Share News

నీళ్లు పారని కాలువలకు సాగునీటి ఎన్నికలు..!

ABN , Publish Date - Dec 13 , 2024 | 11:44 PM

తొమ్మిదేళ్ల తర్వాత సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది.

నీళ్లు పారని కాలువలకు సాగునీటి ఎన్నికలు..!
జిల్లాలో వివిధ సాగునీటి సంఘాల ఎన్నికల కేంద్రాలకు పంపేందుకు సామాగ్రి సిద్ధం చేస్తున్న ఏఈఈ రంగన్న, సిబ్బంది

పాతికేళ్లకు పైగా సాగునీరు అందని ఆయకట్టు

రూ.200 కోట్లకు పైగా విలువైన భూములు అన్యాక్రాంతం

నేడు జిల్లాలో 123 డబ్ల్యూయూఏలకు ఎన్నికలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఎన్నికల నిర్వహణకు కర్నూలు జిల్లాకు రూ.20 లక్షలు మంజూరు

తొమ్మిదేళ్ల తర్వాత సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. కర్నూలు జిల్లాలో 123 డబ్ల్యూయూఏలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. సాయంత్రం నూతన పాలకవర్గం కొలుదీరనుంది. జిల్లా జలనవరులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పదవుల కోసం ఆరాటపడుతున్న టీడీపీ కూటమి నాయకులు ఓట్ల కోసం రైతుల ఇళ్ల వద్దకు పరుగులు పడుతున్నారు. శనివారం జరిగే ఎన్నికల్లో మాకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయి..? అంటూ రైతులు ప్రశ్నిస్తే.. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు అంటూ నాయకుల సమాధానం. పాతికేళ్లుగా సాగునీరే కాలువల్లో పారలేదు. నీళ్లే లేని కాలువలకు నీటి ఎన్నికలా..? అంటూ అన్నదాతలు ముక్కున వేలేసుకుంటున్నారు. పాతికేళ్ల యువరైతులైతే మా పొలాలకు సాగునీరు వచ్చేదా..? నీళ్లు పారని కాలువలకు సాగునీటి ఎన్నికలా..? అంటూ అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో రూ.వందల కోట్ల విలువైన ఎల్లెల్సీ కాలువ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.

కర్నూలు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టు దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ప్రధాన కాలువ, డిసి్ట్రబ్యూటరీ కాలువలు సహా పంట కాలువలు 1955లో నిర్మాణం చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ నీటి వాటా 24 టీఎంసీలు. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు కలిపి 1,51,134 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఆదోని మండలం హనవాళ్ల వద్ద టీబీపీ బోర్డు సరిహద్దు 250 కిలోమీటర్ల నుంచి కోడుమూరు సమీపంలో 324 కిలోమీటర్ల వరకు 74 కిలోమీటర్లు టీబీపీ ఎల్లెల్సీ, అక్కడి నుంచి 0/0 నుంచి 49 కిలోమీటర్లు వరకు అంటే.. కల్లూరు సమీపంలో వక్కెర వాగు వరకు 49 కి.మీలు టీబీపీ ఎల్లెల్సీ కర్నూలు బ్రాంచి కాలువ (కేబీసీ) ఉంది. ఈ కాలువ పరిధిలో సుమారుగా 51,900 ఎకరాలకు ఆయకట్టు ఉంది. పాతికేళ్ల క్రితం వెనక్కి వెళ్తే తుంగభద్ర జలాలు వచ్చేవని పెద్దపాడు గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఓ రైతు పేర్కొన్నారు. కర్ణాటక జల చౌర్యం, ఎగువన అక్రమ ఆయకట్టు సాగు పెరగడం, రాజకీయ జోక్యం, ఇంజనీర్ల నిర్లక్ష్యం వెరసి కర్నూలు రూరల్‌, గూడూరు మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందని ద్రాక్షగా మారాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆయకట్టు. వానొస్తే తప్పా పంటలు పండని దైన్యస్థితికి చేరింది. చివరి ఆయకట్టు గ్రామాలు రైతులు ఏనాడో సాగునీటిని మరిచిపోయారు.

ఫ ఆ కాలువలకు పాలకవర్గాలా..?

రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఎల్లెల్సీ కాలువ పరిధిలో 58 డబ్ల్యూయూఏలు, 10 డిసి్ట్రబ్యూటరీ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది. డబ్ల్యూయూఏ టీసీ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులను శనివారం రైతులు ఎన్నుకోవాలి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆయకట్టు రైతులను గుర్తించి ఓటర్ల జాబితా తయారు చేశారు. గూడూరు మండలం కె.నాగులాపురం, కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాల, మునగలపాడు, కల్లూరు మండలం పర్ల, పెద్దపాడు సాగునీటి వినియోగదారులు (డబ్ల్యూయూఏ) పరిధిలో 60 మంది టీసీ సభ్యులు, ఆ ఐదు డబ్ల్యూయూఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోబోతున్నారు. డబ్ల్యూయూఏ అధ్యక్షులు కర్నూలు -10 డిసి్ట్రబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాలి. ఆయా గ్రామాల ఆయకట్టుకు పాతికేళ్లకు పైగా సాగునీరు అందడం లేదు. 1980 నుంచి కాలువల్లో నీరు పాడం లేదని ఓ ఆయకట్టు రైతు వాపోయారు. రేమట, సింగవరం గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయితే అడపాదడపా గురురాఘవేంద్ర లిఫ్టు ద్వారా నీటిని ఇస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పదవులపై ఆసక్తి ఉన్న నాయకులు ఓటర్ల జాబితా పట్టుకొని ఇంటింటికి వెళ్లి శనివారం జరిగే నీటి సంఘాల ఎన్నికలకు రావాలని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దశాబ్దాలు కాలంగా నీళ్లు పారని కాలువలకు ఎన్నికలా..? కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గాలు నీళ్లు తెప్పిస్తారా..? అది సాధ్యమయ్యే పనేనా..? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఫ కాలువ భూములు అన్యాక్రాంతం

