Kishan Reddy : అన్యమతస్థులను వేరే శాఖలకు పంపాలన్న టీటీడీ నిర్ణయం అభినందనీయం
ABN , Publish Date - Nov 21 , 2024 | 03:52 AM
హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులుండడంతో అభిప్రాయభేదాలు వస్తున్నాయి.
తిరుమల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులుండడంతో అభిప్రాయభేదాలు వస్తున్నాయి. వారిని వేరే శాఖలకు పంపాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని బుధవారం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల ఏర్పాటైన టీటీడీ బోర్డు తొలి సమావేశంలోనే కొన్ని సానుకూల, అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులుండడంపై అనేక సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. ఏ మతం వారైనా వారివారి మత విశ్వాసాలున్న ప్రాంగణంలోనే పనిచేస్తే బాగుంటుంది. పవిత్రమైన తిరుమలలో రాజకీయపరమైన ప్రసంగాలు, కార్యక్రమాలు, అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెట్టాలని తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. టూరిజం టికెట్లలో దుర్వినియోగం జరిగినట్టు తెలిసింది. తిరుమల పర్యాటక ప్రాంతం కాదు. హిందు దేవాలయాలపై, దేవతలపై విశ్వాసాలు ఉన్నవారే తిరుమలకు రావాలి’ అని కిషన్‌రెడ్డి అన్నారు.