Share News

జగన్‌ కుర్చీ గల్లంతే

ABN , Publish Date - Feb 16 , 2024 | 03:24 AM

రాబోయే ఎన్నికలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్‌ అంటున్నాడు.

జగన్‌ కుర్చీ గల్లంతే

జాగ్రత్తగా ఉండు.. జగన్‌రెడ్డీ..

ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడతపెట్టడం కాదు: చంద్రబాబు

అమరావతి/ విజయవాడ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘‘రాబోయే ఎన్నికలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్‌ అంటున్నాడు. నువ్వు, వైసీపీ వాళ్లు చొక్కాలు మడతపెడితే.. టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు కుర్చీలు మడతపెడతారు. అందరం కుర్చీలు మడతపెడితే జగన్‌రెడ్డీ! నీకు కుర్చీ లేకుండా పోతుం ది. ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండు. మంచికి కూడా హద్దులుంటాయ్‌.. పిచ్చికూతలు కూస్తే.. తగిన విధంగా సమాధానం చెప్పే ఽధైర్యం ప్రజలకు ఉంది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడతపెట్టి కొట్టుకోవడం కాదని, ద్వంద్వయుద్ధమని హితవు పలికారు. సీనియర్‌ పాత్రికేయుడు ఆలపాటి సురే్‌షకుమార్‌ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో జరిగింది. విశాలాంధ్ర సంపాదకుడు ఆర్వీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు.. పుస్తకం తొలి కాపీని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘జగన్‌ ప్రభుత్వంలో నేను, పవన్‌ సహా అందరూ బాధితులే. ఈ నియంత పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మన బిడ్డల భవిష్యత్తు నాశనమైంది. ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైపోయింది. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్‌ దెబ్బతింటే.. దానిని మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టం. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ధ్వసం చేసి.. గత ఐదేళ్లుగా మూడు రాజధానులన్నారు. ఇప్పుడు నాలుగో రాజధాని (హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా) అంటున్నారు. పైగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి రాజధాని నగరం కావాలాంటున్నారు. వీళ్లకు సిగ్గు ఎగ్గూ ఉన్నాయా? ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో చూడండి.

ఈ అరాచకానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. జగన్‌ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను తరిమేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌. అమర్‌రాజా పరిశ్రమను తెలంగాణకు పారిపోయేలా చేశాడు. ఆ సంస్థ యజమాని, ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాల నుంచే దూరంగా వెళ్లిపోయారు. రాష్ట్రాన్ని, 5కోట్ల ప్రజల సంకల్పాన్ని కాపాడాలనే గట్టిసంక్పలంతో నేను, పవన్‌ ముందుకెళ్తున్నాం. అన్న క్యాంటీన్‌లు పెట్టి పేదలకు భోజనం పెడితే జగన్‌ భరించలేకపోయాడు. మాస్క్‌ అడిగినందుకు దళితుడైన డాక్టర్‌ సుధాకర్‌ను వేధించి, పిచ్చోడ్ని చేసి చివరకు పొట్టన పెట్టుకున్నారు. వైసీపీ నేతల వేధింపు కారణంగా నంద్యాలలో అబ్దుల్‌ సలీం కుటుంబ సభ్యులతో సహా బలవంతంగా చనిపోయారు. తన అక్కని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు అమర్నాథ్‌ గౌడ్‌ అనే బాలుడిని నడిరోడ్డులో పెట్రోలు పోసి కాల్చి చంపేశారు. గుంటూరులో శంకర్‌ విలాస్‌ రంగనాయకమ్మను వేధించి హైదరాబాద్‌కు పంపేశారు. చివరికి జగన్‌ సొంత చెల్లెలు, కన్న తల్లిని సోషల్‌ మీడియాలో ఏం చేస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? జగన్‌కు సంపాదనే ధ్యేయం. దానికి అడ్డం వస్తే పవనా.. చంద్రబాబా ఎవరైనా లెక్కలేదు. ఆయన బాటలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చెడును నివారించడానికి ప్రజలందరూ నడుం బిగించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా చైతన్యవంతం కావాలి. ఈ ప్రభుత్వంపై తిరగబడతారా? బానిసలుగా ఉండిపోతారా? అనేది ప్రజలే తేల్చుకోవాలి. ఇక 54 రోజులే సమయం ఉంది. జగన్‌ లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కడుతూ ‘విధ్వంసం’ పేరుతో పుస్తకం రాసిన ఆలపాటి సురే్‌షను ఆయన అభినందించారు. విప్లవాలు, పోరాటాలపై పుస్తకాలు రావడం చూశామని, పరిపాలనపై ‘విధ్వంసం’ పేరుతో పుస్తకం రావడం తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని చెప్పారు. 5కోట్ల ప్రజల మనసుల్లో ఉన్న మాటలకు రచయిత అక్షరరూపం ఇచ్చారని కొనియాడారు. ఈ పుస్తకం ప్రతి ఇంటికి, రచ్బబండ వద్దకు వెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

అలిపిరి ఘటనలో క్లెమోర్‌ మైన్లు పేలినప్పుడు కూడా నా కళ్లలో నీళ్లు రాలేదు. అసెంబ్లీలో జరిగిన అవమాన భారాన్ని భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాను.

పవన్‌ మీటింగ్‌ కోసం స్థలం ఇచ్చారనే కారణంతో ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో గ్రామస్థుల ఇళ్లను కూల్చివేశారు. ఇలాంటి పనులు చేసి సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా?

నేను బాధపడుతూ ఉండాలనే ప్రజావేదికను కూల్చివేసిన శిథిలాలను ఇప్పటికీ తొలగించకుండా అలాగే ఉంచేశారు. ముఖ్యమంత్రిని ప్రజలందరూ సైౖకో అని పిలుస్తున్నారంటే.. అందులో ఎంత యథార్థం ఉందో అర్థమవుతుంది.

మద్యం, ఇసుక, మైనింగ్‌.. రాష్ట్రంలో ఏది దొరికితే దానిని మొత్తం దోచేస్తున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం వద్దకు వెళ్తారు. ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి వద్దకు వెళ్లాలి?

- చంద్రబాబు

Updated Date - Feb 16 , 2024 | 03:24 AM