Share News

జమ్మలమడుగు జగడంపై జగన్‌ భేటీ

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:19 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు చేరుకున్నారు.

జమ్మలమడుగు జగడంపై జగన్‌ భేటీ

సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య కుదరని సయోధ్య!

రెండు రోజుల పర్యటనకు పులివెందులకు మాజీ సీఎం

పులివెందుల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి ఇడుపులపాయకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని అతిథిగృహంలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను కలిశారు. 12 గంటల ప్రాంతంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్‌ భేటీ అయ్యారు. వారు ఇరువురూ ఎవరికి వారే యమునాతీరే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. భేటీలో ఈ ఇద్దరూ వారి వారి సమస్యలను జగన్‌ వద్ద ఏకరువు పెట్టారు. ఇరువురి మధ్య సయోధ్యలేని కారణంగా పార్టీ జమ్మలమడుగులో బలహీనపడుతోందని, ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పార్టీ బలపడుతుందని వారికి జగన్‌ సర్దిచెప్పినట్లు తెలిసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చెరో మూడు మండలాల బాధ్యతలను చూసుకోవాలని జగన్‌ చెప్పినట్లు తెలిసింది. దీనికి సుధీర్‌రెడ్డి అంగీకరించలేదని సమాచారం. రెండు గంటల పాటు సాగిన సయోధ్య చర్చల అనంతరం ముందుగా సుధీర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌ నుంచి మౌనంగా వెళ్లిపోయారు. అనంతరం రామసుబ్బారెడ్డి వెళ్లిపోయారు. జగన్‌ సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో తన కోసం వేచిచూస్తున్న నాయకులను, కార్యకర్తలను కలిశారు. అక్కడే ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మంగళవారం ప్రజాదర్బార్‌కు పులివెందుల ప్రజలు చెప్పుకొనేంత స్థాయిలో రాలేదు. జగన్‌ రాత్రికి పులివెందులలోనే బస చేశారు.

Updated Date - Oct 30 , 2024 | 04:19 AM