ఉత్తరాంధ్రలో కుంభవృష్ఠి
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:17 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
బలిమెల డ్యామ్ వద్ద 30 సెంటీమీటర్ల వర్షం
పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం
ఉధృతంగా నదులు, వాగులు.. నిండిన జలాశయాలు
ఒడిశాలోనూ భారీవానలతో ఉప్పొంగిన నదులు
ప్రమాదకర ంగా శబరి.. కూనవరం వద్ద గోదారిలోకి..
గోదావరిలోనూ పెరుగుతున్న వరద
నీట మునిగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
అల్లూరి జిల్లాలో కొండిచరియలు పడి యువతి మృతి
కాలువలకు గండ్లు.. కొట్టుకుపోయిన వంతెనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బలిమెల డ్యామ్ వద్ద ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 30 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. గోవిందపురం (విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం)లో 14, కృష్ణదేవిపేట (అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం), చింతపల్లి(అల్లూరి జిల్లా)లో 13, ముంచంగిపుట్టు(అల్లూరి జిల్లా), పెదనడిపల్లి(చీపురుపల్లి)లో 12, కాకరపాడు(అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం), రణస్థలంలో 11, పూసపాటిరేగ, భీమిలి, బొండపల్లి, బలిఘట్టంలలో 10, మెరకముడిదాం, చీపురుపల్లి, విశాఖపట్నం, గరివిడి, గంపరాయి, నర్సీపట్నం, ఎస్.రాయవరంలలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ఒడిశాలోని మల్కన్‌గిరి, రాయగడ, గజపతి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. మల్కన్‌గిరిలో 25, చిత్రకొండలో 23, కొరుకొండలో 20, మథిలిలో 15, లమత్‌పుట్‌లో 13, అంబదోలలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒడిశాలో భారీవర్షాలు కురవడంతో అటు నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ప్రవహించే నదులు, వాగులకు వరద పోటెత్తింది. అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ ఒడిశాలో కురిసిన వర్షాలకు సీలేరు నదికి వరద పెరిగింది. 2006 తరువాత అత్యధికంగా శబరి నదిలో 10.27 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. ఈ వరద కూడా కూనవరం వద్ద గోదావరిలో కలుస్తోందని, దీంతో మంగళవారంకల్లా గోదావరి ప్రవాహం పెరుగుతుందని తెలిపారు. అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామంలో వరద బీభత్సంతోపాటు కొండచరియలు విరిగిపడటంతో గిరిజన యువతి కొర్రా కుమారి(20) మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోకి వర్షం నీరు చేరడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీలేరు జల విద్యుత్ కేంద్రంలోకి కూడా నీరు ప్రవేశించింది. పాడేరు, లంబసింగి, గాలికొండ ఘాట్ మార్గాల్లో బండరాళ్లు, చెట్లు విరిగిపడటంతో జిల్లాలోని అన్ని ఘాట్ మార్గాల్లో రాకపోకలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. నర్సీపట్నం నుంచి అల్లూరి జిల్లా చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 2,705 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మహేంద్రతనయ, బహుదా, నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గొట్లాబ్యారేజీ గేట్లను ఎత్తివేసి 11,553 క్యూసెక్కుల నీటిని వంశధార నదిలోకి విడిచిపెట్టారు. ఇక నారాయణపురం ఆనకట్ట గేట్లను ఎత్తి నాగావళి నదిలోకి నీటిని వదిలేస్తున్నారు. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాలు ముంపులోనే ఉన్నాయి. పంట పొలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో పలుచోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. అరటి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. నదీతీర ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
అల్లకల్లోలంగా సముద్రం..
తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలో పూరీ వద్ద తీరం దాటింది. తర్వాతీ పశ్చిమ వాయువ్యంగా, తూర్పు ఆగ్నేయంగా పయనించి ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్‌కు 360 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే క్రమంలో ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది.