Share News

Jagan : ‘బటన్‌’ కుట్రలు బద్దలు!

ABN , Publish Date - May 11 , 2024 | 05:10 AM

నే..........రుగా పడాల్సిన డబ్బులు ఎక్కడాగిపోయాయి? బటన్‌ నొక్కిన నాలుగు నెలలకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎందుకు జమ కాలేదు? కావాల్సిన కాంట్రాక్టర్లకు వేలకోట్లు చెల్లించేసి.

Jagan : ‘బటన్‌’ కుట్రలు బద్దలు!

జగన్నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్‌

ఇదీ జరిగింది..

4 నెలల కిందట నొక్కిన బటన్‌లకు ఎన్నికల ముందు డబ్బులేసి లబ్ధి పొందాలన్నది జగన్‌ వ్యూహం! గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి దాకా ఈ హైడ్రామా సాగిందిలా...

గురువారం: ఎప్పుడో నొక్కిన బటన్‌లకు ఇప్పుడు, పోలింగ్‌ ముందు డబ్బులు ఇవ్వడం ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది.

రాత్రి 10 గంటలు: ఈసీ ఆదేశాలను శుక్రవారం వరకు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 11, 12, 13 తేదీల్లో మాత్రం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని ఆదేశించింది.

అర్ధరాత్రి 1 గంట: హైకోర్టు ఉత్తర్వులతో వచ్చిన వెసులుబాటు నేపథ్యంలో... బటన్‌

నొక్కుడు డబ్బులు వేసేందుకు అనుమతించాలని ఈసీకి సీఎస్‌ జవహర్‌ రెడ్డి లేఖ.

శుక్రవారం ఉదయం: ఇప్పుడే డబ్బులు ఎందుకు వేయాలనుకుంటున్నారు, జనవరి నుంచి మార్చి మధ్య మీ ఆర్థిక పరిస్థితి సహకరించలేదా... వివరాలు చెప్పాలని ఈసీ ఆదేశం.

మధ్యాహ్నం 2 గంటలు: ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఈసీకి జవహర్‌ రెడ్డి జవాబు.

సాయంత్రం 4 గంటలు: హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై అప్పీలును విచారించిన ధర్మాసనం... ఈ సమయంలో ఉత్తర్వులు ఇచ్చినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో

విచారణ వాయిదా!

సాయంత్రం 7 గంటలు: సీఎస్‌ లేఖలో పొందుపరిచిన వివరాలను పరిశీలించిన ఈసీ. నిధుల విడుదలలో జగన్‌ సర్కారు కావాలనే జాప్యం చేసినట్లు నిర్ధారణ. ‘‘జనవరి నుంచి మార్చి వరకు బాగున్నా... అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఎప్పుడూ మే నెలలో డీబీటీ నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు కదా! ఇప్పుడు మాత్రం అత్యవసరం ఏముంది? పోలింగ్‌ ముగిశాకే డబ్బులు వేసుకోవచ్చు’’ అని ఈసీ స్పష్టీకరణ.

జనవరి-మార్చి మధ్య 6 పథకాలకు బటన్‌ నొక్కుడు

నెలలు దాటినా ఖాతాల్లో జమ చేయకుండా జాప్యం

పోలింగ్‌కు ముందు ఖాతాల్లో వేసి లబ్ధిపొందే కుట్ర

హైకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో అర్ధరాత్రి హంగామా

అనుమతి కోసం ఈసీకి సీఎస్‌ జవహర్‌ రెడ్డి లేఖ

వరుస ప్రశ్నలు సంధించిన ఎన్నికల కమిషన్‌

జనవరి-మార్చి మధ్య మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి?

ఆరు పథకాలకు ఇప్పుడే నిధులు ఎలా వచ్చాయి?

ఇవే పథకాలకు గతంలో ఎప్పుడు జమ చేశారు?

ఇన్ని నెలలు ఇవ్వకుండా.. ఇప్పుడు అర్జంట్‌ ఏమిటి?

