Share News

ఆ లంచం ఖరీదు 72వేల కోట్లు!

ABN , Publish Date - Nov 23 , 2024 | 06:00 AM

ఒకరి అవినీతి... మరొకరి అత్యాశ! ఈ రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వేల కోట్లకు ముంచేశాయి.

ఆ లంచం ఖరీదు 72వేల కోట్లు!

1750 కోట్ల ముడుపుల కోసం జనంపై జగన్‌ భారం

అదానీ నుంచి జగన్‌ తీసుకున్న లంచం రూ.1750 కోట్లు! ఇది అమెరికా దర్యాప్తు సంస ్థలు నిర్ధారించిన లెక్క. కానీ... దీనివల్ల రాష్ట్ర ప్రజలపై పడిన భారం ఎంతో తెలుసా? దాదాపు రూ.72,000 కోట్లు!

పేరుకే సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం! కానీ... అదానీ సంస్థ ఆ విద్యుత్‌ సరఫరా చేయనేలేదు. దీంతో 2021 నుంచి 2024 వరకు మార్కెట్‌లో భారీ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేశారు. ఆ భారం రూ.42వేల కోట్లు! దీనిని ట్రూ అప్‌ చార్జీల రూపంలో ప్రజల నెత్తినే వేశారు. 2021లో ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) పిలిచిన టెండర్లను రద్దు చేయకుంటే.. సోలార్‌ విద్యుదుత్పత్తి సంస్థలు వెంటనే విద్యుత్‌ సరఫరా చేసేవి. దీనివల్ల మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్‌ కొనాల్సిన అవసరం ఉండేది కాదు. జనం నడ్డివిరిగేలా తొమ్మిదిసార్లు ట్రూఅప్‌ చార్జీల భారం వేయాల్సిన అవసరం వచ్చేదికాదు.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఎక్కడో రాజస్థాన్‌లో ఉత్పత్తయిన విద్యుత్తును ఏపీకి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. యూనిట్‌ విలువ రూ.2.49. దీనికి అదనంగా పవర్‌ గ్రిడ్‌కు యూనిట్‌కు 80 పైసల చొప్పున ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు చెల్లించాలి. దీని భారం... రూ.30,600 కోట్లు. ఏపీజీఈసీఎల్‌ టెండర్ల ద్వారా స్థానికంగానే సౌర విద్యుదుత్పత్తి జరిగితే ఈ భారం పడేదే కాదు.

ఒప్పందం మేరకు విద్యుత్తు సరఫరా చేయని ‘అదానీ’

2021-24 మధ్య మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు

ఆ భారం 42 వేల కోట్లు.. ట్రూఅప్‌ చార్జీల పేరుతో బాదుడు

ట్రాన్స్‌మిషన్‌ చార్జీల భారం రూ.30,660 కోట్లు

ఏపీజీఈసీఎల్‌ టెండర్లు ఓకే చేసుంటే ఈ భారం తప్పేది

అదానీ కోసమే ఆ టెండర్లను రద్దు చేసిన జగన్‌ సర్కార్‌

సెకీ నుంచి గుజరాత్‌ కొన్నది యూనిట్‌ రూ.1.99 మాత్రమే

2.49 చెల్లించేందుకు సిద్ధపడి ఒప్పందం చేసుకున్న జగన్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరి అవినీతి... మరొకరి అత్యాశ! ఈ రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వేల కోట్లకు ముంచేశాయి. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ గ్రూప్‌ జగన్‌కు సమర్పించిన ముడుపులు రూ.1750 కోట్లని అమెరికా నిగ్గు తేల్చింది. అయితే... ఇది కేవలం 1750 కోట్లకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ లంచాల బంధంవల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు 72వేల కోట్ల భారం పడింది. ‘జగన్‌-అదానీ’ పరస్పర ప్రయోజనాలకు రాష్ట్రం ఆర్థికంగా బలైపోయే పరిస్థితి తలెత్తింది. నాడు అదానీకి మేలు చేయడానికి గత జగన్‌ ప్రభుత్వం అన్ని అడ్డదారులూ తొక్కింది. కేవలం అదానీకి తలుపులు తెరవడం కోసం... ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) పిలిచిన 10,000 మెగావాట్ల టెండర్లను రద్దు చేసింది. రైతాంగానికి పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా సోలార్‌ విద్యుత్తు సేకరించేందుకు ఏపీజీఈసీఎల్‌ 2021లో టెండర్లు పిలిచింది. యూనిట్‌ను రూ.2.49 ధరకు ఇచ్చేందుకు సోలార్‌ ఉత్పత్తి సంస్థలు ముందుకొచ్చాయి. అప్పట్లో దేశీయంగా సోలార్‌ విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.2.92గా ఉంది. ఏపీజీఈసీఎల్‌ పిలిచిన టెండర్‌కు స్పందిస్తూ సోలార్‌ సంస్థలు యూనిట్‌ను రూ.2.49కు ఇస్తామనడం అప్పట్లో జాతీయ స్థాయిలో బెంచ్‌ మార్క్‌గా మారింది. జగన్‌ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోలు ఒప్పందాలు చేసుకునేది. అయితే అలా చేయలేదు. అదానీకి దోచిపెట్టడానికి స్కెచ్‌ వేశారు.


