Share News

Pantham Nanaji: క్షమాపణలు చెప్పిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ.. బూతుల దండకంపై ఏమన్నారంటే

ABN , Publish Date - Sep 22 , 2024 | 07:33 AM

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ) ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, రాయలేని బూతు పదాలు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగివచ్చారు. క్షమాపణలు కోరారు.

Pantham Nanaji: క్షమాపణలు చెప్పిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ.. బూతుల దండకంపై ఏమన్నారంటే

కాకినాడ: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ) ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, రాయలేని బూతు పదాలు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగివచ్చారు. క్షమాపణలు చెప్పారు. ‘‘ కేసు ఫైల్ చేయొద్దని కూడా నేను అడగడం లేదు. నేను వైద్య వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. వైద్య వృత్తికి క్షమాపణలు చెబుతున్నాను’’ అని ఆయన ప్రకటించారు.

దాడికి గురైన డాక్టర్‌ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. కేసు పెడుతున్నామని చెప్పారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ‘‘రెండు మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ముందుగా నేరస్థులను గుర్తించాలి. నేను ఫిర్యాదు చేస్తాను. నాతో పాటు దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి మీద నాకు కోపం, కసి లేవు. కానీ పది మంది మధ్య చేసిన పని బాలేదు’’ అని విచారం వ్యక్తం చేశారు.


పవన్ మందలింపుతోనేనా

ఎమ్మెల్యే నానాజీ బూతుల దండకపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం. కాకినాడ జిల్లా కలెక్టర్‌ షన్‌ మోహన్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ రాజీ ప్రయత్నాలు చేశారు. క్షణికావేశంలో దురదృష్టవశాత్తు అలా జరిగిపోయిందని ఎమ్మెల్యే చెప్పడంతో... ప్రొఫెసర్‌ ఒకింత తగ్గారు. కానీ, వైద్య విద్యార్థులు మాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం ఘటనను తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని అసోసియేసన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పిడకాల శ్యాంసుందర్‌ డిమాండ్‌ చేశారు.


గొడవ ఎలా జరిగింది

ఆర్‌ఎంసీ మైదానంలో పంతం నానాజీ అనుచరులు అనధికారికంగా కొన్ని నెలలుగా వాలీబాల్‌ ఆడుతున్నారు. మైదానంలో ఆడొద్దంటూసదరు యువకులకు కళాశాల అధికారులు సూచించారు. ఎమ్మెల్యే ఆర్‌ఎంసీ అధికారులకు ఫోన్‌ చేయగా, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. నిర్ణయం తీసుకోకమునుపే శనివారం ఎమ్మెల్యే అనుచరులు మైదానానికి వచ్చారు. వాలీబాల్‌ నెట్‌ కడుతుండగా, డాక్టర్‌ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. అనుమతులు వచ్చే వరకు ఆగాలని సూచించారు. దీంతో ఆ యువకులు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు.


‘మిమ్మల్ని ఉమామహేశ్వరరావు తిట్టారు’ అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పంతం హుటాహుటిన ఆర్‌ఎంసీ మైదానానికి వచ్చారు. ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై రాయలేని తిట్ల దండకాన్ని అందుకున్నారు. లం...కొడకా... చంపేస్తా... అంటూ దూసుకెళ్లారు. ఆయన ఫేస్‌ మాస్క్‌ను దురుసుగా తొలగించారు. చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నించారు. ఈలోగా వెనుక నుంచి ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. ‘సార్‌ మిమ్మల్ని నేను తిట్టలేదు. వారు చెపుతున్న దానిలో వాస్తవం లేదు’ అంటూ ప్రొఫెసర్‌ చెపుతున్న వివరణను ఎమ్మెల్యే వినే ప్రయత్నం చేయలేదు. అంతా కలసి డాక్టర్‌ను నెట్టేశారు. ఘటనపై ఆర్‌ఎంసీ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.

Updated Date - Sep 22 , 2024 | 07:54 AM