జగన్ గొంతు వణుకుతోంది
ABN , Publish Date - May 10 , 2024 | 04:40 AM
‘పోలింగ్‌కు ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ గొంతులో వణుకు కనిపిస్తోంది. ప్రతిపక్షాలన్నీ కలసి తనను ఒంటరిని చేసి ఓడించడానికి చూస్తున్నాయని చెబుతున్నారు.
ప్రతిపక్షాలు ఉన్నది ఓడించడానికే
విజయవాడ బహిరంగ సభలో పవన్ కల్యాణ్
విజయవాడ, మే 9(ఆంధ్రజ్యోతి): ‘పోలింగ్‌కు ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ గొంతులో వణుకు కనిపిస్తోంది. ప్రతిపక్షాలన్నీ కలసి తనను ఒంటరిని చేసి ఓడించడానికి చూస్తున్నాయని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఉన్నది ఓడించడానికి కాకపోతే జగన్‌ను గెలిపించడానికా?’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కూటమి అభ్యర్థుల తరపున గురువారం విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్‌లో నిర్వహించిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు. ‘జగన్ చేసిన పనుల వల్లే అధికారులను బదిలీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేశావో ఒక్కసారి గుర్తుచేసుకో జగన్. ఏ ఒక్కరినీ నామినేషన్ వేయనీయలేదు. నామినేషన్ వేసిన వారిని కొట్టారు. ఇదంతా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యం. ఓటమి తర్వాత వైసీపీ గూండాలు, రౌడీలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా బాధ్యతను తెలియజేయాలో మాకు తెలుసు. ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తా’ అని పవన్ హెచ్చరించారు. ‘ఓటును చాలా బాధ్యతతో ఉపయోగించుకోవాలి. ప్రజలకు ప్రజాస్వామ్యం విలువ తెలిసినంతగా మనకు తెలియడం లేదు. జగన్ ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం పెట్టి... ఆయన చెప్పిన విధానాలు మాత్రం అమలు చేయలేదు. ఎస్సీలకు సంబంధించిన 11, బీసీలకు సంబంధించిన 27పథకాలు రద్దు చేశారు. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం హామీలు ఇచ్చి అమలు చేయని జగన్... ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు ఇస్తారా? కులాల ఐక్యత జనసేన పార్టీ లక్ష్యం. యువత బాధ్యతతో ప్రజలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి ఓటు వేయాలి. ఉదయం 11గంటలకే 70ు ఓటింగ్ నమోదు కావాలి’ అని పవన్ పిలుపునిచ్చారు.
నా ప్రేమ, మద్దతు మీకే..!: అల్లు అర్జున్
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు పలుకుతున్న హీరోల జాబితాలో మరో స్టార్, పుష్ప ఫేం అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలి అన్న నిబద్దత పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆంకాక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
పవన్‌పై ఇదేం కక్ష..!
కాకినాడ, మే 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ నగరంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో భాగంగా శనివారం కాకినాడ సిటీలో పర్యటించాలని పవన్ మూడు వారాల క్రితమే నిర్ణయించారు. కిలోమీటరు రోడ్డు షో, తర్వాత సభ ఏర్పాటు చేయాలని భావించారు. దీనికోసం రెండు రోజుల క్రితమే టీడీపీ, జనసేన నేతలు అనుమతుల కోసం డీఎస్పీ, నియోజకవర్గ ఆర్వోకు దరఖాస్తు చేశారు. కాకినాడ సిటీలో పవన్ పర్యటిస్తే తాను ఓడిపోతామనే భయంతో ద్వారం పూడి అధికారులు, పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. పవన్ పర్యటనకు కాకినాడ నగరంలో ఎక్కడ అనుమతులకు దరఖాస్తు చేసినా తిరస్కరించేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అదే సమయంలో, అదే ప్రాంతంలో ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందం టూ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు.