Share News

కూటమిదే గెలుపు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:00 AM

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని తమకు నూటికి నూరు పాళ్లూ విశ్వాసం ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

 కూటమిదే గెలుపు

160 అసెంబ్లీ స్థానాలు మావే కూటమిదే గెలుపు

24 లోక్‌సభ సీట్లు కూడా: చంద్రబాబు

నేను ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. కానీ జగన్‌లా జనాన్ని వేధించి అందరినీ నాశనం చేసే, మానసిక సంతులనం లేని సీఎంను ఎప్పుడూ చూడలేదు.

- చంద్రబాబు

రాష్ట్రం నుంచి ఎన్డీయేకి అదనంగా 20 సీట్లు

జగన్‌కు మానసిక సంతులనం దెబ్బతింది

సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు

వేధింపులు, వినాశనమే ఆయన ధ్యేయం

విపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం

జమిలిని 2017లోనే సమర్థించానని వెల్లడి

‘ది రిపబ్లిక్‌’ సీనియర్‌ జర్నలిస్టు

అర్ణవ్‌ గోస్వామికి ప్రత్యేక ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని తమకు నూటికి నూరు పాళ్లూ విశ్వాసం ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకుందని.. 400కి పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని.. రాష్ట్రం నుంచి అదనంగా 20 లోక్‌సభ స్థానాలిస్తామని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గ్లోబల్‌ పవర్‌గా మారుతోందన్నారు. ‘ది రిపబ్లిక్‌’ టీవీ నిర్వహించిన ‘దేశం తెలుసుకోవాలనుకుంటోంది (నేషన్‌ వాంట్స్‌ టు నో)’ కార్యక్రమంలో భాగంగా సీనియర్‌ జర్నలిస్టు అర్ణవ్‌ గోస్వామికి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగ న్‌ అడిగితే ప్రజలు ఇచ్చారని.. కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ పరిపాలనను జనం చూశారని, అదే విధంగా తన పాలనతో జగన్‌ పాలనను సరిపోల్చుకుంటున్నారని.. ఫలితంగా తమవైపు మొగ్గుతున్నారని తెలిపారు. 2017లోనే తాను జమిలి ఎన్నికలను సమర్థించానని, ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించవచ్చని చెప్పారు. 2047కల్లా వికసిత్‌ భారత్‌ కావాలన్న మోదీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు.


అప్పటికి, ఇప్పటికి ఏం తేడా?

2019లో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏముందని అర్ణవ్‌ అడిగారు. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని, 2019లో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు. జగన్‌ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అక్కడ ప్రజాస్వామ్యమే లేదని.. ఏపీని, తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీయేతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అదే సమయంలో గత పదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జగన్‌ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని, ప్రతి ఒక్కరూ బాధితుడేనన్నారు.

బీజేపీతో పొత్తు ఎందుకు?

బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుతున్నారు.. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అర్ణవ్‌ అడిగారు. చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీయేలో తానెప్పుడూ ఏ హోదానూ ఆకాంక్షించ లేదని, మంత్రి పదవులూ కోరుకోలేదన్నారు. ఈ మహోన్నత దేశానికి తన వంతు సేవ చేయడమే ఏకైక లక్ష్యమని చెప్పారు. జాతి నిర్మాణంలో ఎన్డీయేకి సహకరిస్తామన్నారు. దేశం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే తన అభిప్రాయమని.. మోదీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో సదభిప్రాయం నెలకొని ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో 1999లో 2020 కోసం తాను విజన్‌ రూపొందించానని, అది ఇప్పుడు వాస్తవంగా మారిందని చెప్పారు.


నాపై అవినీతి ఆరోపణల్లేవ్‌..

జగన్మోహన్‌రెడ్డితో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయని అర్ణవ్‌ అడుగగా.. ఆయన తండ్రి, తాను 80వ దశకంలో మిత్రులమని, సన్నిహితంగా ఉండేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. తర్వాత తమ మార్గాలు వేరయ్యాయని, తాను తెలుగుదేశంలోనూ, ఆయన కాంగ్రె్‌సలోనూ ఉండిపోయారని చెప్పారు. తనపై ఏనాడూ అవినీతి ఆరోపణలు లేవని, ఎప్పుడూ స్వచ్చమైన, నిజాయితీతో కూడిన సుపరిపాలనను ప్రజలకు ఇవ్వాలని భావించాలని.. కానీ 2019లో జగన్‌ ముఖ్యమంత్రి కాగానే మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదని, అమరావతి ఏమి పాపం చేసిందని ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తే తమను శత్రువులా చూశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కూడా నాశనం చేశారని.. తనతో ఎవరు విభేదించినా ఆయన వారిపై యుద్ధం ప్రకటిస్తారని చెప్పారు. గత ఐదేళ్లుగా జగన్‌ చర్యలను చూస్తే ఎవరైనా ఆయన మానసికంగా దెబ్బతిన్నారని అంటారని తెలిపారు. సుబ్బారావు అనే వ్యక్తి భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో మార్చారని, ఆయన, ఆయన కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. లక్ష్మి అనే మహిళ నిరసన తెలిపేందుకు వేలు కోసుకుందని చెప్పారు.

దక్షిణాదిన వేళ్లూనుకుంటోంది..

మోదీకి దక్షిణాది వ్యతిరేకంగా ఉందా అని అర్ణవ్‌ అడుగగా.. దక్షిణాదిన సాంప్రదాయికంగా ప్రాంతీయ పార్టీల ఆఽధిపత్యం రాజకీయాల్లో సాగిందని, అయితే బీజేపీ కూడా దక్షిణాదిన వేళ్లూనుకుంటోందని చంద్రబాబు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో టీడీపీ, బీజేపీ అనేకసార్లు కలిసి పనిచేశాయని, తాము సహజ భాగస్వాములమని తెలిపారు. ఇద్దరం కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పనిచేశామని చెప్పారు. ఇప్పుడు మిత్రపక్షంగా తమకు మరింత బాధ్యత ఉంటుందని చెప్పారు. జగన్‌ తనను జైలుకు పంపినందుకు ఎలాంటి విద్వేష భావం లేదని, తాను తప్పు చేయలేదని తనకు తెలుసని, మొత్తం దేశానికీ తెలుసని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనకే మద్దతిచ్చారని తెలిపారు.

రాష్ట్ర సంక్షేమాన్ని పణంగా పెట్టి జగన్‌ రాజకీయాలు చేస్తున్నారు. నాకు, మోదీకి మధ్య సుహృద్భావ, సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన గుంటూరు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అమిత్‌ షా, నడ్డాతో కూడా చర్చిస్తున్నాను. - చంద్రబాబు

Updated Date - Apr 27 , 2024 | 05:00 AM