Rushikonda : రుషికొండపై ఇదేం డ్రామా?
ABN , Publish Date - Feb 29 , 2024 | 04:30 AM
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై అడ్డగోలుగా నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని పర్యాటక మంత్రి ఆర్కే రోజా గురువారం ప్రారంభించబోతున్నారు. రుషికొండపై పర్యాటక ఆదరణ పొందుతున్న రిసార్ట్స్‌ను కూలగొట్టి, కొండకు బోడిగుండు చేసి మరీ క్యాంపు
జగన్ ప్యాలెస్ వెలిగిపోవాలి..
రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాలె్‌సలు ఇవి! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు. కట్టుకున్నది జగన్ కోసమే! కట్టింది జనం ధనంతోనే! పూర్తికాని పనులకూ ‘సెట్టింగ్’లు వేసి బటన్ నొక్కుతున్న జగన్.. రూ.500 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను ప్రారంభించే అవకాశాన్ని మాత్రం మంత్రి రోజాకు ఇచ్చారు! గురువారం వీటిని గుట్టుగా ప్రారంభిస్తున్నారు.
నేడు గుట్టుగా ప్రారంభం
పర్యాటకం ముసుగులో.. సీఎం క్యాంపు ఆఫీసు కోసం నిర్మాణం
రూ.198 కోట్ల అంచనా పనులకు ఇప్పటిదాకా 450 కోట్ల వ్యయం
అత్యంత విలాసవంతంగా భవనాలు
అయినా ప్రారంభోత్సవానికి ముఖం చాటేసిన జగన్
బాధ్యతలు మంత్రులు రోజా, రజనీలకు
కోర్టుల్లో మాట వస్తుందనేనా?
5వ తేదీ తర్వాత వారానికి మూడ్రోజులు ఇక్కడి నుంచే పాలన?
వైసీపీ వర్గాల్లో ప్రచారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై అడ్డగోలుగా నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని పర్యాటక మంత్రి ఆర్కే రోజా గురువారం ప్రారంభించబోతున్నారు. రుషికొండపై పర్యాటక ఆదరణ పొందుతున్న రిసార్ట్స్‌ను కూలగొట్టి, కొండకు బోడిగుండు చేసి మరీ క్యాంపు కార్యాలయం కోసం భవనాలు నిర్మించారు. రూ.198 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి ఇప్పటివరకూ రూ.450 కోట్లు ఖర్చు చేశారు. అత్యంత విలాసవంతంగా నిర్మించారు. రుషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ దీనికి ‘పర్యాటక భవనాలు’ అని ముసుగు తొడిగారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచే పాలన సాగించబోతున్నారని ఆర్భాటం చేశారు. ‘ఉగాదికి వస్తున్నాం.. దసరాకు వచ్చేస్తాం.. డిసెంబరు నుంచి మీ బిడ్డ కాపురం ఇక్కడే.. సంక్రాంతి తర్వాత విశాఖలోనే’ అంటూ ప్రకటనటు గుప్పిస్తూ వచ్చారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు ఉండడంతో కాలు పెట్టలేకపోయారు. ఇంకా ఆ కేసులు తేల లేదు. వాటి కోసం చూసుకుంటే పుణ్యకాలం గడిచిపోతుందని ఇప్పుడు ప్రారంభోత్సవమంటూ కొత్త డ్రామాకు తెర తీశారు.
ఏదైనా జిల్లాలో కోటి రూపాయల ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటేనే హెలికాప్టర్ వేసుకుని వెళ్లిపోతున్న జగన్.. రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మించుకున్న క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి మాత్రం ముఖం చాటేశారు. అటు తిరిగి.. ఇటు తిరిగి కోర్టుల్లో మాట పడాల్సి వస్తుందని భయపడ్డారో ఏమో.. మంత్రి రోజా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజనికి ఆ బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్, కొందరు అధికారులు, వైసీపీ నేతల సమక్షంలో మంత్రులు ప్రారంభిస్తారు. నిన్నటికి నిన్న కుప్పానికి కృష్ణా నది నీళ్లు అంటూ ఉత్తుత్తి గేట్లు పెట్టి హంగామా చేసి అభాసుపాలైన నేపథ్యంలో.. విశాఖకు ముఖం చెల్లక రావడం లేదనే వాదన వినిపిస్తోంది. కాగా.. మంత్రి రోజా చేతుల మీదుగా లాంఛనంగా భవనం ప్రారంభం కాగానే.. మార్చి 5వ తేదీ తరువాత సీఎం విశాఖ వచ్చి వారానికి మూడు రోజులు ఇక్కడే ఉంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ.. త్వరలో జగన్ విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తారని చెప్పడం దీనికి సంకేతమని ఆ వర్గాలు చెబుతున్నాయి.