Share News

20వేల కోట్లు దోచుకున్న జగన్‌ పేదోడా?

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:23 AM

వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి కలిసికట్టుగా వైసీపీని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

20వేల కోట్లు దోచుకున్న జగన్‌ పేదోడా?

‘సిద్ధం’ సభలకు 600 కోట్లు ఖర్చు చేసిన వాళ్లు పేదోళ్లా?

60 నియోజకవర్గాలపై పడి దోచుకున్న మిథున్‌రెడ్డి పేదోడా?

సాక్షి పత్రిక పేదదా? భారతి సిమెంట్‌ పేదదా? సజ్జల పేద వ్యక్తా?

జగన్‌ మాయమాటలు నమ్మి ఓటేయొద్దు

ఈ ‘ఫ్యాన్‌’కు సౌండ్‌ ఎక్కువ... గాలి తక్కువ

కూటమి చేతిలో వైసీపీ ఓటమి ఖాయం: పవన్‌

లక్ష ఓట్ల మెజార్టీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి

పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పవన్‌ శ్రీకారం

పవన్‌ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు

తొలుత ‘వారాహి’కి అనుమతి నో.. తర్వాత ఓకే

నాలుగు గంటలు ఆలస్యంగా చేబ్రోలులో సభ

బందోబస్తు ఏర్పాటులో పోలీసుల వైఫల్యం

పవన్‌ రాగానే తోపులాట.. పలువురికి గాయాలు

కాకినాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి కలిసికట్టుగా వైసీపీని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మాయమాటలు నమ్మి ఎవరూ వైసీపీకి ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్‌ తొలిసారిగా శనివారం ఆ నియోజకవర్గంలో పర్యటించారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన బహిరంగసభలో వారాహి వాహనంపై నుంచి ప్రసంగించారు. తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫ్యాన్‌కు సౌండ్‌ ఎక్కువ.. గాలి తక్కువ. వైసీపీ కావాలా.. కూటమి కావాలా.. ప్రజలంతా ఆలోచించాలి. అధికారం అండతో ఇసుక, మద్యంలో వందలకోట్లు కొట్టేసిన వైసీపీ అవినీతి గురించి మాట్లాడుతోంది. జగన్‌ అవినీతి చేయలేదని చెప్పగలరా? పిఠాపురంలో నన్ను ఓడించడానికి వైసీపీ తెగ కుట్రలు చేస్తోంది. నన్ను ఓడించడానికి ఎందుకింత కక్ష . ఈ అసెంబ్లీ ఎన్నికలకు పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అని జగన్‌ పదేపదే అంటున్నారు. ఆ పార్టీలో ఒక్కో ఎమ్మెల్యే కోట్లలో సంపాదించారు. కానీ, జగన్‌ మాత్రం తమ అభ్యర్థి ఆస్తి అంతంతే అంటున్నారు. అంతంతే అంటే ఎంత? సాక్షి పత్రిక పేదదా? భారతి సిమెంట్‌ పేదదా? సజ్జల పేద వ్యక్తా? 60 నియోజకవర్గాలపై పడి దోచుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి పేదోడా? రూ.20వేల కోట్ల అక్రమార్జన చేసిన జగన్‌ పేదోడా? రూ.600 కోట్లు సిద్ధం సభలకు ఖర్చు చేసిన వాళ్లు పేదోళ్లా? ఇసుకలో జేపీ సంస్థ పేరుతో, బినామీ పేర్లతో కోట్లు కొట్టేసిన జగన్‌ పేదోడా? ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్‌ పెత్తందారు అంట’ అని పవన్‌ విమర్శించారు.

జగన్‌ జేబులోకి మద్యం డబ్బు..

‘సీఎం తన సొంత మనుషులకు చెందిన 16 మద్యం కంపెనీలతో కుమ్మక్కయ్యారు. ఇప్పటివరకు రూ.20వేలకోట్లు మద్యం డబ్బు జగన్‌ జేబుల్లోకి వెళ్లాయి. అసలు మద్యపాన నిషేధం అమలు చేద్దామా.. వద్దా? ప్రజలంతా చెప్పాలి. జేబ్రాండ్స్‌తో జనం ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. చివరకు పవర్‌స్టార్‌ పేరుతో బ్రాండ్‌ విక్రయిస్తున్నారంటే ఏమనాలి?

నన్ను ఓడించడానికి ఎందుకు వైసీపీకి అంత కక్ష? నాకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇప్పుడు 21మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులను నిలబెట్టి గెలవాలని తపనపడుతున్నా. పిఠాపురం నుంచే నేను గెలిచి తీరుతా. ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా.. లక్ష ఓట్ల మెజార్జీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి. గెలిచాక.. లేదంటే ఈలోపే ఇక్కడే ఇళ్లు కట్టుకుంటా. స్థలం కొంటాను. అన్ని విధాలా రాష్ట్రంలో మోడల్‌ నియోజకవర్గంగా మార్చుతా’ అని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 31 , 2024 | 05:23 AM