Share News

ఇంత అపచారమా?

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:47 AM

శ్రీవారి లడ్డూను జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసిన వ్యవహారం జాతీయస్థాయిలో గగ్గోలు రేపుతోంది.

ఇంత అపచారమా?

దేశమంతటా ‘లడ్డూ’పై గగ్గోలు

కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాలా?.. జగన్‌ నిర్వాకంపై సర్వత్రా భగ్గు

సీబీఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్‌

శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామిభక్తుల నుంచి ప్రముఖుల దాకా.. అందరూ చలించిపోతున్నారు. నాటి జగన్‌ ప్రభుత్వ నిర్వాకంపై భగ్గుమంటున్నారు. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు. దిద్దుబాటు ప్రారంభించిన సర్కారు..తిరుమల సంప్రోక్షణకు ఆదేశించింది

లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌

రంగంలోకి దిగిన నడ్డా..బాబుకు ఫోన్‌

కేంద్రస్థాయిలో విచారిస్తామని వెల్లడి

ఇది కుట్ర.. ద్రోహం..ఘోరమైన నేరం..

జగన్‌, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే

అమిత్‌షా, సుప్రీం సీజేలకు పలువురి లేఖ

సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్‌

సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాం: షర్మిల

శ్రీవారి లడ్డూను జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసిన వ్యవహారం జాతీయస్థాయిలో గగ్గోలు రేపుతోంది. లడ్డూ తయారీకి గత ప్రభుత్వం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు తేలడంతో వైసీపీ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూను కలుషితం చేయడాన్ని కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం రంగంలోకి దిగారు. సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాలు పంపిస్తే విచారణకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు. హిందూ విశ్వాసాల పట్ల ఇది కుట్ర, ద్రోహం, క్షమించరాని నేరమంటూ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌, బండి సంజయ్‌, పలువురు ఎన్డీయే, బీజేపీ జాతీయ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు, ‘కలియుగ దైవానికి ఇంత అపచారామా?’ అంటూ కోట్లాదిమంది భక్తులు, ప్రభుత్వ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు చలించిపోతున్నారు.

దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఒకవైపు, కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దింపాలని మరోవైపు ఒత్తిడి పెరిగిపోతోంది. శ్రీవారినీ, భక్తులనూ కొల్లగొట్టిన జగన్‌ను, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డిని శిక్షించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, డీజీపీకి లేఖలు అందుతున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రూపంలో వేసిన పిటిషన్‌ దాఖలైంది. జగన్‌పైనా, కల్తీ నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్ట్‌ సంస్థలపైనా జాతీయ భద్రతా చట్టం కింద చర్య తీసుకోవాలని మరో న్యాయవాది.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు. ఆ లేఖను యూపీ డీజీపీకి కూడా పంపించారు. దీనిని సనాతన ధర్మంపై కుట్ర, దాడిగా పరిగణించాలని అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు.

Updated Date - Sep 21 , 2024 | 04:47 AM