Share News

YSRCP: వైసీపీలో కలకలం

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:21 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్‌, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంవోను తప్పుబడుతుండగా...

YSRCP: వైసీపీలో కలకలం

జగన్‌ వల్లే ఈ ఘోర పరాజయం

ఎమ్మెల్యేలు, ఎంపీలను పట్టించుకోలేదు

సంక్షేమం తానే కనిపెట్టినట్లు గొప్పలు

ఓడిపోయిన అభ్యర్థుల్లో అంతర్మథనం

సీఎంవో, కోటరీపైనా మండిపాటు

నేరుగా ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా

ఇతర అభ్యర్థులదీ అదే పరిస్థితి

తాడేపల్లి వైపు వచ్చేందుకు విముఖత

గెలుపొందిన అభ్యర్థులూ దూరం దూరం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్‌, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంవోను తప్పుబడుతుండగా... మరికొందరు జగన్మోహన్‌ రెడ్డి వైఖరే ఈ దుస్థితి కారణమని మండిపడుతున్నారు. మంగళవారం జక్కంపూడి రాజా నేరుగా సీఎం మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డిపైనే ధ్వజమెత్తారు. మరోవైపు... వైపీపీ ముఖ్యనేతలెవరూ తాడేపల్లి వైపు చూడడంలేదు. చివరికి... గెలుపొందిన పది మంది అభ్యర్థులు కూడా జగన్‌ను మర్యాదపూర్వకంగా కలవలేదు. తాడేపల్లి పేరు చెబితేనే ముఖం చిట్లిస్తున్నారు. ‘వైనాట్‌ 175’ అంటూ బీరాలు పలికిన జగన్‌ మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని... కోట్లు ఖర్చు చేసి కోలుకోలేనంతగా దెబ్బతిన్నామని వాపోతున్నారు.

‘‘డబ్బులిచ్చినా అప్యాయతలు ఏమయ్యాయో! అభిమానం ఏమైందో’ అంటూ నాటకీయ స్వరంతో జనంపైనే జగన్‌ నిందలు వేయడాన్ని ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, తాజా మాజీ మంత్రి తప్పుబట్టారు. ఈ పరిస్థితికి కారణం జగనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే క్యాడర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మినహా... పార్టీపరంగా ఎమ్మెల్యేలతో భేటీ కావడం, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడంవంటివి లేనే లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు.


ఎమ్మెల్యేలకు విలువేదీ...

ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిలా ఉండాల్సిన ఎమ్మెల్యేలకు జగన్‌ విలువే ఇవ్వలేదని కొందరు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోయారు. ‘‘ఎమ్మెల్యేలు, ఎంపీలను జగన్‌ ఏనాడూ పిలిచి మాట్లాడలేదు. ఐప్యాక్‌ బృందానికి ఇచ్చిన విలువ కూడా వారికివ్వలేదు’’ అని ఒక అభ్యర్థి పేర్కొన్నారు. ‘పథకాలు అమలు చేస్తే వాటంతట అవే ఓట్లు పడతాయని జగన్‌ భావించారు. సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ జమానా నుంచే ప్రజలకు అందుతున్నాయి. అయినా.. ఇవన్నీ తానే కొత్తగా అమలు చేస్తున్నట్లుగా జగన్‌ చెప్పుకొన్నారు. ఈ మాటలను జనం పట్టించుకోలేదు’’ అని కోస్తాలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థి ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్‌ మాటలకు ప్రజలు స్పందించలేదంటే... అసలు తమను పట్టించుకోలేదని అర్థమని వైసీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. పోలింగ్‌ రోజు ఈవీఎం మీద బటన్‌ నొక్కాక సైలెంట్‌గా మహిళలు బయటకు వచ్చేశారని, అదంతా తమ ఓటే అనుకుని భ్రమల్లో ఉన్నామని వాపోయారు.


శాసనసభా పక్ష సమావేశం ఎప్పుడు?

సీఎం జగన్‌ కాస్తా ఎమ్మెల్యే జగన్‌గా మారాక.. శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడంపై పార్టీలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. కార్యాలయంలో వ్యక్తిగత సలహాదారులు తప్ప నేతల సందడే లేదు. శాసనసభా పక్ష సమావేశంపై గురువారం నిర్ణయం తీసుకునే వీలుందని పార్టీ నేతలు చెబుతున్నారు.


తాడేపల్లి వైపు చూడని నేతలు

వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ నేతలెవరూ జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడటంలేదు. సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు ఇద్దరు ముగ్గురు ‘కోటరీ’ నేతలు మాత్రమే ఉదయం పూట జగన్‌తో సమావేశమవుతున్నారు. విచిత్రమేమిటంటే... జగన్‌ను మినహాయిస్తే వైసీపీ నుంచి మరో పది మంది అభ్యర్థులు మాత్రమే గెలిచారు. ఆ పది మంది కూడా తాడేపల్లి వైపు కన్నెత్తి చూడలేదు. గెలిచిన నలుగురు ఎంపీలు కూడా జగన్‌తో సమావేశం కాలేదు. ఓటమి పాలైన సీనియర్‌ మంత్రులు, ముఖ్య నేతలదీ అదే పరిస్థితి. ఎవరికి వారు ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ... తప్పంతా జగన్‌దే అనే నిర్ధారణకు వస్తున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 07:14 AM