Janasena: జనసేన సీట్లు ఖరారు.. కేటాయించిన నియోజకవర్గాలివే!
ABN , Publish Date - Mar 07 , 2024 | 04:33 AM
తెలుగుదేశం, జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వదలచిన 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత ఖరారు చేశారు.
చంద్రబాబుతో పవన్ భేటీ.. గంటన్నర పాటు చర్చలు
విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమలో 6, కృష్ణాలో 2
శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరుల్లో ఒక్కోటి
ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా..
పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు
టీడీపీ ఆశావహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్న
జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినతి
అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం, జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వదలచిన 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత ఖరారు చేశారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నరపాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా ల్లో ఒక్కోచోట జనసేన బరిలోకి దిగనుంది.
ఆ రెండు స్థానాలపై..
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దాని బదులు మాడుగుల సీటు ఇచ్చి పెందుర్తిని టీడీపీకి తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు బుధవారం చంద్రబాబును కలిశారు. దీనిపై కసరత్తు నడుస్తోంది. అలాగే అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. కానీ పి.గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దానిని ఆ పార్టీకి ఇచ్చి అమలాపురం సీటు తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా తర్జనభర్జన నడుస్తోంది. ఈ రెండు తప్ప మిగిలిన సీట్లు ఖరారైనట్లేనని రెండు పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి. టీడీపీ తరఫున తమ పార్టీనేతలతో మాట్లాడి ఒప్పించే బాధ్యత అచ్చెన్నాయుడు, ఇతర నేతలు చేపట్టారు. నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రైల్వేకోడూరు నేత రూపానందరెడితో కూడా మాట్లాడారు. కాగా.. తమకు ఖరారైన సీట్లలో అభ్యర్థులను ప్రకటించడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లోనే వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడంతో అక్కడ పోటీ పెరిగింది. తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వ్యాపారవేత్త గంటా నరహరి, జనసేన సీనియర్ నేత హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన దివంగత మాజీమంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు లక్ష్మి అదే జిల్లాలో దర్శి టికెట్‌ను ఆశిస్తూ జనసేన నేతలను కలిసినట్లు తెలిసింది.
జనసేనకు కేటాయించిన సీట్లు ఇవీ..
(ఉమ్మడి జిల్లాల వారీగా)..
శ్రీకాకుళం జిల్లా-పాలకొండ (ఎస్సీ); విజయనగరం-నెల్లిమర్ల; విశాఖపట్నం-విశాఖ దక్షిణ, పెందుర్తి/మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి; తూర్పుగోదావరి-కాకినాడ రూరల్, రాజోలు(ఎస్సీ), రాజానగరం, అమలాపురం/పి.గన్నవరం, పిఠాపురం; పశ్చిమగోదావరి-భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం(ఎస్టీ); కృష్ణా-విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ; గుంటూరు- తెనాలి; ప్రకాశం-దర్శి; చిత్తూరు-తిరుపతి), అనంతపురం-అనంతపురం; కడప- రైల్వేకోడూరు.