ముగ్గురి ప్రాణాలు తీసిన కోడిపుంజు!
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:20 AM
పందెంకోడి పుంజుతో ఈత కొట్టించేందుకు పోలవరం కాల్వలోకి దిగిన అన్నదమ్ములు, వారిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా దుర్మరణం పాలయిన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకుంది
పందెం పుంజును ఈత కొట్టిస్తూ తండ్రీ కొడుకులు మృతి
పోలవరం కాల్వలోకి దిగిన అన్నదమ్ములు
కాపాడేందుకు వెళ్లిన తండ్రీ మృతి
ఏలూరు జిల్లా కవ్వగుంటలో విషాదం
పెదవేగి, అక్టోబరు 9: పందెంకోడి పుంజుతో ఈత కొట్టించేందుకు పోలవరం కాల్వలోకి దిగిన అన్నదమ్ములు, వారిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా దుర్మరణం పాలయిన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకుంది. కవ్వగుంట శివారున పొలంలోనే నివాసం ఉంటున్న శెట్టిపల్లి వెంకటేశ్వరరావు(45), భార్య దేవి.. దంపతులకు ఇద్దరు కుమారులు మణికంఠ (15), సాయికుమార్ (12). వెంకటేశ్వరరావు కోడి పుంజులు పెంచి, పందేల సమయంలో విక్రయిస్తుంటాడు. పుంజులను పందేలకు సిద్ధం చేసే క్రమంలో ప్రతిరోజూ వాటిని నీళ్లలో ఈత కొట్టిస్తుంటారు. దానికోసం వారి ఇంటికి సమీసాన ఉన్న పోలవరం కుడి కాల్వకు తీసుకెళ్తుంటారు. ఇక్కడ కాల్వ వాలుగా, లోతు ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కాల్వలో నీరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు కుమారులు మణికంఠ, సాయికుమార్.. బుధవారం ఉదయం కోడిపుంజులను ఈత కొట్టించేందుకు కాల్వకు తీసుకెళ్లారు. సాయికుమార్ తాడు పట్టుకుని కాల్వ ఒడ్డున ఉండగా, అన్న మణికంఠ ఒక చేత్తో తాడు, మరో చేత్తో కోడిపుంజును పట్టుకుని నీటిలో దిగాడు. పుంజుకు ఈత కొట్టిస్తున్న సమయంలో పట్టుతప్పి మణికంఠ కాల్వలో పడిపోయాడు. ఒడ్డున ఉన్న సాయికుమార్ అన్నను కాపాడేందుకు దూకాడు. కాల్వలో నీరు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ మునిగిపోయారు. పిల్లల కోసం కాల్వ వద్దకు వచ్చిన వెంకటేశ్వరరావు.. వారు నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించి, కాపాడేందుకు కాల్వలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో అతనూ మునిగిపోయాడు. పిల్లలు, భర్త కోసం గట్టు వద్దకు వచ్చిన దేవి.. నీటిలో మునిగిపోతున్న వారిని చూసి, కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు కాపాడేందుకు ప్రయత్నించారు. అతికష్టమ్మీద వెంకటేశ్వరరావు, మణికంఠను బయటకు తీసుకొచ్చారు. కానీ, అప్పటికే వారిద్దరూ చనిపోయారు. సాయికుమార్ ఆచూకీ దొరకలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాల్వలో గాలించి సాయికుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ఆస్పత్రికి తరలించారు.