Share News

కర్నూలు.. వలస బాట!

ABN , Publish Date - Jan 24 , 2024 | 03:11 AM

నేనూ సీమ బిడ్డనే.. కరవు సీమ రాత.. గీత మార్చి కూలీలకు శాశ్వత ఉపాధి చూపిస్తా’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నీటి మీద రాతే అయింది.

కర్నూలు.. వలస బాట!

మిర్చి కోతలకు గుంటూరుకు తరలివచ్చిన 10 వేల కుటుంబాలు మే వరకు ఇక్కడే మకాం

పొలాల్లో టెంట్లే ఆవాసం.. పాములతో సహవాసం

మిర్చి ఘాటుకు తోడు.. పెరుగుతున్న ఎండలు

నీళ్ల కోసం సుదూర ప్రాంతాలకు

బడికెళ్లాల్సిన చిన్న పిల్లలూ పనిలోకే

రాయలసీమకు ఉపాధిపై జగన్‌ హామీ నీటిమూటే!

గుంటూరు సిటీ, జనవరి 23: ‘నేనూ సీమ బిడ్డనే.. కరవు సీమ రాత.. గీత మార్చి కూలీలకు శాశ్వత ఉపాధి చూపిస్తా’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నీటి మీద రాతే అయింది. కర్నూలు ఈ ఏడాది కూడా కడుపు చేత పట్టుకుని గుంటూరుకు వలస వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి కోత సీజన్‌ ఆరంభం కావడంతో కర్నూలు నుంచి సుమారు 10 వేల కుటుంబాలు పనుల నిమిత్తం వచ్చాయి. మిర్చి కోతలు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో భారీ సంఖ్యలో కూలీలు వలస రావడం ఇక్కడి రైతులకు కాస్త ఉపశమనం కలిగింది. సాధారణంగా ఏటా రైతులే ఆ జిల్లాకు వెళ్లి ఎంతో కొంత నగదు ముందస్తుగా చెల్లించి కూలీలను తీసుకొచ్చేవారు. ఈ ఏడాది వాళ్లు కదలాల్సిన పనిలేకుండా అక్కడి నుంచి అధిక సంఖ్యలో కుటుంబాలతో వచ్చేశారు. ఐదేసి కుటుంబాలు కలిసి రూ.10 వేల కిరాయికి ఒక మినీ లారీ మాట్లాడుకుని వంట సామగ్రిని కూడా తీసుకొచ్చుకున్నారు. కర్నూలు జిల్లా కోస్గి, కౌతాలం, కోడుమూరు, కృష్ణగిరి, కల్లూరు మండలాల నుంచి వీరంతా వచ్చారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు, నీలేశ్వరపాలెం, పులిచింతల కాలనీలు, చింతపల్లి, కొత్తపల్లి, చెరుకుంపాలెం, పెదపాలెం, రెంటచింతల మండలంలోని గ్రామాలు వీరితో నిండిపోయాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున కూలీ పడుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో రైతులు వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి కోతలు అప్పగిస్తున్నారు. కర్నూలు నుంచి వచ్చిన వాళ్లు మే మొదటి వారం వరకు ఇక్కడే ఉంటారు.

బాల్యారిష్టాలు..

వలస వచ్చిన వారి పిల్లల పరిస్థితి దయనీయం గా ఉంది. తల్లిదండ్రులు తమతో పాటే వారినీ పనులకు తీసుకెళ్తున్నారు. బడికి వెళ్లి పాఠాలు వల్లె వే యాల్సిన దశలో ఎండలో మగ్గుతున్నారు. ఊరొదిలి వచ్చిన తమకు... పిల్లలు కూడా పనికి వస్తేనే గిట్టుబాటు అవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అంతా పొలాల్లోనే..

పల్నాడు, గుంటూరు జిల్లాలకు వలస వచ్చిన కర్నూలు కూలీల కష్టాలు వర్ణనాతీతం. మిర్చి పొలాలకు దగ్గర్లో చిన్న చిన్న టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు. అక్కడ విష సర్పాల బెడద ఎక్కువగా ఉందని పలువురు చెబుతున్నారు. ఓవైపు మిర్చి ఘాటు ఉందని.. ఫిబ్రవరి నుంచి ఎండ కూడా బాగా పెరిగిపోయి వేడి మరింత ఎక్కువగా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. నీళ్ల కోసం కూడా చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. ఈ నాలుగు నెలలూ ఇక్కట్లు పడక తప్పదని.. ఇంటికెళ్లాక ఎటుతిరిగీ పనులు ఉండవని.. ఇక్కడ సంపాదించిందంతా అక్కడ ఖర్చయిపోతుందని వాపోతున్నారు. గత్యంతరం లేకనే అన్నిటికీ ఓర్చుకుంటున్నామని చెబుతున్నారు. జగన్‌ సీఎం అయ్యాక ఉపాధి కల్పన లేనేలేదని.. తమ ప్రాంతాల నుంచి మరింత మంది వలస బాట పట్టారని కన్నీరు పెట్టుకుంటున్నారు.

కరువు సీమలో ఉపాధి కరువై వలసలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి పెద్దఎత్తున కుటుంబాలకు కుటుంబాలే గుంటూరు జిల్లాకు వలస వచ్చాయి. మిర్చి కోతల పనులు ఇక్కడ ఉండడంతో కనీసం నాలుగు నెలలు పనిచేసినా ఏడాదంతా ఎలాగోలా నెట్టుకురావచ్చన్న ఉద్దేశంతో తరలివచ్చారు.

Updated Date - Jan 24 , 2024 | 09:49 AM