Share News

ఏపీ అభివృద్ధికి ఐఐటీ-ఎం బాసట

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:17 AM

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి మద్రాస్‌ ఐఐటీ బాసటగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు చేదోడుగా నిలవడానికి ముందుకొచ్చింది.

ఏపీ అభివృద్ధికి ఐఐటీ-ఎం బాసట

మంత్రి లోకేశ్‌ సమక్షంలో 8 ఒప్పందాలు

అమరావతికి సాంకేతిక సహకారం

విద్యార్థులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ

పారిశ్రామిక అవసరాల మేరకు టీచింగ్‌

ఇంటర్నెట్‌ గేట్‌వేగా విశాఖ అభివృద్ధి

వివిధ శాఖలతో కలిసి ముందుకు

అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి మద్రాస్‌ ఐఐటీ బాసటగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు చేదోడుగా నిలవడానికి ముందుకొచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతో ఎనిమిది ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మద్రాస్‌ ఐఐటీ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్‌ తదితరుల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. వీటిల్లో ప్రధానంగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి సాంకేతిక సలహాలు అందించడం, యువతకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో నాణ్యత పెంచే కార్యక్రమాలు చేపట్టడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, విశాఖను ఇంటర్నెట్‌ గేట్‌వేగా అభివృద్ధి చేయడం తదితర ఒప్పందాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి తాము ఉత్సాహంగా ఉన్నామని మద్రాస్‌ ఐఐటీ బృందం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, ఎం.రామప్రసాదరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికా శుక్లా, విజయరామరాజు, యువరాజ్‌, కన్నబాబు, ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామకోటి, సీఈవో ఎంజె శంకరనారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఐఐటీ-ఎంతో వివిధ శాఖల ఒప్పందాల వివరాలు ఏపీసీఆర్‌డీఏతో..

ప్రపంచ వర్సిటీల భాగస్వామ్యంతో అమరావతిలో అంతర్జాతీయ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సాధ్యమయ్యేలా చేయడం, ఇంక్యుబేషన్‌ పార్కు ఏర్పాటులో సాంకేతిక సహకారం కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు భౌతికంగా, వర్చువల్‌ పద్ధతుల్లో ప్రభుత్వంతో కలసి పని చేస్తుంది.

ఏపీ మారిటైమ్‌ బోర్డుతో..

సముద్ర పరిశోధన, సమాచారం, తీర ప్రాంతంలో ఇంధన ఉత్పత్తి టెక్నాలజీల్లో సహకారం కోసం ఒప్పందం జరిగింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలు సాధించడం కోసం ఈ ఒప్పందం జరిగింది.

ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌తో..

స్వయం ప్లస్‌, ఐఐటీఎం ప్రవర్తక్‌ డిజిటల్‌ స్కిల్‌ అకాడమీ వంటి ప్లాట్‌ ఫాంల ద్వారా స్కేల్‌ స్కి ల్లింగ్‌ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఏపీ విద్యాశాఖతో..

పారిశ్రామికావసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణను ఇచ్చేలా ఐఐటీఎం, విద్యాశాఖల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రవర్తక్‌ విద్యా శక్తి ద్వారా రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణను ఇస్తుంది. అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.


ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

విమానాశ్రయాలను లాజిస్టిక్స్‌/మెయింటెనెన్స్‌ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ అవగాహనా ఒప్పందం జరిగింది. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టి సారించడం.. ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ఉద్దేశం.

ఐటీ శాఖతో..

అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్‌ గేట్‌వేగా అభివృద్ధి చేయడం, తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ ఒప్పందం ఉద్దేశం.

ఆర్టీజీఎ్‌సతో..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌ రంగాల్లో సాఫ్ట్‌వేర్‌, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటీఎం ప్రవర్తక్‌ ఏపీఆర్టీజీఎ్‌సతో కలసి పనిచేస్తుంది.

క్రీడల శాఖతో..

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్‌ టెక్‌ ఎనేబుల్డ్‌ స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం కుదర్చుకుంది.

Updated Date - Nov 16 , 2024 | 05:17 AM