Share News

జగన్‌ కుట్రలు సాగవు

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:13 AM

ఉనికి కోసమే జగన్‌ ఫేక్‌ రాజకీయాన్ని నమ్ముకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.

జగన్‌ కుట్రలు సాగవు

ఉనికి కోసమే ఫేక్‌ రాజకీయం

ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు

శాంతిభద్రతల అంశంలో రాజీలేదు

పోలీసులూ కఠినంగా ఉండాలి: బాబు

ఉనికి కోసమే జగన్‌ ఫేక్‌ రాజకీయాన్ని నమ్ముకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్‌ ప్రవర్తనలో మార్పు రాలేదని, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీల సమావేశంలో అన్నారు. జగన్‌ బెదిరింపులకు భయపడేది లేదని, కుట్రలను సాగనిచ్చేది లేదన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, పోలీసులు కూడా కఠినంగా ఉండాలన్నారు. వినుకొండ హత్య అత్యంత కిరాతకమని, నిందితులను వదిలేదిలేదన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు జగన్‌ రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.

జగన్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

శాంతిభద్రతలపై జగన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. ‘ఆయనను పట్టించుకోనక్కరలేదు. కాని అబద్ధాలు చెబితే వదిలిపెట్టవద్దు. కూటమి ప్రభుత్వం వచ్చిన 35 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారని జగన్‌ ప్రచారం మొదలు పెట్టారు. దమ్ముంటే ఆ జాబితాను బయటకు ఇవ్వమనండి. నిజమో కాదో తేలిపోతుంది. ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో నలుగురు రాజకీయ హత్యలకు గురైతే అందులో ముగ్గురు టీడీపీకి, ఒకరు వైసీపీకి చెందినవారు. ఢిల్లీలో జగన్‌ మాట్లాడితే మీరు కూడా వెంటనే మాట్లాడండి అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 04:13 AM