Share News

దిశ మార్చుకున్న తీవ్ర అల్పపీడనం

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:42 AM

నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది.

దిశ మార్చుకున్న తీవ్ర అల్పపీడనం

నేడు బలహీనపడుతుందన్న వాతావరణశాఖ

కోస్తా జిల్లాలకు వర్షసూచన.. పెరిగిన చలి

విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది. మంగళవారం వరకూ పశ్చిమ నైరుతిగా పయనించిన తీవ్ర అల్పపీడనం తరువాత వాయవ్యంగా పయనిస్తోంది. బుధవారం మధ్యాహ్నానికి దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారం నాటికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాలో అనేకచోట్ల బుధవారం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం మీదుగా గాలులు వీయడం, చిరుజల్లులు కురుస్తుండడంతో కోస్తాలో చలి వాతావరణం కొనసాగింది. అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక కొనసాగుతుంది. గురువారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి తేమగాలులు బలంగా రావడంతో ప్రస్తుతం పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనానికి అవసరమైన తేమ లభిస్తోందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - Dec 26 , 2024 | 03:42 AM