‘అధ్యక్షా’.. ఆ మాటే
ABN , Publish Date - Nov 23 , 2024 | 05:18 AM
ఎమ్మెల్యే అయ్యే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీకి వెళ్తేనే ఆ పదవికి సార్థకత.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంతోనే సరి
వైసీపీ నుంచి నలుగురు తొలిసారి ఎన్నిక
జగన్ నిర్ణయంతో అసెంబ్లీకి దూరం.. సభలో మాట్లాడే అవకాశమే లేదాయె
ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్న జగన్.. ఈ ఐదేళ్లలో హోదా దక్కడం కష్టమే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎమ్మెల్యే అయ్యే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీకి వెళ్తేనే ఆ పదవికి సార్థకత. ఆ నియోజకవర్గానికి సభలో ప్రాతినిధ్యం ఉంటుంది. సాధారణంగా ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీకి వెళ్లాలని, స్పీకర్‌ను ‘అధ్యక్షా’ అంటూ సభలో మాట్లాడాలనే కోరిక ఉంటుంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అయితే మరీను. అయితే వైసీపీ అధినేత జగన్ నిర్ణయం కారణంగా ఆ పార్టీ తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఈ అరుదైన అవకాశం కోల్పోవాల్సి వస్తోంది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడమే తప్ప అధ్యక్షా అని పిలిచే భాగ్యానికి నోచుకోలేకపోయారు. దీనికంతటికీ జగనే కారణం. గత ఐదేళ్లూ అరాచక పాలన సాగించిన జగన్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్‌తో సహా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా, కావాల్సిందేనంటూ జగన్ మారాం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వింత రాజకీయానికి తెరలేపారు.
జగన్ నిర్ణయానికి అసలు కారణం వేరే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ విషయాన్ని అటుంచితే... జగన్ నిర్ణయం కారణంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరం కావాల్సి వచ్చింది. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను చెప్పుకొనే హక్కును కోల్పోయారు. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో నలుగురు కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. మిగిలిన ఏడుగురు పాతవారే. వైసీపీ అధినేత జగన్ మూడుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి ఏడుసార్లు ఎన్నికయ్యారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నాలుగుసార్లు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మూడుసార్లు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి రెండుసార్లు చొప్పున గెలిచారు. ఈ ఏడుగురికి అసెంబ్లీలో అనుభవం ఉంది. అయితే అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం, పాడేరు ఎమ్మెల్యే మత్సరస విశ్వేశ్వరరాజు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి అసెంబ్లీకి ఈసారి కొత్తగా ఎన్నికయ్యారు.
భవిష్యత్ ఏమిటో..?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో కూటమి పార్టీలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో పెద్దగా సమస్యలపై మాట్లాడే వీలులేకుండా పోయింది. ఆ తర్వాత వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగు పెట్టలేదు. ఈ నెల 11వ తేదీ నుంచి జరుగుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు దూరమయ్యారు. దీంతో వైసీపీ తరఫున కొత్తగా గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అని పిలిచే అవకాశం కోల్పోయారు. భవిష్యత్‌లోనూ అసెంబ్లీకి వస్తారా? రారా? అన్నది ప్రస్తుతానికి సందేహమే. ఎందుకంటే... ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కే చాన్స్ కనిపించడం లేదు. ఇచ్చేదాకా అసెంబ్లీకి రామంటూ జగన్ ప్రకటించారు. దీంతో కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలతో సహా మొత్తం 11 మంది వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వారి భవిష్యత్ జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.