కర్నూలు నరగంలో స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) వ్యాపారం జోరందుకోవడంతో నగర శివారులో ఉన్న కల్లూరు, పెద్దపాడు, ఉల్చాలా, మునగలపాడు గ్రామాల్లో వెంచర్లు వెలిశాయి. ఆయకట్టు కనుమరుగై రియల్‌ వెంచర్లు వెలిశాయి. టీబీపీ ఎల్లెల్సీ కర్నూలు బ్రాంచి కాలువ భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయని టీబీపీ ఎల్లెల్సీ ఇంజనీరింగ్‌ అధికారి ఒకరు వాపోయారు. ఉల్చాల, పెద్దపాడు, కల్లూరు, మునగలపాడు, కర్నూలు ప్రాంతాల్లో దాదాపు వంద ఎకరాలకు పైగా కాలువ భూమి అన్యాక్రాంతమైంది. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ దాదాపుగా రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులే అంటున్నారు. పదేళ్ల క్రితం ఓ అధికారి కె.నాగులాపురం నుంచి కల్లూరు సమీపంలోని వక్కెరువాగు వరకు టీబీపీ ఎల్లెల్సీ కేబీసీ కాలువ భూములపై సర్వేకు శ్రీకారం చుడితే.. రాజకీయ నేతలు రంగంలోకి దిగి సర్వే జరగకుండా తొక్కిపెట్టారు. నీళ్లు పారని కాలువలకు సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, డిసి్ట్రబ్యూటరీ కమిటీలు పాలకవర్గం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యే నాయకులు కాలువ భూమి ఆక్రమణలపై దృష్టి సారించాలని, రూ.వందల కోట్ల విలువపై ప్రభుత్వ కాలువ భూములను కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాలని, పక్కా భవనాలు నిర్మించి ఉంటే.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ధర నిర్ణయించి ఖజానాకు రాబడి పెంచాలని పలువురు కోరుతున్నారు.

ఫ ఎన్నికల నిర్వహణకు రూ.20 లక్షలు

కర్నూలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు, హంద్రీనీవా కాలువలతో పాటు మైనర్‌ ఇరిగేషన చెరువుల నిర్వహణ కోసం 123 సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు శనివారం ఉదయం 8 గంటలకు ప్రక్రియ మొదలవుతుంది. మేజర్‌, మీడియం ప్రాజెక్టుల పరిధిలోని ఒక్కో డబ్ల్యూయూఏలో 12 మంది, మైనర్‌ ప్రాజెక్టు పరిధిలోని సంఘంలో ఆరుగురు టీసీ సభ్యులు ఉంటారు. జిల్లాలో 123 డబ్ల్యూయూఏల పరిధిలో 1,212 మంది టీసీ సభ్యులను నేడు ఎన్నుకుంటారు. మెజార్టీ రైతుల ఆమోదంలో ఎంపికైన టీసీ సభ్యులు సాయంత్రం 3 గంటల తరువాత సమావేశమై అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు పి.రంజితబాషా ఆధ్వర్యంలో జలవనరులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. డబ్ల్యూయూఏ ఎన్నికల ఆథరైజ్డ్‌ అధికారికి ఫారం-1 నుంచి ఫారం-10 వరకు అవసరమైన సామగ్రి అందజేశారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో సాగునీటి సంఘం ఎన్నికకు దాదాపు రూ.15-16 వేలు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే స్టేషనరీ, ప్రింటింగ్‌, ఓటర్ల జాబితా ప్రింటింగ్‌, ఇతర మెటీరియల్‌ కోసం దాదాపుగా రూ.18 లక్షలకు పైగా అధికారులు ఖర్చు చేశారు. అయితే.. ఆయా గ్రామాల్లో తెల్లారగానే నీటి సంఘాల ఎన్నికలు జరగునుండడంతో రాజకీయ వేడి రాజుకుంది. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రంగప్రవేశం చేసి ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు తీవ్రం చేశారు. అదే క్రమంలో పోటీ చేయడానికి వైసీపీ నాయకులు కూడా వ్యూహాలకు పదును పెట్టారు.

టీసీ సభ్యుడిగా పోటీకి అర్హతలు ఇవి:

ఫ ఆయకట్టుదారుడై ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి

ఫ 2022 నాటికి నీటి తీరువా పన్ను పూర్తిగా చెల్లించినట్లు తహసీల్దారు జారీ చేసిన నోడ్యూ సర్టిఫికేట్‌ ఉండాలి.

ఫ పట్టాదారు పాసుపుస్తం ఉండాలి

ఫ పోటీ చేయడానికి ఓటు హక్కు కలిగిన ఓ రైతు బలపరచాలి

ఫ ఒక రైతుకు ఎన్ని డబ్ల్యూయూఏల పరిధిలో ఆయకట్టు భూములు, ఓటు హక్కు కలిగి ఉన్నాప్పటికీ ఒక టీసీ సభ్యుడిగానే పోటీకి అర్హుడు. అలాగే ఒకేచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Dec 13 , 2024 | 11:44 PM