జనవరి 21న కృష్ణా బోర్డు భేటీ
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:46 AM
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం వచ్చే నెల 21వ తేదీన జరుగనుంది.
అమరావతి, డిసెంబరు 25 (ఆంఽధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం వచ్చే నెల 21వ తేదీన జరుగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బోర్డు సమాచారం పంపింది. బోర్డు ఆర్థిక వ్యవహారాలు, రెండు రాష్ట్రాలూ ఇవ్వాల్సిన నిధులు, బోర్డు విధివిధానాల ఖరారు, అమరావతికి బోర్డు తరలింపును ఉమ్మడి ఎజెండాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ ఆరు చర్చనీయాంశాలను ప్రతిపాదించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణకు తిప్పి పంపిన నేపథ్యంలో ఈ భేటీలో బోర్డు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తామని ఇటీవల జలశక్తి శాఖ తెలిపింది. 21న జరిగే భేటీలో అయినా దీనిని తేల్చుతారా.. ఎప్పటి మాదిరిగానే దాటవేస్తారా అనే సందేహం నెలకొంది. విభజన చట్టం ప్రకారం ఏనాడో విజయవాడలో కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. కృష్ణా నదితో ఎలాంటి సంబంధమూ లేని విశాఖకు ఈ కార్యాలయాన్ని తరలించాలని ప్రతిపాదించారు. దీనిని కేఆర్‌ఎంబీ కూడా గుడ్డిగా సమర్థించింది.