Share News

ISCON: 108 రకాల నైవేద్యాలతో ఇస్కాన్ టెంపుల్‌లో జన్మాష్టమి వేడుకలు..

ABN , Publish Date - Aug 26 , 2024 | 11:39 AM

దేశ వ్యాప్తంగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని ఎనిమిదవ తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు దేవకీ మాత అష్టమ గర్భాన జన్మించాడు.

ISCON: 108 రకాల నైవేద్యాలతో ఇస్కాన్ టెంపుల్‌లో జన్మాష్టమి వేడుకలు..

విజయవాడ: దేశ వ్యాప్తంగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని ఎనిమిదవ తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు దేవకీ మాత అష్టమ గర్భాన జన్మించాడు. కాబట్టి ఈ రోజున మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటూ ఉంటాం. ఈ వేడుకల కోసం ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతుల నడుమ మెరుస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే మనకు గుర్తొచ్చేవి కన్నయ్య జన్మించిన మధుర, బృందావనం. అయితే దక్షిణాదిలోనూ జన్మాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కర్ణాటకలోని ఉడిపిలో కన్నయ్య జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుంటే అక్కడ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.


విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ టెంపుల్‌లో కొలువైన రాధా కృష్ణులను దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్ టెంపుల్ నిర్వహించనుంది. ఆగస్టు 25 ,26, 27 తేదీలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. నిన్నటి నుంచే వివిధ కార్యక్రమాలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. 108 రకాల నైవేద్యాలతో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాధాకృష్ణులకి 2వేల కిలోలతో పుష్పాభిషేకం నిర్వహించారు. అలాగు ఇస్కాన్ దేవాలయంలో పంచామృతాలతో కలశ అభిషేకాలను సైతం కన్నయ్యకు నిర్వహిస్తున్నారు.


జిల్లా స్థాయిలో కళాశాల విద్యార్థులతో ఉట్టి మహోత్సవ కాంపిటేషన్‌ను విజయవాడ ఇస్కాన్ టెంపుల్ నిర్వహించనుంది. రాధాకృష్ణ ఉట్టి మహోత్సవ కాంపిటీషన్‌లో గెలుపొందిన విజేతలకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని చేతుల మీదుగా ఇస్కాన్ యాజమాన్యం బహుమతులు అందించనుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో సాయంత్రం ఉట్టి వేడుకలు జరుగనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విజయవాడలో ఆలయాలలో రద్దీ నెలకొంది. ఇక జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే జన్మాష్టమి రోజున కొన్ని పరిహారం చేయడం వల్ల శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు ఉపవాసంతో పాటు పరిహారాలు చేయడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయట.

Updated Date - Aug 26 , 2024 | 12:42 PM