Share News

భూముల ధరలకు రెక్కలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:00 AM

భూముల రిజిస్ర్టేషన్‌ విలువను పెంచేందుకు మళ్లీ అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.

  భూముల ధరలకు రెక్కలు

రిజిస్ర్టేషన్‌ విలువ పెంచే యోచనలో ప్రభుత్వం

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

భూముల రిజిస్ర్టేషన్‌ విలువను పెంచేందుకు మళ్లీ అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. జాతీయ రహదారులు, వాణిజ్య పరమైన ప్రాంతాల్లో పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిఏటా, గ్రామీణ పరిధిలో రెండేళ్లకు ఒకసారి భూముల విలువను పెంచాలి. వైసీపీ హయాంలో భూములు ధరలు పెరగలేదు. బహిరంగ మార్కెట్‌లోనూ అమ్ముడు పోలేదు. పైగా ధరలు పతనమయ్యాయి. అయినా సరే ఏదో వంకతో రిజిస్ర్టేషన్‌ విలువను అప్పట్లో పెంచారు. భవనాలపై ధరలు పెంచేశారు. అలాగే భీమవరం వంటి జిల్లా కేంద్రంలోనూ 20శాతం పెంపుదల చేశారు. అయినా సరే రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం పెరగలేదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. జిల్లాలో గత ఏడాది 70శాతం ఆదాయం కూడా సాధించలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్లోనూ ఆశలు చిగురించాయి. రిజిస్ర్టేషన్‌ ఆదాయం పెరుగుతుందంటూ అంచనాలు వేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా భూముల రిజిస్ర్టేషన్‌ విలువను పెంచాలని యోచిస్తున్నారు. అయితే అంతిమంగా ప్రభుత్వం అనుమతితోనే పెంచాల్సి ఉంటుంది. అంతలోగా క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

హైవేల వైపు డిమాండ్‌

జాతీయ, రాష్ట్ర హైవేలకు ఆనుకుని ఉన్న భూములకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు అధికంగా చెపుతున్నారు. అమ్మకాలు జరగకపోయినా సరే కొనుగోలు చేద్దామంటే ధర అధికంగా ఉంటోంది. ప్రధాన రహదారులకు ఆనుకుని ఇరువైపుగా భూములకు డిమాండ్‌ ఉంటుందని రిజిస్ర్టేషన్‌ శాఖ ఒక అంచనాకు వచ్చింది. అక్కడే ధరలు పెంచేలా నిర్ణయం తీసుకోనుంది. కనిష్టంగా 10శాతం పెంచాలని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం,– తణుకు మీదుగా వెళ్లే 216 జాతీయ రహదారి, నర్సాపురం–మచిలీ పట్నం వెళ్లే జాతీయ రహదారిపై దృష్టి సారించారు. అలాగే రాష్ట్ర హైవేలకు అనుకుని ఉన్న భూములపైనా ఆరా తీస్తున్నారు. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు ఉండి, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాలు మీదుగా నిర్మాణం కానున్న జాతీయ రహదారికి ఆనుకుని భూముల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే ధరలు పెరిగి రిజిస్ర్టేషన్‌ కాని చోట మాత్రం పెంచేందుకు రిజిస్ర్టేషన్‌ అధికారులు విముఖతతో ఉన్నారు. రిజిస్ర్టేషన్‌లు కాని చోట పెంచడం వల్ల ఫలితం ఉండదని తలపోస్తున్నారు. డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకే పెంపు పరిమితమయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

నిర్మాణాల్లో కదలిక

వైసీపీ ప్రభుత్వంలో నిలచిపోయిన నిర్మాణ ప్రాజెక్ట్‌లకు ఇప్పుడు మోక్షం లభించింది. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి రియల్టర్‌లు, బిల్డర్లు ముందుకొస్తున్నారు. ప్లాన్‌లు పెట్టుకుంటున్నారు. అభివృద్ధి కోసం భూ యజమానులను సంప్రదిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హైదారాబాద్‌ వెళ్లిపోయిన బిల్డర్‌లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మళ్లీ ఇప్పుడు జిల్లా వైపు తొంగిచూస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ అభివృద్ధికి సూచకంగా అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా రిజిస్ర్టేషన్‌ శాఖ సైతం భూముల విలువ పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతలకే పెంపు ప్రతిపాదనలను పరిమితం చేయనున్నారు. అంతిమంగా ప్రభుత్వ ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే రిజిస్ర్టేషన్‌ భూముల విలువ పెరగనుంది,

వాణిజ్య సముదాయాలపై దృష్టి

పట్టణ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న పల్లెలు, పట్టణాల్లోనూ వాణిజ.్య సముదాయాల వద్ద విలువను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ పారిశ్రామిక పార్క్‌లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఉంది. దీనివల్ల వాణిజ్య ప్రాంతాల్లో డిమాండ్‌ ఏర్పడనుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ మార్పులు తీసుకువస్తున్నారు. ప్రైవేటు మద్యాన్ని ప్రోత్సహించారు. అదే విధంగా ఆక్వా రంగానికి ప్రోత్సహకాలు అందిస్తున్నారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పల్లెల్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. పట్టణాల్లోనూ మున్సిపల్‌ నిధులకు వెసులుబాటు కల్పించాలని సంకల్పించారు. దీనివల్ల మౌలిక వసతులు పెరగనున్నాయి. దీనివల్ల వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఫలితంగా భూములు, స్థలాలకు డిమాండ్‌ ఉంటుందని ఆశిస్తున్నారు. దాంతో వాణిజ్య సముదాయాల వద్ద పెంపు దల చేసేలా రిజిస్ర్టేషన్‌ శాఖ వ్యూహం రచించింది.

Updated Date - Oct 22 , 2024 | 01:00 AM