Share News

రోగులకు పరీక్ష!

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:25 PM

చిన్నపాటి కాలు నొప్పి వచ్చినా.. తల నొప్పి వచ్చినా, కడుపులో మంట అంటూ వైద్యుడి వద్దకు వెళ్లితే ల్యాబ్‌ పరీక్షలు తప్పడం లేదు. నేడు వ్యాధి ఏదైనా రక్తపరీక్షలు, స్కానింగులు సర్వ సాధారణంగా మారాయి.

రోగులకు పరీక్ష!

అందినకాడికి దోచేస్తున్న ల్యాబ్‌ నిర్వాహకులు

ల్యాబ్‌ల్లో కానరాని ధరల పట్టిక

తనిఖీలు చేసినా షోకాజ్‌ నోటీసులతో సరి

ఏలూరు క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : చిన్నపాటి కాలు నొప్పి వచ్చినా.. తల నొప్పి వచ్చినా, కడుపులో మంట అంటూ వైద్యుడి వద్దకు వెళ్లితే ల్యాబ్‌ పరీక్షలు తప్పడం లేదు. నేడు వ్యాధి ఏదైనా రక్తపరీక్షలు, స్కానింగులు సర్వ సాధారణంగా మారాయి. కొంతమంది వైద్యులైతే తమ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లలోనే చేయించాలని మరీ చెప్పి అప్పటి కప్పుడు ఆ పరీక్షలు చేయిస్తున్నారు. ఇక ల్యాబ్‌ నిర్వాహకులు వారి ఇష్టం వచ్చినట్టు సొమ్ము లను వసూలు చేస్తున్నారు. జిల్లాలో సాధారణ ల్యాబ్‌లు లైసెన్సు పొందినవి 96 ఉండగా, అత్యాధునిక పరిజ్ఞానంతో ఉన్న ఖరీదైన ల్యాబ్‌ లు 10 ఉన్నాయి. ఇంకా 81 ఆస్పత్రులు తమ అనుబంధ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అనుమతు లు పొందారు. మొత్తం మీద జిల్లాలో 186 ల్యాబ్‌లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతులను పొందాయి. ఎవరైనా ల్యాబ్‌ పెట్టాలంటే ఎంఎల్‌టీ లేదా డీఎంఎల్‌టీ కోర్సు సర్టిఫికెట్‌ ఉండాలి. అంతేకాకుండా మరో ఎంబీబీఎస్‌ చదివిన వైద్యుల సర్టిఫికెట్‌, వారు ఏ పరీక్షకు ఎంత సొమ్ము వసూలు చేస్తారో ధరల పట్టిక, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఆ స్థలానికి సంబంధించిన యజమానితో ఒప్పంద పత్రం, ఫైర్‌ సేఫ్టీ వంటి సర్టిఫికెట్లతో దరఖాస్తు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి చేసుకోవాలి. లైసెన్సు పొందేందుకు దరఖాస్తులో చూపించిన ధరల పట్టికను ల్యాబ్‌లో ప్రదర్శనగా పెట్టాల్సి ఉన్నా చాలా ల్యాబ్‌ల్లో కానరావడం లేదు. ఒకవేళ ఎక్కడైనా ధరల పట్టిక ఉన్నా అవి పాత ధరలంటూ మరీ వసూలు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఉండే ఏలూరు నగరంలోనే కొన్ని ల్యాబ్‌ల నిర్వాహకులు అడ్డంగా దోచేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఆర్‌ఎంపీలే వైద్యుల అవతారం ఎత్తి ఎలాంటి అనుమతులు లేకుండానే ల్యాబ్‌లు నిర్వహించేస్తున్నారు.

తనిఖీలు ఏవి.. చర్యలు ఏవీ?

కొంతమంది ల్యాబ్‌ నిర్వాహకులు నాణ్యతలేని పరీక్షలు నిర్వహించి రిపోర్టులను ఇస్తు న్నారు. కొంతమంది అనుమతి లేని మిషన్లు పెట్టేసి పరీక్షలు చేస్తున్నారు. డెంగీ ఫీవర్‌ నిర్ధారణకు మూడు విధాలైన (కిట్లు, పీసీఆర్‌, ఎలిసా) పరీక్షలు ఉన్నా ఏలూరు ప్రభుత్వా స్పత్రిలో మాత్రమే స్పష్టమైన డెంగీ నిర్ధారణ పరీక్ష (ఎలిసా) వైద్య పరీక్ష యంత్రం ఉంది. జిల్లాలో ఇష్టానుసారంగా అనుమతులు లేని ల్యాబ్‌లను నిర్వహిస్తున్న, అనుమతి తీసు కున్న కొంతమంది ల్యాబ్‌ నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ తనిఖీలు జరిగినా చర్యలు శూన్యమనే తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 ల్యాబ్‌లను తనిఖీలు చేసి 50 మందికి షోకాజు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ధరల బోర్డులు పెట్టాలి

ఇటీవల ల్యాబ్‌లపై ఫిర్యాదులు వస్తున్నా యి. వచ్చే వారంలో ల్యాబ్‌ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించి తగిన ఆదేశాలు ఇస్తాం. ఒకటి రెండు సార్లు షోకాజు నోటీసులు ఇచ్చి మూడోసారి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ల్యాబ్‌లో ధరల బోర్డులు పెట్టాలి. సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు నిర్వహించలేకపోతున్నాం ఉన్న సిబ్బందితోనే తనిఖీలు చేసి షోకాజు నోటీసులు అందిస్తున్నాం. నోటీసులకు స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాం.

డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ట, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, ఏలూరు జిల్లా

Updated Date - Nov 27 , 2024 | 11:25 PM