Jagan : ఢిల్లీలో వాలిన జగన్
ABN , Publish Date - Feb 09 , 2024 | 02:39 AM
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపిన మరుసటి రోజే... వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.
అమిత్‌షా పిలుపు కోసం నిరీక్షణ!
బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి
నేడు ప్రధానితో సీఎం భేటీ!?
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపిన మరుసటి రోజే... వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో దేశ రాజధానిలో వాలిపోయారు. వచ్చీ రాగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకునేందుకు సమయం కోరారు. అయితే... ఆయన ఇతర వ్యవహారాల్లో తల మునకలై ఉన్నారని, కుదిరితే శుక్రవారం సమయమిస్తారని హోంమంత్రి వ్యక్తిగత సిబ్బంది రాత్రి 10 గంటల ప్రాంతంలో జగన్‌కు చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వరకూ జగన్ ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో భాగస్వామి కావాలని అమిత్‌షా ఆయనను కోరారని, పరస్పర ప్రయోజనాల రీత్యా కలిసి వెళ్లాలనే అవగాహన కుదిరిందని ఇరుపార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంలో జగన్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడం గమనార్హం. శుక్రవారం ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.