదటి రాజేంద్ర చోళుడికి శ్రీవారి ఆలయంలో జరగాల్సిన నైవేద్యాలు, సేవలు, దానకార్యాలు సక్రమంగా జరగడం లేదని, దీపం, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి నాణ్యత సరిగా లేదని ఫిర్యాదులు అందాయి. దీంతో వెంటనే దర్యాప్తు చేయాల్సిందిగా కొర్ర మంగళం ఉడైయాన్‌ అనే అధికారిని ఆదేశించి పంపారు. తిరుముణ్ణయం సభ ద్వారా సభ్యులు.. పూజారులు, అప్పటి అధికారులను ప్రశ్నించారు. నైవేద్యాలు, కైంకర్యాలు సరిగా జరపడం లేదని, నాణ్యతలో జాగ్రత్తలు పాటించడం లేదని గుర్తించారు. తిరుమణ్ణయం సభ ఆధీనంలో ఉన్న డబ్బును శ్రీవారి ఆలయం భాండాగారానికి ఇవ్వాల్సిందిగా తీర్పు ఇచ్చారు. నాణ్యత, కైంకర్యాల నిర్వహణపై విచారణ కమిటీని నియమించడం అదే మొదటిసారి అని తెలుస్తోంది.

Updated Date - Oct 08 , 2024 | 10:22 AM