Is the compensation questionable? : పరిహారం ప్రశ్నార్థకమేనా..?
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:05 AM
గత వైసీపీ పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టానుసారంగా ప్రాజెక్టును మంజూరు చేసి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కుని రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆగమేఘాలపై ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులను పోలీసులు, రెవెన్యూ అధికారులతో రకరకాలుగా బెదిరింపు చర్యలకు పాల్పడి లాక్కున్నారు.
గత వైసీపీ పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టానుసారంగా ప్రాజెక్టును మంజూరు చేసి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కుని రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆగమేఘాలపై ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులను పోలీసులు, రెవెన్యూ అధికారులతో రకరకాలుగా బెదిరింపు చర్యలకు పాల్పడి లాక్కున్నారు. కాంట్రాక్టర్‌లకు లబ్ధిని చేకూర్చడానికి చేపట్టిన ప్రాజెక్టును ఎటువంటి అనుమతులు లేకుండానే రాత్రి,పగలు అనే తేడా లేకుండా నిర్మాణ పనులను చకచకా చేపట్టారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా దాదాపు 3 వంతులకు పైగా పనులు పూర్తి చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు సమీపంలో రూ.759.50 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తున్నా ప్రభుత్వం నుంచి భూనిర్వాసితులకు రావాల్సిన భూపరిహారం, పునరావాసం ఇప్పటి వరకు రాలేదు. ఇలాంటి తరుణంలో ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందోనని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
కురబలకోట, అక్టోబరు 8: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభు త్వం రూ.2 వేల కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో పుంగనూరు నియోజకవర్గంలోని ఆవులపల్లె, నేతిగుంటపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలో ప్రా జెక్టులకు ప్రభుత్వం 2021లో అనుమతులు మంజూరు చేసింది. కాగా వీటిలో ముదివేడు రిజర్వాయర్ నిర్మాణానికి రూ.759.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పను లు చేపట్టింది. కాగా ఈ ప్రాజెక్టును కురబలకోట, బి.కొత్తకోట మండలాల పరిధిలో 1077 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములు, గ్రామా లు, చెరువులు, కుంటలను కోల్పోతున్నారు.
నీట మునగనున్న శీతివారిపల్లె గ్రామం
కాగా కురబలకోట మండలంలోని పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలో 798.7 ఎకరాలు, కురబలకోట పంచాయతీలో 66.70 ఎకరాలు, ముదివేడు పంచాయతీలో 64.95 ఎకరాలు బి.కొత్తకోట మండలంలోని కోటావూరు పంచాయతీలో 146.05 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంపిక చేసిం ది. కాగా భూములకు సంబంధించి పలుమార్లు కలెక్టర్, జేసీ, మండల స్థాయి అధికారులు ఎమ్మెల్యే, ఎంపీలు రై తులతో సమావేశం నిర్వహించి భూపరిహారం ఎకరానికి రూ.12.50 లక్షలుగా నిర్ణయించారు. పట్టా, డీకేటీ భూములకు ఒకే ధరను నిర్ణయించారు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలోని శీతివారిపల్లె, కొత్తపల్లె, బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీలోని చౌటకుంటపల్లె, దిన్నిమీదపల్లె గ్రామాలు పూర్తిగా నీటమునుగుతాయి. అయితే వీరికి పునరావాసాల కోసం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలో 204 కుటుంబాలు, కోటావూరు పంచాయతీలో 125 కుటుంబాలను ఎంపిక చేశారు. కాగా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను కోల్పోయే భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా భూములు, ఇళ్లను కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా స్థలాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపడతారు. కాగా కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలోని భూనిర్వాసితుల కోసం ముదివేడు క్రాస్ సమీపంలోని తానామిట్ట వద్ద 21.50 ఎకరాలను, బి.కొత్తకోట మండలంలోని కోటావూరు పంచాయతీలో నిర్వాసితుల కోసం 13.50 ఎకరాలను ఎంపిక చేసింది. కాగా ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్ల జాగాతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని, ఇంటి నిర్మాణాన్ని సొంతంగా నిర్మించుకునే వారికి రూ.10 లక్షలు, అలా కాకుండా ఇళ్లు నిర్మించుకోలేని వాళ్లకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి వారికి అప్పగించడంతో పాటు మిగిలిన నగదును వారికి అందచేస్తామని తెలిపారు.
అయితే ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి పలుమార్లు జిల్లా, మండల స్థాయి అధికారులు భూనిర్వాసితులతో సమావేశాలు నిర్వహించారు. అయితే త్వరలో స్థలాలు కేటాయించడంతో పాటు ఆ ప్యాకేజీని ఇవ్వనున్నట్లు చెప్పినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. అయితే రైతుల భూములలో నిర్మాణ పనులను చేపట్టడంతో ఆ భూములు వ్యవసాయం చేసుకోవడానికి ఏమాత్రం పనికిరావు. కట్ట నిర్మాణ పనుల కోసం మట్టి భారీగా అవసరం కావడంతో దాదాపుగా 400 ఎకరాలకు పైగా పొలాలలోని మట్టిని యంత్రాల సహాయంతో పెద్దపెద్ద గుంతలు పెట్టి ఆ మట్టిని కట్ట నిర్మాణ పనుల కోసం తరలించి ఎందుకూ పనికి రాకుండా చేశారు. కాగా 400 ఎకరాలకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున గుత్త ఇస్తామని నమ్మబలికారు. అయితే కేవలం ఏడాది మాత్రం ఇచ్చి ఆ తర్వాత గుత్త సొమ్ము ఇవ్వలేదు ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారడంతో నిర్వాసితుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
నివేదికను ప్రభుత్వానికి అందజేశాం..
ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేశాము. గతంలో ఇక్కడ పని చేసిన అధికారులు రైతులకు సంబంధించిన భూముల వివరాలను పూర్తిగా సేకరించి సంబంధింత శాఖాధికారులకు అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
- తపశ్విని, తహసీల్దార్
మా గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ కోసం పూర్తిగా భూము లు, ఇళ్లను కోల్పోయాం. మేము ఈ ప్రాజెక్టు ని ర్మాణాన్ని పూర్తిగా వ్యవతిరేకించాము. అయితే అధికార పార్టీ నేతలు పోలీసులతో భయపెట్టించడం వలన తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకోవాల్సి వచ్చింది. పలుమార్లు జిల్లా, మండల స్థాయి అధికారులు మాతో సమావేశాలు నిర్వహించి భూపరిహారం, స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇస్తామని చెబుతూ మభ్య పెట్టారు. అయితే ఇప్పటి వరకు రావడం లేదు.
ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారింది. ఇక వస్తుందో...రాదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
- ఎ్‌స.భూమిరెడ్డి, శీతివారిపల్లె,
కురబలకోట మండలం
వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్‌లకు లబ్ధిని చేకూర్చడానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. మూడు పంటలు పండే మా భూములను కోల్పో యాం. మాకు వ్యవసా యం తప్ప మరేమీ తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ప్రాజెక్టు నిర్మాణం అన్నీ పోగొట్టుకున్నాము. దీంతో మేము రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. మాకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. గతం లో నిర్ణయించిన పరిహారం మేము తిరస్కరించినా మా మాటలను లెక్కచేయలేదు. అంతేకాకుండా చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం స్పందించి భూనిర్వాసితులకు న్యాయం చేసి ఆదుకోవాలి.
- మోహన్‌రెడ్డి, శీతివారిపల్లె,
కురబలకోట మండలం