Share News

AP News: కొత్త మద్యం పాలసీ ప్రక్రియ షురూ.. నోటిఫికేషన్ వచ్చేసింది

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వివరాలు ప్రకటించారు. నేటి (మంగళవారం) నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

AP News: కొత్త మద్యం పాలసీ ప్రక్రియ షురూ.. నోటిఫికేషన్ వచ్చేసింది

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వివరాలు ప్రకటించారు. నేటి (మంగళవారం) నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. ఇక ప్రీమియర్ షాపులకు, గీత కులస్తులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.


పూర్తి వివరాలు ఇవే..

దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మూడు విధానాల్లో దరఖాస్తుల స్వీకరిస్తామని, జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంఆర్‌పీ కంటే అధిక రేటు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిట్ రూములకు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని తెలిపారు. ప్రీమియర్ షాపులకు ఫీజును రూ.1 కోటిగా నిశాంత్ కుమార్ నిర్ధారించారు. మద్యం షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంటుందని, స్కూల్స్, టెంపుల్స్ ఉన్న చోట వంద మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం షాపులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. మద్యం షాపులు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అంశంపై నూతన మద్యం పాలసీలో నిబంధనలను పొందుపరిచామని, బీసీల పేరుతో షాపులు వేరే వ్యక్తి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


పేరొందిన బ్రాండ్స్ దొరుకుతాయి

ప్రతి షాపులో కచ్చితంగా 2 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. నాణ్యమైన మద్యంతో పాటు పేరొందిన బ్రాండ్స్ కూడా మద్యం షాపులో దొరుకుతాయని, ఎవరన్నా నాణ్యత లేని మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ విధానం ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏ విధంగా న్యాయం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకు పాత విధానమే అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. నూతన విధానం పాలసీలో సిండికేట్ అయ్యే అవకాశం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. 2017లో ఒక్కో షాపునకు 18 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నట్టు నిశాంత్ కుమార్ తెలిపారు.

Updated Date - Oct 01 , 2024 | 06:35 PM