కోడ్ మాకు అడ్డమా?
ABN , Publish Date - Mar 20 , 2024 | 03:54 AM
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిన అధికారులకు వలంటీర్ల తీరు సవాల్‌గా మారింది. బాహాటంగానే వలంటీర్లు బరితెగించినా పదిమందికిగాను ఒక్కరిపైనే చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల బరితెగింపు
వైసీపీ అభ్యర్థులకు అడ్డగోలు ప్రచారం
‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో కొన్నిచోట్ల చర్యలు
చాలాచోట్ల వివాదాస్పదంగా అధికారుల తీరు
వైసీపీకి ఓటేయనన్నారని భార్యాభర్తలపై దాడి
వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించినప్పటికీ వాటిని ధిక్కరించి మరీ వైసీపీకి ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార పార్టీ జెండాలు, కరపత్రాలు పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు. ‘వలంటీర్లు నా సైన్యం’ అంటూ ముఖ్యమంత్రి జగన్ నుంచి వైసీపీ పెద్దల దాకా చేస్తున్న ప్రకటనలతో ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. ‘నేను వైసీపీ కార్యకర్తను. ప్రచారం చేస్తాను. ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓ వలంటీరు బరితెగించే స్థాయికి పరిస్థితి చేరుకుంది.
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిన అధికారులకు వలంటీర్ల తీరు సవాల్‌గా మారింది. బాహాటంగానే వలంటీర్లు బరితెగించినా పదిమందికిగాను ఒక్కరిపైనే చర్యలు తీసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల అధికారుల వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో వైసీపీ ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వలంటీర్లపై మంగళవారం పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో సత్యకుమార్ విచారణ చేశారు. ‘వలంటీర్ల వాడకానికి కొత్త డ్రామా’ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఆధారంగా విచారణ జరిగింది. నాగార్జున అనే వలంటీర్ ‘నేను వైసీపీ. ప్రచారం చేసేది చేసేదే, ఏమిచేస్తారో చేయండి’ అంటూ కరాఖండీగా చాలా నిర్లక్ష్యంగా చెప్పినట్టు చెబుతున్నారు. అదే రాసి ఇవ్వాలని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి సురేశ్‌బాబు కోరగా... వైసీపీ ప్రచారంలో తాను పాల్గొంటానని రాసిచ్చినట్టు తెలిసింది. కొద్దిసేపటికి ఎంపీడీవో పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా హైడ్రామా నడిచింది. వైసీపీ నేతలకు నాగార్జున ఫోన్ కలిపి.. మాట్లాడాల్సిందిగా ఎంపీడీవోకు ఇవ్వగా, ఆయన నిరాకరించారు. దీంతో నాగార్జున కొంత తగ్గాడు. పంచాయతీ కార్యదర్శి ముందు ఇచ్చిన సంజాయిషీకి భిన్నంగా... ‘తప్పయింది. తెలియక వెళ్లా. మళ్లీ ప్రచారంలో పాల్గొనను’ అని సంజాయిషీ రాసిచ్చాడు. మొదటి తప్పుగా అధికారులు పరిగణించి నాగార్జునను వదిలేశారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం నేరేడుపల్లి, వరిమడుగు గ్రామాల్లో కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణయాదవ్ సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లక్ష్మక్కపల్లి సచివాలయ పరిధిలోని ఇద్దరు వలంటీర్లు హడావుడి చేశారు. అభ్యర్థితో కలిసి దిగిన ఫొటోను ఒక వలంటీరు తన వాట్సాప్ గ్రూపులో డీపీగా పెట్టుకున్నారు. వైసీపీకి ఓటు వేసేందుకు నిరాకరించామని తమపై వలంటీరు, ఆమె భర్త దాడి చేశారని భార్యభర్తలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిచేసిన ఇద్దరూ బాధితులకు బంధువులే. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామ సచివాలయ పరిధి 8వ వార్డులో ఈ ఘటన జరిగింది. ఎన్నికల వేళ అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పరిధిలోని పూలకుంట గ్రామ వలంటీరు హనుమంతు కర్ణాటక నుంచి ద్విచక్రవాహనంపై మద్యం తెస్తూ మంగళవారం పోలీసులకు పట్టుబడ్డాడు.
స్వీట్ ప్యాకెట్.... ఐదు వేల నగదు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంగళవారం పెదనందిపాడు మండల పరిధిలోని వలంటీర్లతో రహస్య సమావేశం జరిగినట్టు తెలిసింది. ఒక్కో వలంటీరుకు స్వీట్ ప్యాకెట్.. రూ. ఐదు వేల నగదు ఈ సమావేశంలో అందించినట్టు సమాచారం.
16 మందిపై సస్పెన్షన్ వేటు...
అంబాజీపేట, మార్చి 19: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, ఇరుసుమండలో కోడ్ ఉల్లంఘించి వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ‘మేమూ సిద్ధం... వైసీపీ కార్యక్రమాల్లో వలంటీర్లు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతి కోనసీమ జిల్లా మెయిన్‌లో వచ్చిన వార్త ఆధారంగా అధికారులు చర్య తీసుకున్నారు. కాగా, అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినందుకు అనకాపల్లి జిల్లా కొత్తమల్లంపేట సచివాలయం పరిధిలో ఇద్దరు వలంటీర్లను విధుల నుంచి తొలగించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా నియోజకవర్గానికి చెందిన 1000మందికిపైగా వలంటీర్లకు, కొంత మంది పోలీస్ సిబ్బందికి సెల్‌ఫోన్‌లు పంపిణీ చేశారని, వెలుగు, మెప్మా పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పక్కా ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వలంటీర్లనుంచి వివరణ తీసుకోవాలని ఎంపీడీవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది.