ఉద్యోగులపై నాటి జగన్ సర్కారు కర్కశం
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:24 AM
గత జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు.
హక్కుల కోసం ప్రశ్నిస్తే కేసులు..బెదిరింపులు
ఆర్థిక విధ్వంసంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినందుకు వేధింపులు
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన
నాడు చంద్రబాబు అండగా నిలిచారని వెల్లడి
అమలాపురం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. హక్కుల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం ఆ సంఘం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాశాఖ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ నాటి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్ములకు సైతం భద్రత లేకుండా చేయడాన్ని వివరిస్తూ అప్పట్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తే.. తనను, తన కుటుంబాన్ని, ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ సభ్యులందరినీ వైసీపీ ప్రభుత్వం వేధించిందన్నారు. ఎస్‌ఆర్కే(సజ్జల రామకృష్ణారెడ్డి)ని క్షమాపణ కోరకపోతే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడని ఆలిండియా సర్వీసు పోలీసు అధికారి సైతం తనను హెచ్చరించారని వివరించారు. ‘ఎక్కడ తిరిగానో ఎలా ఉన్నానో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అండగా నిలిచి ధైర్యం చెప్పింది నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రమే. సుప్రీంకోర్టు ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్‌తో మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చా.
రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై శాసనసభా నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రూ.22,980 కోట్ల బకాయిలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. అదే విషయాన్ని అప్పట్లో గవర్నర్‌కు ఫిర్యాదుచేస్తే జగన్ ప్రభుత్వం నన్ను దేశద్రోహిగా చిత్రీకరించింది’ అన్నారు. ఉద్యోగులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయాన్ని వీడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో సంఘాన్ని సంస్థాగతంగా మరింత పటిష్ట పరిచి రాష్ట్రంలోనే నంబర్ వన్ సంఘంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపారావు, వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.