‘హలో మదనపల్లె’
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:43 PM
మదనపల్లె పట్టణానికి మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
వీనులవిందైన పాటలు, విలువైన సమాచారం
త్వరలో మదనపల్లెకు మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు
మిట్స్ ఎఫ్‌ఎంకు తోడుగా మరో మూడు ఎఫ్‌ఎం స్టేషన్లు
మదనపల్లె టౌన్, ఆగస్టు 28: మదనపల్లె పట్టణానికి మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్త ఎఫ్‌ఎం (ఫ్రీక్వెన్సీ మోడ్యులస్) రేడియో స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాల్లో మొత్తం 68 కొత్త ఎఫ్‌ఎం స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అన్నమయ్య జిల్లాలో 2.50 లక్షల మంది జనాభా ఉన్న ప్రధాన పట్టణం మదనపల్లెలో మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చాయి.
ఏఐఆర్‌కు దీటుగా ఎఫ్‌ఎం రేడియో
దేశవ్యాప్తంగా గతంలో ఆలిండియా రేడియో నుంచి ఏఎం (యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్) తరంగాలతో వార్తలు, పాటలు, ఇతర సమాచారం ప్రసారమయ్యేది. మారుతున్న ఆధునిక సాంకేతికతతో ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ తరంగాలతో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు వచ్చేశాయి. ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారమయ్యే అంశాలు ఎక్కువ ఫిడిలిటి, కచ్చితత్వంతో, ఒరిజినల్ ప్రోగ్రామ్‌తో స్పష్టంగా శ్రోతలకు వినపడేలా ప్రసారాలు చేస్తుంది. దీంతో ఆలిండియా రేడియో కూడా (ఏఎం) నుంచి ఎఫ్‌ఎం దిశగా తన అడుగులు మార్చుకుంది. ముఖ్యంగా ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు 88 నుంచి 108 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లలో ప్రసారమవుతాయి. ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లలో కూడా రెండు రకాలు ఉన్నాయి. వైడ్‌బ్యాండ్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్, న్యారో బ్యాండ్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లుగా విభజించారు. ఈ రెండింటిలోను వాటికవే ఉపయోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాలకు మాత్రమే పరిమితమైన ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఇప్పుడు అదనంగా 68 ప్రధాన పట్టణాలకు విస్తరించనున్నాయి.
ఎఫ్‌ఎం రేడియో ద్వారా వినోదాలు ఎన్నో...
ఎప్‌ఎం రేడియో ద్వారా స్థానికంగా జరిగే కార్యక్రమాలు, స్థానిక వ్యాపారాల ప్రచారం, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు శ్రోతలను ఉర్రూతలూగించే పాటలు, సంగీతం, ఇతర సమాచారాన్ని ప్రసారం చేయొచ్చు. మదనపల్లె ప్రాంతంలో ఇప్పటికే మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి (మిట్స్ కళాశాల) ఆధ్వర్యంలో 90.8 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ కింద 0.05 కేడబ్యూతో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ నడుస్తోంది. ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఫ్రీక్వెన్సీని బట్టి ప్రసారాల దూరం అంచనా వేయొచ్చు. చిన్న చిన్న ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు 3 నుంచి 4 మైళ్లు ప్రసార సామర్థ్యం ఉండగా, పెద్దపెద్ద ఎఫ్‌ఎం స్టేషన్లు 60 మైళ్ల దూరం పాటు ప్రసారాలు చేయగల సామర్థ్యం ఉంటాయి. మిట్స్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ 10-15 కిలోమీటర్ల రేడియస్‌లో ప్రసారాలు చేస్తుంది. మిట్స్ రేడియో మొబైల్ యాప్ ద్వారా మొబైల్‌లో వినొచ్చు.
మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లకు అనుమతి
మదనపల్లెలో మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లకు అనుమతిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఎం స్టేషన్ ఏర్పాటు చేయగోరే వారు ఆరు నెలల పాటు నిర్వహించి ఉండాలి. కనీసం రోజుకు 16 గంటల పాటు ప్రసారం చేయగలిగేలా ఉండాలి. దీంతో పాటు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖచే జీవోపీఏ (వాలిడ్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్) తీసుకోవాలి. దీంతో పాటు వైర్‌లెస్ ఆపరేటింగ్ లైసెన్స్ తీసుకుని ఉండాలి. వీటితో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.