ప్రమాణాన్ని విస్మరించిన జగన్: టీడీపీ ధ్వజం
ABN , Publish Date - Jun 23 , 2024 | 04:04 AM
స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ గైర్హాజరు కావడంపై పలువురు నేతలు స్పందించారు.
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ గైర్హాజరు కావడంపై పలువురు నేతలు స్పందించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎక్స్‌లో... ‘ప్రజాతీర్పుతో కొలువుదీరిన శాసనసభలో జగన్ తొలి రోజు చేసిన ప్రమాణాన్ని రెండో రోజే విస్మరించారు. రెండోరోజు సభలో జరిగిన స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరు కావడం సభా సంప్రదాయాలను పాటించకపోవడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ‘సభా మర్యాద ఏమాత్రం లేని వ్యక్తి జగన్ అని ఇన్నాళ్లూ జనం ఇన్నాళ్లు అనుకుంటున్న దానిని రెండో రోజే ఆయన నిజం చేశారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా.. స్పీకర్ ఎన్నిక రోజు అసెంబ్లీలో ఉండటం సభా మర్యాద. ఆయన సభకు రాకుండా పులివెందుల వెళ్లారు. అనుమతులు లేవని ప్రభుత్వ భవనాలను కూల్చిన జగన్.. తాను అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చుతుంటే శోకాలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘సభా మర్యాదలను గౌరవిస్తామని ప్రమాణం చేసిన జగన్.. స్పీకర్ ఎన్నికకు గైర్హాజరై, సభా సంప్రదాయాలను విస్మరించారు’ అని అన్నారు. టీడీపీ, జనసేన మధ్య సమన్వయం చాలా బాగుందని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఈ పొత్తు ఈ ఐదేళ్లు కాదు.. పదేళ్లకుపైగా కొనసాగుతుందన్నారు.