బదులివ్వాలని సీఎ్‌సకు ఈసీ ఆదేశాలు

సీఎస్‌ సమాధానంతో కుట్రపై మరింత స్పష్టత

కావాలనే నిధులు విడుదల చేయలేదని నిర్ధారణ

పోలింగ్‌ తర్వాతే జమ చేయాలని సీఎ్‌సకు ఆదేశం

అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): నే..........రుగా పడాల్సిన డబ్బులు ఎక్కడాగిపోయాయి? బటన్‌ నొక్కిన నాలుగు నెలలకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎందుకు జమ కాలేదు? కావాల్సిన కాంట్రాక్టర్లకు వేలకోట్లు చెల్లించేసి... పేదలు, బడుగు, బలహీన వర్గాలకే ‘ఈ బిడ్డ’ ఎందుకు డబ్బులు ఆపేశారు? అప్పుడెప్పుడో బటన్‌ నొక్కి, తన సొంత, రోత పత్రికకు అప్పుడే కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చుకుని... అసలు లబ్ధిదారులకు మాత్రం ఇప్పుడు డబ్బులు వేస్తామనడమేమిటి? ఇదంతా... జగన్నాటకం! పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందు ఖాతాల్లో డబ్బులు జమచేసి, జనం సొమ్ముతోనే జనం ఓట్లను కొనుగోలు చేయాలన్న వ్యూహం! ఈ జగన్నాటకాన్ని ఎన్నికల సంఘమే బయటపెట్టింది. ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్‌ సొమ్ములు ఇప్పుడు జమచేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న కుయుక్తులను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కడిగిపారేసింది. ‘జవాబు చెప్పండి’ అంటూ శుక్రవారం ఈసీ సంధించిన ప్రశ్నలతో ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘‘ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, అదీ పోలింగ్‌కు 2 రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులేయడమంటే అధికార బలంతో ఓటర్లను ప్రభావితం చేయడమే! ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే. పోలింగ్‌ ముగిసిన తర్వాత(మే 13) ఎప్పుడైనా ఖాతాల్లో డబ్బు లు వేసుకోవచ్చు’’ అని సీఎస్‌ జవహర్‌ రెడ్డిని ఈసీ ఆదేశించింది.


అర్ధరాత్రి హంగామా...

హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పుతో లభించిన వెసులుబాటుతో... అప్పటికప్పుడు డబ్బులు వేసేలా గురువారం అర్ధరాత్రి ఉరుకులు పరుగులు తీశారు. హైకోర్టు తీ ర్పు ఎలా ఉన్నప్పటికీ.. ఎన్నికల ముందు జనం ఖాతాల్లో డబ్బులు వేయాలంటే ఈసీ అనుమతి కావాల్సిందే. దీంతో.. కోర్టు తీర్పును ఉటంకిస్తూ, తమకు అనుమ తి ఇవ్వాలని గురువారం అర్ధరాత్రి 1 గంటకు ఈసీకి సీఎస్‌ జవహర్‌ రెడ్డి లేఖ రాశారు. శుక్రవారం ఉదయం దీనిపై ఈసీ స్పందించింది. సీఎ్‌సకు వరుస ప్రశ్నలు సంధించింది. అవి...

  • జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే బటన్లు నొక్కినప్పటికీ అప్పుడు డబ్బుల్లేక డీబీ టీ చేయలేదని చెప్పారు కదా! అప్పుడు లేని డబ్బులు సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎలా వచ్చాయి?

  • జనవరి-మార్చి వరకు రాష్ట్ర ఆదాయం, ఖర్చుల వివరాలు పంపండి. అలాగే, 6 పథకాలకు ఒకేసారి డీబీటీ చేయడానికి ఇన్ని డబ్బులెలా వచ్చాయో చెప్పండి!

  • గడచిన ఐదేళ్లలో ఈ 6 పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్లు నొక్కారు? నొక్కిన ఎన్ని రోజులకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయి? ఇన్ని పథకాలకు కలిపి గంపగుత్తగా ఒకేసారి డబ్బు ఖాతాల్లోకి గతంలో ఎప్పుడైనా విడుదల చేశారా?

  • పోలింగ్‌ తర్వాతే డీబీటీ చేయాలన్న ఈసీఐ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేసిన వారు ఈ పథకాల లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా?

  • 5 నెలల నుంచి దశలవారీగా నొక్కుతున్న బటన్ల డబ్బులను ఈ రోజే(పదో తేదీనే) ఖాతాల్లో వేయాల్సిన అత్యవసరం ఏంటి? వేయకపోతే ఈ ఒక్కరోజులో ఏమైపోతుందో చెప్పండి. మార్చిలో కోడ్‌ వస్తుందని, మే నెలలో పోలింగ్‌ ఉంటుందని ముందే తెలిసినా డబ్బులు ఖాతాల్లో ఎందుకు వేయలేదు?

  • బటన్లు నొక్కిన పథకాలకు ఫలానా తేదీల్లో ఖాతాలో డబ్బు జమ చేయాలని ముందుగానే నిర్ణయించారా? దానికి సంబంధించిన జీవోలు, ఆదేశాల కాపీలు, ఇతర పత్రాలు ఏమైనా ఉన్నాయా?

కుట్ర బట్టబయలు...

ఈసీ సంధించిన ప్రశ్నలకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం సమాధానాలతో లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం... సాయంత్రానికే ఈసీ తన ఆదేశాలు వెలువరించింది. ‘‘మీరు ఇచ్చిన వివరాల ప్ర కారం.. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల ల్లో ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఖాతాల్లో వేస్తామంటున్న డబ్బులను అప్పుడే వేసేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉ న్నాయి. అలాకాకుండా.. జాప్యం జరగడానికి సీఎస్‌ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదు. పైగా... మే నెల లో ఎప్పుడూ డీబీటీ పథకాలకు నిధు లు జమ చేయలేదు.పోలింగ్‌ తర్వాత ఎప్పుడైనా డబ్బులు జమ చేసుకోండి’’ అని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

మరో రూ.4,000 కోట్ల అప్పు

కొత్తగా మరో రూ.4,000 కోట్ల అప్పులు తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం(14వ తేదీ) రిజర్వ్‌ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి రూ.4,000 కోట్లు అప్పు తెస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలలో ఇప్పటి వరకు కలిపి ప్రభుత్వం రూ.17,000 కోట్ల అప్పులు తెచ్చింది.

Updated Date - May 11 , 2024 | 05:46 AM