సముద్ర మార్గాన జంప్
ABN , Publish Date - Sep 18 , 2024 | 05:18 AM
గనుల అక్రమాల్లో ఘనుడు వెంకటరెడ్డి నీటిపై తేలుతూ దేశం దాటి వెళ్లి పోయారు. నదిలో ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటించినట్లు, ప్రభుత్వం మారగానే ఓడలో దేశం దాటేశారు.
ఓడ ఎక్కి ఉడాయించిన గనుల వెంకటరెడ్డి!
విచారణ జరిగితే దొరికిపోతానని
భయపడి చంద్రబాబు ప్రమాణానికి ముందురోజే పరార్ కోస్ట్‌గార్డు అధికారిగా
పాత పరిచయాల వాడకం చెన్నై నుంచి భార్యతో విదేశాలకు
సముద్ర ప్రయాణానికి పది లక్షల ఖర్చు
బంధువుల ద్వారా ఏసీబీకి సమాచారం
ఏ దేశానికి వెళ్లిందీ గుర్తించే యత్నం అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసు!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గనుల అక్రమాల్లో ఘనుడు వెంకటరెడ్డి నీటిపై తేలుతూ దేశం దాటి వెళ్లి పోయారు. నదిలో ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటించినట్లు, ప్రభుత్వం మారగానే ఓడలో దేశం దాటేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే (జూన్ 7) భార్యతో కలిసి విజయవాడ నుంచి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లారు. దేశం దాటి వెళ్లేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయడానికి ఒక్కరోజు ముందు, జూన్ 11న, భార్యతో కలిసి ఓడ ఎక్కేశారు. కేంద్ర సర్వీసు ఇండియన్ కోస్ట్ గార్డులో సీనియర్ సివిల్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకట రెడ్డి.. ఆ పరిచయాలతో సముద్ర మార్గం ద్వారా ఉడాయించారు. సాధారణంగా ఎయిర్‌పోర్టులపై అందరి దృష్టి ఉంటుందని భావించి, ఆయన ఈ ‘దారి’ని ఎంచుకున్నారని భావిస్తున్నారు. వెంకటరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్‌గా మూడేళ్లపాటు పని చేసి సుమారు రూ. మూడు వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టాడు. తాడేపల్లి ’ముఖ్య’నేతలకు భారీగా దోచి పెట్టారు.. ఆయన హయాంలో మైనింగ్‌లో ఘోరమైన ఉల్లంఘనలకు పాల్పడి రూ.2,856 కోట్ల ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. మే 2021 నుంచి జూన్ 2024 వరకూ ప్రైవేటు ఏజెన్సీలు భారీగా ఇసుక తవ్వకాల్లో అగ్రిమెంట్ షరతులను ఉల్లంఘించాయి. అయినా, వాటిపై వెంకటరెడ్డి చర్యలు తీసుకోలేదు. పైగా, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యం వ్యవహరించిన ఆయన, అప్పటి ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకరించారు. తన నిర్వాకాలు బయటపడతాయనే భయంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే దేశం నుంచి వెంకటరెడ్డి ఉడాయించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరిన వెంటనే ఇసుక తవ్వకాలు, మైనింగ్ అక్రమాలపై ప్రాథమిక నివేదిక తెప్పించింది. వెంకటరెడ్డి ఇష్టారాజ్యంగా చేసిన దోపిడీపర్వం గురించి పలు ఆధారాలు లభించడంతో ఆయనను సస్పెండ్ చేసి పూర్తిస్థాయి ఏసీబీ విచారణకు ఈ ఏడాది ఆగస్టు 1న ఆదేశించింది. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.... గనుల శాఖలో అక్రమాల పుట్టను పసిగట్టారు. ఇటీవలే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వెంకట రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, ఆయన జాడ కనిపించలేదు. విజయవాడలోని మైనింగ్ గెస్ట్ హౌస్‌లో మూడేళ్లకు పైగా వెంకట రెడ్డి బస చేశారు. ఈ ఏడాది జూన్ 6న అక్కడున్న అటెండర్ రాజును మంగంపేటకు బదిలీ చేశారు. అంతకు ముందురోజు తన సామాన్లన్నీ వెంకటరెడ్డి ప్యాక్ చేసినట్లు ఏసీబీ అధికారులకు రాజు తెలిపారు. అయితే, ఎప్పుడు వెంకట రెడ్డి గెస్ట్ హౌస్ వదిలి వెళ్లారనేది తెలియదని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఇళ్లు రెండు నెలల క్రితమే ఖాళీ చేశారని, కడప జిల్లాలోని ఆయన సొంతూరులోనూ ఇంటికి తాళం వేసి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని చెబుతున్నారు.
ఎలా పారిపోయారు?
వెంకటరెడ్డి ఫోను ఎప్పటి నుంచి స్విచ్చాఫ్ అయిందో టెక్నాలజీ ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు. చివరిగా రెండు నెలల క్రితం సమీప బంధువుకు వాట్సాప్ ద్వారా పత్రికల్లో తనపై వచ్చిన వార్తల కటింగ్స్ వెంకటరెడ్డి పంపినట్లు పసిగట్టారు. దాని ఆధారంగా కడప జిల్లాలో ఉంటున్న ఆ బఽంధువు ఇంటితలుపు తట్టారు. అక్కడ ఆరా తీయగా, చెన్నైలో వెంకటరెడ్డికి బంధువులు ఉన్నారని, అక్కడికి జూన్ మొదటి వారంలో భార్యతో కలిసి వెళ్లారని తెలిసింది. చెన్నైకు వెళ్లి విచారించగా తమకు ఏమీ తెలీదని, సొంత శాఖకు తిరిగి వెళుతున్నట్లు మాత్రమే చెప్పారని అక్కడివారు సమాధానమిచ్చారు. అయితే ఇండియన్ కోస్ట్ గార్డులో పనిచేసిన వెంకటరెడ్డి అక్కడ తనకు పరిచయం ఉన్న వారి ద్వారా చెన్నైలో షిప్పు ఎక్కి భార్యతో సహా విదేశాలకు ఉడాయించినట్లు తెలుస్తోంది. పదిరోజుల పాటు సముద్రంలో ప్రయాణించే షిప్పులో పది లక్షలు చెల్లించి దంపతులిద్దరూ దేశం దాటినట్లు సమాచారం. ఏ దేశానికి షిప్పులో వెళ్లారు....ఎవరు సహకరించారు...అక్కడ షిప్పు దిగిన దేశంలోనే ఉన్నారా.. లేదా మరో దేశంలో తలదాచుకున్నారా.. తదితర వివరాలు సేకరించలే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉన్నారు. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.