ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:17 AM
ఆంధ్రప్రదేశ్‌లో మే 16 వరకూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి’
ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు
నదులను తోడేసిన ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ
మైన్, పర్యావరణ అనుమతులు తీసుకోలేదు
కనీసం వాటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు
నాగేంద్రకుమార్ పంపిన ఫొటోలన్నీ వాస్తవాలు
మే 18న సుప్రీంకోర్టుకు కేంద్ర బృందం నివేదిక
బుకాయించి, అడ్డంగా దొరికిపోయిన జగన్ సర్కారు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘ఆంధ్రప్రదేశ్‌లో మే 16 వరకూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డ్‌లను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 18న నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలా.. అలాంటిదేమీ లేదే? తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గనుల శాఖ, అటు 23 జిల్లాల కలెక్టర్లు తొలుత ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10న సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలు ఇచ్చి, అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించని సుప్రీంకోర్టు... ఏపీలో ఇసుక తవ్వకాలపై రెండురోజుల్లో అధ్యయనం చేసి, క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదేరోజున కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంవోఈఎఫ్ విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త పసుపులేటి సురే్‌షబాబు నేతృత్వంలోని నిపుణుల బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది.
అనుమతుల్లేకుండానే తవ్వకాలు
ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే గనుల శాఖ నుంచి మైనింగ్ అనుమతి, సియా నుంచి పర్యావరణ అనుమతి తీసుకోవాలి. కాలుష్య నియంత్రణమండలి నుంచి కన్సెంట్ పొందాలి. అయితే జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా కంపెనీలు ఏ అనుమతి తీసుకోకుండానే నదుల్లోని రీచ్‌ల్లో ఇసుక తవ్వుకొని తరలిస్తున్నాయి. ఇది చట్టాలు, నియమ నిబంధనలకు విరుద్ధం. ఎన్నికలకు రెండురోజుల ముందు అంటే మే 11 వరకూ తవ్వకాలు కొనసాగాయి. తర్వాత 16 వరకు తవ్వకాలు చేపట్టారు. మేం తనిఖీలకు వస్తున్నామని తెలిసి కొన్ని రీచ్‌ల్లో ఆ రోజు వరకు మైనింగ్ ఆపారు.
తనిఖీ చేసిన రీచ్‌లివీ...
మే 14న ఉమ్మడి కృష్ణాజిల్లాలో శ్రీకాకుళం రీచ్, స్టాక్‌యార్డ్ (ఘంటసాల మండలం) లంకపల్లి రీచ్, రొమ్యూరు రీచ్, చోడవరం రీచ్, మున్నలూరు రీచ్‌లను, మే 15న ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తపల్లి, చింతపల్లి రీచ్, స్టాక్‌యార్డ్, కొంగటివారిపాలెం(కేవీపాలెం), మల్లాది, పొందుగుల రీచ్, వైకుంఠపురం రీచ్‌లను కేంద్ర బృందం తనిఖీ చేసింది.
భారీ యంత్రాలతో నదులు గుల్ల
ఉమ్మడి కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం రీచ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, ఇంకా దారుణం ఏమిటంటే, కనీసం పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. రెండు టన్నుల బకెట్ సామర్థ్యం కలిగిన జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్క రీచ్‌లోనే ఐదు జేసీబీలను ఉపయోగించి తవ్వుతూ లారీల్లో ఇసుక లోడ్ చేస్తున్నారు. దీన్ని జీసీకేసీ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. తనిఖీల సందర్భంగా రహదారి, క్యాష్ బిల్లులను ఫొటోలు తీసుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని రీచ్‌లో ప్రతిమ ఇన్‌ఫ్రా ఇసుక మైనింగ్ చేస్తోంది. ఆ కంపెనీ ఎలాంటి అనుమతులు, ఆమోదాలు పొందలేదు. సగటున కిలోమీటరు పొడవునా నాలుగైదు అడుగుల లోతున ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే ఆపాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న, ఆ తర్వాత మే 10న ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో గుంటూరు చెందిన నాగేంద్రకుమార్ మే 15న ఈ-మెయిల్ ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి జియోట్యాగింగ్ చేసిన ఫొటోలు, ఇతర ఆధారాలు సుప్రీంకోర్టుకు ఇచ్చారు. ఈ ఫొటోలు నిజమైనవేనని, అక్రమ తవ్వకాలు జరిగాయని కేంద్ర నిపుణుల బృందం తన నివేదికలో తేల్చిచెప్పింది.
ద్వివేది.. ఇప్పుడేమంటారు?
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని ఇటు కలెకర్లతో, అటు గనుల శాఖ తరపున నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నివేదికలు ఇప్పించారు. కానీ, అవన్నీ పచ్చి అబద్ధాలని, రాష్ట్రంలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని కేంద్ర నిపుణుల బృందం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటివరకూ గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు, ఆఫిడవిట్‌లో పేర్కొన్నవన్నీ కట్టుకథలేనని తేలిపోయింది. మరి ఇప్పుడు కేంద్ర నివేదికపై ద్వివేది ఏమంటారో, కొత్తగా ఏ కథనం వినిపిస్తారో చూడాలి. అక్రమ ఇసుక మైనింగ్‌లో జగన్ సర్కారు, దానికి కొమ్ముకాసిన అధికారులు సుప్రీంకోర్టుకు చెప్పినవన్నీ అబద్ధాలేనని నిరూపించేలా కేంద్ర నిపుణుల బృందం నివేదికలు ఇవ్వడంతో అందరూ అడ్డంగా దొరికిపోయారు.