అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయరేం?
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:14 AM
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాదు.. ప్రేరేపించేవారిని కూడా అరెస్టు చేయాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.
పోస్టులు పెట్టించిన వారినీ అరెస్టు చేయాల్సిందే
ప్యాలెస్‌లో ఉన్నోళ్లనూ అరెస్టు చేస్తేనే మహిళలకు భద్రత
నన్నూ, అమ్మనూ, సునీతనూ అవమానించారు
ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని వాళ్లకు విపక్ష హోదానా? : షర్మిల
చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ!
కడపలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
కడప, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాదు.. ప్రేరేపించేవారిని కూడా అరెస్టు చేయాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా తననూ, తన తల్లినీ, సునీతనే కాదు.. ఇతర రాజకీయ నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లను అవమానిస్తే చిన్నవాళ్లను బాధ్యులను చేయడంతో సరిపెట్టకూడదన్నారు. పోస్టులు పెట్టిస్తున్న వారిని అరెస్టు చేస్తే మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉంటాయని అన్నారు. కడప కలెక్టరేట్ వద్ద షర్మిల బుధవారం విలేకరులతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ అంతకుముందు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినపుడు అవినాశ్‌రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానమివ్వాలన్నారు. చేయించేవాళ్లు ఏ ప్యాలె్‌సలలో బతుకుతున్నా అరెస్టు చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలని అన్నారు. ‘ఎమ్మెల్యే జగన్‌అసెంబ్లీకి వెళ్లడట. మాట్లాడట. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీయడట. అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి లేదా?’ అని నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం చేతకాని ఆయనకు విపక్ష హోదా ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. ‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ’ అన్నట్లు.. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్లీ మళ్లీలాగా పరిస్థితి తయారైందని షర్మిల ధ్వజమెత్తారు.