Share News

Jagan : చంద్రబాబూ.. హెచ్చరిస్తున్నా!

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:55 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ.. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపండి.. ఈసారి నేను కోరడం లేదు..

Jagan : చంద్రబాబూ..  హెచ్చరిస్తున్నా!

మా పార్టీ వారిపై దాడులు ఆపండి

పులివెందులలో ఇలాంటి సంప్రదాయం లేదు: జగన్‌

ఈ బీజం తిరిగి టీడీపీకే చుట్టుకుంటుందని వ్యాఖ్య

అధికారంలో ఎల్లకాలం ఉండరని హితవు

కడప రిమ్స్‌లో వైసీపీ కార్యకర్తకు పరామర్శ

పోలీసు ఆంక్షలు.. గంటపాటు రోగులకు నరకం

ఆస్పత్రి ఆవరణలో సీఎం సీఎం అంటూ శ్రేణుల నినాదాలు

కడప, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ.. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపండి.. ఈసారి నేను కోరడం లేదు.. హెచ్చరిస్తున్నా..’ అని మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జగన్‌ శనివారం కడప జిల్లాకు వచ్చారు. శుక్రవారం వేంపల్లెలో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేంపల్లె వద్ద 20 ఏళ్ల యువకుడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదన్నారు. ఆ వెంటనే మాట మార్చి.. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశాడనే వేంపల్లెకు వచ్చి కొట్టారన్నారు. ఇది వరకు పులివెందులలో ఇటువంటి సంప్రదాయం లేదని, ఎన్నికల్లో ఓటు వేయని వాళ్లని కొట్టే కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భయాందోళన కలిగిస్తున్నారని, దీంతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ‘మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సంప్రదాయం రేపు మళ్లీ టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది’ అని హెచ్చరించారు. ‘అధికారంలో ఎల్లకాలం మీరే ఉండరు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలు.. శిశుపాలుని పాపాలు పండినట్లుగా పండుతా ఉన్నాయి. ఈ చెడు సంప్రదాయం ఆయనకే చుట్టుకుంటుంది. ఈ దెబ్బలుతిన్న ప్రతి ఒక్కరు ఇదే మళ్లీ అటువైపు చేసేందుకు మీయంతట మీరే బీజం వేస్తున్నారు. నాయకులుగా ఉన్నవారు ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇది కరెక్ట్‌ సంప్రదాయం కాదు. పిల్లలకు సరిగా బ్యాగులు సప్లై కాలేదు. ఏ వ్యవస్థ సరిగా లేదు. రైతుభరోసా అందక రైతులు అల్లాడుతున్నారు. అమ్మఒడి జరగలేదు. అక్కచెల్లెమ్మలకు ఇస్తామన్న నెలకు రూ.1,500, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ.3,000కోసం వారందరూ ఎదురుచూస్తున్నారు’ అన్నారు. కాగా, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రిమ్స్‌కు వచ్చిన జగన్‌ గంటపాటు అక్కడే ఉండటంతో రోగులను పోలీసులులోనికి అనుమతించలేదు. 108 వాహనాల్లో వచ్చిన రోగులనూ అనుమతించకపోవడంతో ఆ వాహనాల్లోనే ఉండిపోయారు. బాధ భరించలేకున్నవారిని స్ర్టెచర్‌లో ఆస్పత్రిలోనికి తీసుకెళ్లారు. ఆసుపత్రి ప్రాంగణంలో కూడా సీఎం సీఎం అంటూ గట్టిగా కేకలువేస్తూ వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి.


ప్రజావేదిక కూల్చివేత మా తప్పే మాజీ విప్‌ కరణం ధర్మశ్రీ

చోడవరం, జూలై 6: ప్రజావేదిక వంటి కట్టడాలు కూలదోయడం వంటి కొన్ని తప్పులను నాడు తమ ప్రభుత్వం తెలిసో, తెలియకో చేసిందని మాజీ విప్‌, అనకాపల్లి జిల్లా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అంగీకరించారు. అందుకే ప్రజలు తమను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారని చెప్పారు. శనివారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, వైసీపీ కార్యాలయాల కూల్చివేత చర్యలతో కూటమి ప్రభుత్వం కూడా అవే తప్పులకు పాల్పడటం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. వైసీపీ కార్యాలయాలను కూల్చివేయడం, కార్యకర్తలపై దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు.

వైఎస్‌ వారసత్వం కోసం షర్మిల పోటీ!

ఘనంగా జయంతి నిర్వహణకు సన్నాహాలు

అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసత్వం కోసం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి మాజీ సీఎం జగన్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. సోమవారం(8న) ఆయన జయంతిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకాగాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు, సీపీఐ నేత కె.నారాయణ, సీపీఎం నేత బీవీ రాఘవులును ఆహ్వానించారు. వీరితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కూడా పిలువనున్నారు. ఆమె ఆలోచనలకు భిన్నంగా తండ్రి జయంతిని జగన్‌ ఇడుపులపాయ సమాధికే పరిమితం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటి మాదిరిగా పెద్దగా హడావుడి చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jul 07 , 2024 | 03:55 AM