2021లో జగన్‌తో అదానీ భేటీ తర్వాత...

సెకీతో ఒప్పందం చేసుకున్న అదానీ, అజూర్‌ సంస్థలు 2021లో జగన్‌ను కలిశాయి. తాము 9,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధ్దంగా ఉన్నామని వెల్లడించాయి. యూనిట్‌ ధరను రూ.2.92గా పేర్కొన్నాయి. అయితే.. అప్పటికే గుజరాత్‌ సెకీ నుంచి యూనిట్‌ సోలార్‌ విద్యుత్తును రూ.1.99కే తీసుకుంటోంది. అదే సమయంలో ఏపీజీఈసీఎల్‌ పిలిచిన టెండర్లకు బిడ్డర్లు యూనిట్‌ విద్యుత్తును రూ.2.49కే ఇస్తామంటూ మందుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో అదానీ, అజూర్‌ నుంచి అంతే కంటే ఎక్కువ ధరకు యూనిట్‌ను రూ.2.92కు కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది. అదే సమయంలో జగన్‌తో అదానీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోలార్‌ విద్యుత్తును యూనిట్‌ను రూ.2.31... సెకీకి ఏడు శాతం కమీషన్‌ 17 పైసలు... మొత్తంగా యూనిట్‌ను రూ.2.49కే ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నివాసంలో ఒప్పందం కుదిరింది. అయితే... మరి సమస్యేముందనుకుంటున్నారా! చాలా ఉంది. ఎక్కడో రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును ఏపీకి సరఫరా చేసేందుకు ట్రాన్స్‌మిషన్‌ చార్జీల కింద యూనిట్‌కు 80 పైసలు అదనంగా పడుతుంది. ఆ మొత్తం విలువ 30,600 కోట్లు. అదే ఏడాది సెకీ నుంచి గుజరాత్‌ సర్కారు యూనిట్‌ రూ.1.99కే కొంటున్నా జగన్‌ పట్టించుకోలేదు. 50 పైసలు అదనంగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ‘మేం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అదానీతో కాదు. ఇంకా లంచాల ప్రస్తావన ఎక్కడిది?’ అని వైసీపీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. కానీ... అసలు డ్రామా అక్కడే ఉంది. సెకీ విక్రయించేది అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసే విద్యుత్తునే! అంటే... డిస్కమ్‌లు కొనేది అదానీ కరెంటునే! అంతా పారదర్శకంగా జరుగుతోందని చెప్పేందుకు ‘సెకీ’ని వాడుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా తెలిపాయి. మరోవైపు... అదానీ, అజూర్‌ సంస్థలతో సెకీ ఒప్పందాన్ని చేసుకుందంటూ ఈ పీపీఏలను ఆమోదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీఈఆర్‌సీ స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ... సెకీతో రాష్ట్ర ఇంధన సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అదానీ ప్రస్తావన ఎందుకు వస్త్తోందని జగన్‌ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.


రివర్స్‌ టెండరింగ్‌ ఏదీ?

కాంట్రాక్టు విలువ రూ.100 కోట్లను మించితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్నది జగన్‌ ప్రభుత్వ విధానం. కానీ 25 ఏళ్ల కాలానికి 7,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును యూనిట్‌ ధర రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.95,429 కోట్లు! దీనిపై జగన్‌ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లలేదు. వెళ్లిఉంటే... అప్పటికే గుజరాత్‌కు యూనిట్‌ను రూ.1.99 ధరకు ఇస్తున్నందున ఆ స్థాయిలో ధరను తగ్గించేదని నిపుణులు చెబుతున్నారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుండా, ధర తగ్గించకుండా ఉండేందుకే జగన్‌తో అదానీ సంప్రదింపులు జరిపారని అంటున్నారు. కొవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో 2021 డిసెంబరు 1న రాష్ట్ర ఇంధన శాఖ, డిస్కమ్‌లతో పాటు సెకీ, కేంద్ర ఇంధన శాఖ, ఏపీ రూరల్‌ అగ్రికల్చర్‌ పవర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ (ఏపీజీఈసీఎల్‌ పేరు మార్చారు) 7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి.

Updated Date - Nov 23 , 2024 | 06:01 AM