Share News

AP ELECTIONS 2024 : పూలతోటలో ఆసక్తికర పోరు

ABN , Publish Date - May 10 , 2024 | 04:38 AM

రాజమండ్రి రూరల్‌.. ఈ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గోదావరి ఒడ్డున, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలతో నిండి ఉంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ దీని పరిధిలోని బొమ్మూరులోనే ఉంది.

AP ELECTIONS 2024 : పూలతోటలో ఆసక్తికర పోరు

రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల గీ చెల్లుబోయిన

2009 నుంచి వరుసగా గెలుస్తున్న టీడీపీ

ఇంతవరకు బోణీ కొట్టని వైసీపీ

రాజమండ్రి రూరల్‌.. ఈ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గోదావరి ఒడ్డున, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలతో నిండి ఉంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ దీని పరిధిలోని బొమ్మూరులోనే ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఏర్పాటైన ఈ స్థానంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరుగగా.. టీడీపీయే గెలిచింది. 2009లో ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన రమేశ్‌ టీడీపీ తరఫున పోటీ చేసి బోణీ కొట్టారు. 2014, 19 ఎన్నికల్లో సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి విజయం సాధించారు.

ఈసారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మళ్లీ బుచ్చయ్యచౌదరి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడ జనసేనకు మంచి పట్టు ఉంది. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన స్థానికుడు కాదు. బీసీ కార్డుతో ప్రచారం చేస్తున్నారు.

గతంలో జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన ఈయన 2014లో కాకినాడ రూరల్‌లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో రామచంద్రపురంలో నెగ్గారు. అక్కడ ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో సీఎం జగన్‌ ఆయనకు పెద్దగా పరిచయం లేని రాజమండ్రి రూరల్‌కు బదిలీచేశారు.

నర్సరీల కోట.. రూరల్‌ నియోజకవర్గంలో నర్సరీలు ఎక్కువ. కనీసం 1,800 రిజిస్టర్డ్‌ నర్సరీలు ఉన్నాయి. చిన్నాచితకా రైతులు నడిపేవి ఇంకా చాలా ఉన్నాయి. గతంలో మల్లెలు, చామంతి, కనకాంబరాలు వంటి పూలు ఎక్కువ సాగు చేసేవారు. ఇవాళ మొక్కల పెంపకం అధికంగా సాగుతోంది.

కడియం మండలమే కాకుండా, అటు మండపేట, రాజానగరం మండలం వైపు కూడా విస్తరిస్తున్నాయి. కానీ వైసీపీ పాలనలో వీటికి మార్కెట్‌ లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క మొక్క కూడా కొనుగోలు చేయని పరిస్థితి. ఎన్నడూ లేనివిధంగా రైతులు అప్పులపాలయ్యారు. ఈ నర్సరీలకు మార్కెట్‌ అవసరం. డ్రైనేజీలు లేకపోవడం వల్ల వానాకాలంలో నర్సరీలు మునిగిపోయి, మొక్కలు చనిపోతున్నాయి. వాన నీరు వెళ్లే మార్గం లేదు. డ్రైనేజీ సౌకర్యం కల్పించి, టూరిజం హబ్‌గా చేయగలిగితే ఈ నర్సరీల ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇళ్ల స్థలాల సమస్య కూడా ఎక్కువగా ఉంది. బుచ్చయ్యచౌదరి తన ప్రచారంలో ఈ సమస్యలనే ప్రస్తావిస్తూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామని.. వీలైనంత ఎక్కువ మంది పేదలకు ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇస్తున్నారు.

- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి.


బుచ్చయ్యచౌదరి బలాలు..

అత్యంత సీనియర్‌ నేతగా కులాలు, పార్టీలకతీతంగా మంచి పేరు. టీడీపీ శ్రేణులపై పట్టు.. గతంలో నాలుగు సార్లు సిటీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అక్కడి పేదలకు రూరల్‌ పరిధిలోని శాటిలైట్‌ సిటీ, డి-బ్లాక్‌, ఎ-బ్లాక్‌, బుచ్చియ్యనగర్‌ వంటి ప్రాంతాల్లో ఇళ్లు ఇప్పించారు. అందరూ పెద్దాయన అని ముద్దుగా పిలుస్తుంటారు. మండుటెండల్లోనూ విస్తృత ప్రచారం. కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో ఆసక్తి.

బలహీనతలు..

పార్టీలో కొందరు నేతలనే గుడ్డిగా నమ్మడం.. వ్యతిరేకంగా ఉన్నారనుకున్న వారిని పక్కన పెట్టడం.

చెల్లుబోయిన బలాలు..

మంత్రిగా అర్థబలం,

అంగబలం దండిగా ఉన్నాయి. జగన్‌పై అభిమానమే తనను గెలిపిస్తుందని భావిస్తున్నారు.

బలహీనతలు..

స్థానికుడు కాకపోవడం.. ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం.. పోటీచేసిన చోట మళ్లీ పోటీచేయరన్న అపఖ్యాతి.. ఇసుక, ప్రకృతి వనరుల దోపిడీ ఆరోపణలు. ఆయన అభ్యర్థిత్వంపై సొంత శ్రేణుల్లోనే అసంతృప్తి.. మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్‌కు సీటిస్తామని జగన్‌ మొండిచేయి చూపారు. దీంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. వీటికితోడు జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత.

నియోజకవర్గ స్వరూపం..

(కడియం, రాజమండ్రి రూరల్‌ మండలాలు, రాజమండ్రి కార్పొరేషన్‌లోని 8 డివిజన్లు)

మొత్తం ఓటర్లు: 2,72,826,

పురుషులు: 1,33,241,

మహిళలు: 1,39,561..

ట్రాన్స్‌జెండర్లు: 24

సామాజిక వర్గాల వారీగా ..

కాపులు-60 వేలు, ఎస్సీలు-50 వేలు,

గౌడ-శెట్టిబలిజలు-25 వేలు, యాదవులు-15 వేలు, పద్మశాలీలు/దేవాంగులు-12 వేలు, ముస్లింలు-12 వేలు, వెలమలు-10 వేలు

Updated Date - May 10 , 2024 | 04:52 AM