Share News

పారిశ్రామిక హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:01 AM

వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని సర్వనాశనం చేయగా...

పారిశ్రామిక హబ్‌గా ఏపీ

విజన్‌-2047తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు: మంత్రి కొల్లు

విజయవాడలో ఏపీ చాంబర్స్‌ ‘బిజినెస్‌ ఎక్స్‌పో’ ప్రారంభం

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని సర్వనాశనం చేయగా... ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనికోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ‘బిజినెస్‌ ఎక్స్‌పో-2024’ శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని, కూటమి ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు అందిస్తూ అండగా ఉంటోందని చెప్పారు.

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంతో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, విజయ డైరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈవో డాక్టర్‌ శేఖర్‌బాబు, కాంటినెంటల్‌ కాఫీ సీఎండీ సీహెచ్‌ రాజేంద్రప్రసాద్‌, ఇసుజు మోటార్స్‌ లిమిటెడ్‌ అధ్యక్షుడు, ఎండీ రాజేష్‌ మిట్టల్‌, ఏపీ చాంబర్స్‌ ప్రెసిడెంట్‌ పొట్లూరి భాస్కరరావు తదితరులు మాట్లాడారు. ఈ బిజినెస్‌ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు పరిశీలించారు. డిసెంబరు ఒకటో తేదీ వరకు ఈ ఎక్స్‌పో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 04:01 AM